Sikkim Floods:నాసిరకం పనుల వల్లే చుంగ్తాంగ్ డ్యాం కొట్టుకుపోయింది: ప్రేమ్ సింగ్ తమాంగ్
ABN , First Publish Date - 2023-10-06T13:21:02+05:30 IST
సిక్కింలో భారీ వరదలు సృష్టించిన బీభత్సంలో చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీంతో ముంపు ప్రాంతాల్లో తీరని ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. అయితే ఆ డ్యాం నాసిరకంగా కట్టడం వల్లే కొట్టుకుపోయిందని ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.
గ్యాంగ్ టక్: సిక్కింలో భారీ వరదలు సృష్టించిన బీభత్సంలో చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీంతో ముంపు ప్రాంతాల్లో తీరని ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. అయితే ఆ డ్యాం నాసిరకంగా కట్టడం వల్లే కొట్టుకుపోయిందని ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ఇంజినీరింగ్ వైఫల్యం, డ్యాం నిర్మాణంలో మన్నిక లేకపోవడం వల్లే వరదల ధాటికి కొట్టుకుపోయిందని తెలిపారు. ఆ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ తో ఏర్పడిన వరదలతో 8వంతెనలు కొట్టుకుపోయాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి.
ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.
వరదలపై తాజా అప్ డేట్లు..
1) లాచెన్, లాచుంగ్‌లలో సుమారు 3 వేల మంది చిక్కుకుపోయారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “700-800 మంది డ్రైవర్లు, మోటార్ సైకిళ్లపై అక్కడికి వెళ్లిన 3,150 మంది అంతా చిక్కుకుపోయారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లతో ఖాళీ చేయిస్తాం. ఆర్మీ సహకారంతో వాయిస్ ఓవర్ ఇంటర్నట్ కాల్ ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడే ఏర్పాటు చేశాం" అని అన్నారు.
2) ఇప్పటివరకు, మొత్తం 2,011 మందిని రక్షించారు. వారిల్లో విదేశీయులతోపాటు మరో 3 వేల మంది పర్యాటకులు ఉన్నారు. దాదాపు 22 వేల మంది ఆకస్మిక వరదల ప్రభావానికి ఎఫెక్ట్ అయ్యారని సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SSDMA) తెలిపింది.
3) చిక్కుకుపోయిన పర్యాటకులను మంగన్ వరకు ఎయిర్-లిఫ్టింగ్ చేస్తూ వారిని తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్కడి నుండి వారిని రోడ్డు మార్గంలో సిక్కింకు తీసుకువస్తామని పాఠక్ చెప్పారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయ చర్యల వేగంపై ప్రభావితం చూపుతున్నాయి.
4) సింగ్టామ్ పట్టణంలో నీరు, విద్యుత్ సేవల పునరుద్ధరణ పూర్తయిందని పాఠక్ చెప్పారు. సింగ్టామ్, మంగన్, నామ్చి, గాంగ్టక్ జిల్లాల్లో దాదాపు 277 ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితులను 26 సహాయ శిబిరాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.
హెల్ప్‌లైన్ నంబర్లు..
వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సిక్కిం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లు 03592-202892, 03592-221152, 8001763383, 03592-202042 - ఫ్యాక్స్; లేదా అత్యవసర సహాయం కోసం '112'కి కాల్ చేయాలని సూచించింది. భారత ప్రభుత్వం సైతం మూడు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఉత్తర సిక్కిం - 8750887741; తూర్పు సిక్కిం - 8756991895; తప్పిపోయిన సైనికులకు సంబంధించిన విచారణ కోసం 7588302011 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.