Shivraj Singh Chouhan: మళ్లీ నేను సీఎం అవుతానా? ర్యాలీలో ప్రశ్నించిన సీఎం
ABN , First Publish Date - 2023-10-07T18:42:06+05:30 IST
"మళ్లీ నేను సీఎం అవుతానా? కానా?'.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన ప్రశ్న ఇది. అదికూడా ఎన్నికల ర్యాలీలో. ఆసక్తికరమైన ఈ సన్నివేశం మధ్యప్రదేశ్‌లోని డిండోరిలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో చేటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీని తిరిగి గెలిపిస్తారా?'' అని ప్రశ్నించిన శివరాజ్ సింగ్...ఇందుకు స్పందించాల్సిందిగా ప్రజలను కోరారు.
డిండోరి: "మళ్లీ నేను సీఎం అవుతానా? కానా?'. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన ప్రశ్న ఇది. అదికూడా ఎన్నికల ర్యాలీలో. ఆసక్తికరమైన ఈ సన్నివేశం మధ్యప్రదేశ్‌లోని డిండోరిలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో చేటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీని తిరిగి గెలిపిస్తారా?'' అని ప్రశ్నించిన శివరాజ్ సింగ్...ఇందుకు స్పందించాల్సిందిగా ప్రజలను కోరారు.
ర్యాలీకి హాజరైన సభికులకు సీఎం వరుస ప్రశ్నలు సంధించారు. ''నా ప్రభుత్వం మంచిగా ఉందా? లేదా? ఈ ప్రభుత్వం ఇకముందు కూడా మనుగడ కొనసాగిస్తుందా లేదా? మామ (ప్రజలు ఆప్యాయంగా పిలిచే పేరు) తిరిగి సీఎం అవుతాడా? లేదా?. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా? నరేంద్రమోదీ తిరిగి ప్రధానమంత్రిగా కొనసాగుతారా?'' అని శివరాజ్ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ప్రజలతో మమేకమయ్యే వారికే (బీజేపీకే) మద్దతిస్తామని సభికులంతా ఒక తీర్మానం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా గాంధీ శుక్రవారంనాడు ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ర్యాలీలో శివరాజ్ సింగ్ తిరిగి ముఖ్యమంత్రి కారని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం శనివారంనాటి ర్యాలీలో ఈ వరుస ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ విసుర్లు..
కాగా, మళ్లీ సీఎం అవుతానా అంటూ శివరాజ్ సింగ్ వరుస ప్రశ్నలను ఎన్నికల ర్యాలీలో సంధించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎన్నికల ర్యాలీలో శివరాజ్ పేరును ఎక్కడా ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం లేదని, దీంతో ప్రధానిపై ఒత్తిడి తెచ్చే ఎత్తగడలో భాగంగానే సీఎం ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని విమర్శించింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.