Qatar: ఖతార్‌లో ఆ 8 మంది భారత మాజీ సైనికులకు ఊరట.. మరణశిక్ష నుంచి ఉపశమనం
ABN , Publish Date - Dec 28 , 2023 | 04:39 PM
గూఢచర్యం కేసులో ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు గురువారం (28/12/23) పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై వారి మరణశిక్షపై స్టే విధిస్తూ ఖతార్ కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని...
Relief For 8 Indian Navy Veterans In Qatar: గూఢచర్యం కేసులో ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు గురువారం (28/12/23) పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై వారి మరణశిక్షపై స్టే విధిస్తూ ఖతార్ కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. వారి మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించినట్టు పేర్కొంది. వివరణాత్మక తీర్పు కోసం వేచి ఉన్నామని.. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు తాము న్యాయబృందంతో పాటు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్నామని ఎంఈఏ తెలిపింది. విచారణ సందర్భంగా రాయబారులు, ఇతర అధికారులు కోర్టుకు హాజరైనట్టు ఒక ప్రకటనలో చెప్పింది.
ఆ 8 మంది భారతీయుల మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించడం మంచి పరిణామమే గానీ.. ఎన్నాళ్లపాటు ఆ శిక్షను విధించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఈ అంశంపై ఖతార్ అధికారులతో తాము చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తాము మొదటి నుండి 8 మంది కుటుంబాలకు అండగా ఉన్నామని, అయితే ఇది సున్నితమైన విషయం కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడటం సరికాదని అధికారులు తెలిపారు. ఖతార్ ప్రభుత్వం ముందు ఈ విషయం గురించి నిరంతరం లేవనెత్తుతూనే ఉన్నామని, దాన్ని కొనసాగిస్తూనే ఉంటామని విదేశాంగ శాఖ పేర్కొంది. అటు.. ఆ 8 మంది భారతీయుల శిక్షను తగ్గించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతకీ ఈ కేసు ఏంటి?
ఆ 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా అనే సంస్థలో పని చేసేవారు. ఈ సంస్థ.. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర సేవలు అందిస్తుంది. దీనిని ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. కట్ చేస్తే.. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో ఆ 8 మంది భారతీయుల్ని గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. ఈ ఏడాది అక్టోబర్‌లో వారికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేయగా.. దాన్ని పరిగణనలోకి తీసుకుని, వారి మరణశిక్షను జైలుశిక్షగా తగ్గించారు.