Share News

Supreme Court: ఎమ్మెల్యేలు ఫిరాయింపులు..చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు

ABN , Publish Date - Mar 25 , 2025 | 06:37 PM

Supreme Court: పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. మరి అలాంటి వేళ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌దే తుది నిర్ణయం.. మరి పార్టీ మారినట్లు ఆధారాలున్నా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సైతం ఎందుకు చర్యలు తీసుకోలేక పోతుందనే ప్రశ్నలు తలెత్తుతోన్నాయి.

Supreme Court: ఎమ్మెల్యేలు ఫిరాయింపులు..చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
Supreme Court

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటరు పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్‌ చేపట్టింది. దీంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ కోర్టు తలుపు తట్టింది. మరోవైపు గత పదేళ్ల కేసీఆర్ పాలనలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ కుండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసింది తప్పు కానప్పుడు.. మేము చేసింది తప్పు ఎలా అవుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు.. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

అదీకాక.. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. మరి అలాంటి వేళ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌దే తుది నిర్ణయం.. మరి పార్టీ మారినట్లు ఆధారాలున్నా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సైతం ఎందుకు చర్యలు తీసుకోలేక పోతుందనే ప్రశ్నలు తలెత్తుతోన్నాయి.


పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌దే తుది నిర్ణయం.. ఎందుకంటే..

పార్టీ ఫిరాయింపు (డిఫెక్షన్)కేసుల్లో ఎమ్మెల్యేలపై అనర్హత విధించే విషయంలో స్పీకర్‌కు తుది నిర్ణయాధికారం ఉండటం భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఆంటీ-డిఫెక్షన్ లా) ప్రకారం నిర్దేశించబడింది. ఈ చట్టం 1985లో 52వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటంతోపాటు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వ్యక్తిగత లాభాల కోసం పార్టీలు మారడాన్ని నిరోధించడం. ఈ సందర్భంలో స్పీకర్‌కు ఎందుకు అధికారం ఇవ్వబడింది. సుప్రీంకోర్టు ఎందుకు నేరుగా చర్యలు తీసుకోలేకపోతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


స్పీకర్‌కు అధికారం ఎందుకు?

10వ షెడ్యూల్ ప్రకారం, ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన పార్టీని స్వచ్ఛందంగా వదిలేస్తే లేదా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటువేస్తే,వారిపై అనర్హత విధించే అధికారం స్పీకర్ లేదా ఛైర్మన్‌కు ఉంటుంది. ఈ అధికారం స్పీకర్‌కు ఇవ్వడానికి కారణం, శాసనసభలో అతను అధ్యక్ష స్థానంలో ఉండటంతోపాటు రాజ్యాంగపరంగా శాసనసభ వ్యవహారాలను నిర్వహించే బాధ్యత

ఆయనపై ఉంటుంది. 1992లో కిహోటో హోల్లోహన్ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టాన్ని సమర్థించింది. స్పీకర్‌ను ఓ ట్రైబ్యునల్‌గా పరిగణించి, అతనిది తుది నిర్ణయమని చెప్పింది.శాసనసభ స్వతంత్రతను కాపాడడంతోపాటు న్యాయవ్యవస్థ జోక్యాన్ని పరిమితం చేసేందుకు ఈ విధంగా రూపొందించారు.


సుప్రీంకోర్టు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది?

సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు నేరుగా అనర్హత విధించ లేవు. ఎందుకంటే.. కిహోటో హోల్లోహన్ తీర్పు అనుసరించి.. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు న్యాయ సమీక్ష (judicial review) సాధ్యం కాదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న అనంతరం..అది చట్టవిరుద్ధంగా (mala fide), అసమంజసంగా (perverse), లేదా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఆధారాలు ఉన్నప్పటికీ, స్పీకర్ చర్య తీసుకోకపోతే, కోర్టు అతన్ని నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోమని ఆదేశించవచ్చును. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. (ఉదా: కిషం మేఘచంద్ర సింగ్ కేసు, 2020లో 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని సుప్రీం ఆదేశించింది). కానీ అనర్హత విధించే అధికారం కోర్టుకు లేదు, అది స్పీకర్ హక్కు మాత్రమే.


ఆధారాలున్నా స్పీకర్ ఆలస్యం ఎందుకు?

కొన్ని సందర్భాల్లో, స్పీకర్ తన రాజకీయ పార్టీకి విధేయంగా ఉండటం వల్ల లేదా రాజకీయ ఒత్తిళ్ల వల్ల నిర్ణయాన్ని ఆలస్యం చేస్తారు. పదవ షెడ్యూల్‌లో స్పీకర్ నిర్ణయానికి సమయ పరిమితి నిర్దేశించబడలేదు, దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.


సుప్రీంకోర్టు పరిమితులు

సుప్రీంకోర్టు రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను గౌరవిస్తుంది. శాసనసభలో స్పీకర్‌కు ఇచ్చిన అధికారాన్ని నేరుగా తీసుకోవడం అంటే రాజ్యాంగ విధానాన్ని ఉల్లంఘించడమవుతుంది. అందుకే.. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, కోర్టు దాన్ని వేగవంతం చేయడానికి ఆదేశాలు ఇవ్వడం తప్ప, స్వయంగా అనర్హత విధించలేదన్నది సుస్పష్టం. ఈ విషయంలో మార్పు కోసం రాజ్యాంగ సవరణ ద్వారా అనర్హత నిర్ణయాలను స్వతంత్ర ట్రైబ్యునల్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచించింది, కానీ ఇప్పటివరకు అది అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆధారాలు ఉన్నప్పటికీ, స్పీకర్‌దే తుది నిర్ణయం అనేది పదవ షెడ్యూల్‌లోని చట్టపరమైన నిబంధన. సుప్రీంకోర్టు దాన్ని సవాలు చేయలేదు కానీ వేగవంతం చేయడానికి మాత్రమే జోక్యం చేస్తుంది.

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 06:37 PM