Share News

Ayodhya : ఆగని అయోధ్య రచ్చ!

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:34 AM

అయోధ్య రామమందిరం కేంద్రంగా రాజుకున్న రాజకీయ చిచ్చు మరింత పెరిగింది. అయోధ్య పేరుతో ఓ మతానికి మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారని, రామమందిరం చుట్టూనే దేశం ప్రదక్షిణలు చేస్తోందని

 Ayodhya : ఆగని అయోధ్య రచ్చ!

మతానికి మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పిట్రోడా వ్యాఖ్యలు

ఆలయాలతో బీజేపీ వ్యాపారం: శశి థరూర్‌

ఇవి రాహుల్‌ మనసులో మాటలే: బీజేపీ

న్యూఢిల్లీ, డిసెంబరు 27: అయోధ్య రామమందిరం కేంద్రంగా రాజుకున్న రాజకీయ చిచ్చు మరింత పెరిగింది. అయోధ్య పేరుతో ఓ మతానికి మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారని, రామమందిరం చుట్టూనే దేశం ప్రదక్షిణలు చేస్తోందని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ శామ్‌ పిట్రోడా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తన పూర్తి సమయాన్ని ఆలయాలకే కేటాయిస్తున్నారని, ఇది ఆయనకే మంచిది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇలా అయితే ఆధునిక భారతదేశం నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి చేష్టలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ‘‘దేశం మొత్తం రామమందిరం చుట్టూ తిరగడం బాధకలిగిస్తోంది. మతం అనేది వ్యక్తిగత విషయం. దీనిని జాతీయ అంశంగా మార్చి గందరగోళం సృష్టించడం సరికాదు. విద్య, ఉపాధికల్పన, ఆర్థిక, ద్రవ్యోల్బణం, పర్యావరణం, కాలుష్యం వంటి అంశాలను జాతీయ అజెండాగా చేయాలి. కానీ, ఏ ఒక్కరూ ఈ విషయాలపై నోరు విప్పడం లేదు. ప్రతి ఒక్కరూ హిందూ ఆలయాల గురించి, రాముడి గురించే మాట్లాడుతున్నారు. ఇలా అయితే, ఆధునిక దేశ నిర్మాణం ఎలా సాధ్యం?’’ అని పిట్రోడా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఈవీఎంల నిబద్ధతపై..

ఈవీఎం మిషన్ల నిబద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘమే విశ్వసనీయత కల్పించాలని శామ్‌ పిట్రోడా సూచించారు. ఈ పని ఎన్నికల సంఘం చేయకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ విషయంపై ఇండియా కూటమి పార్టీలు దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘ఈవీఎంల విషయాన్ని ఇండియా కూటమి సీరియస్‌ తీసుకోవాలి. జరిగినదాన్ని వదిలేయాలి. 2024లో వచ్చే ఎన్నికలు దేశ తలరాతను నిర్దేశిస్తాయి. భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమి వ్యవహరించాలి’’ అని పిట్రోడా అన్నారు.

రాజకీయానికి మతం ముడి: థరూర్‌

‘‘రామమందిరం వ్యవహారం చూస్తే మతాన్ని రాజకీయాలకు, రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టినట్టుగా ఉంది. మతం అనేది వ్యక్తిగతం. దీనిని రాజకీయాల కోసం దుర్వినియోగం చేయరాదు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ఆలయాలతో ప్రభుత్వం వ్యాపారం చేయరాదని వ్యాఖ్యానించారు. రామమందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని తెలిపారు. ‘‘రామలయం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేవారి చేతుల్లో మీడియా కీలు బొమ్మగా మారింది. ప్రజాసమస్యల ప్రస్తావనే లేకుండా పోయింది’’ అని థరూర్‌ విమర్శలు గుప్పించారు. కాగా, రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌదరి వంటివారికి ఆహ్వానాలు అందాయి. అయితే, వారు వెళ్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

మేం రాం: మమత

జనవరి 22న అత్యంత ఘనంగా జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తాము హాజరు కాబోమని పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తమ పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఎవరూ హాజరు కాబోరని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు బెంగాల్‌ అధికార వర్గాలు తెలిపాయి. అయోధ్య అంశాన్ని బీజేపీ రాజకీయంగా వినియోగించుకుంటున్న నేపథ్యంలోనే మమత ఈ నిర్ణయం తీసుకున్నారని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి రాహుల్‌ ఆలోచనలే: బీజేపీ

రామమందిరం, ప్రధాని మోదీలపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. పిట్రో వ్యాఖ్యలు రాహుల్‌ ఆలోచనల నుంచి పుట్టినవేనని, ఆయన మనసులో మాటలేనని బీజేపీ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమర్శించారు. యూపీఏ హయాంలో పిట్రోడా బలమైన వ్యక్తిగా వ్యవహరించారని, 2జీ కుంభకోణం వెలుగు చూసినప్పుడు పన్నెత్తు మాట మాట్లాడలేదని అన్నారు. ‘‘అధిక ధరలు, ద్రవ్యోల్బణాన్ని కూడా పిట్రోడా సమర్థించారు. ద్రవ్యోల్బణం పెరిగితే కొంపలు మునిగిపోతాయా అన్నారు’’ అని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. ‘‘బుజ్జగింపు రాజకీయాల ముందు ఉగ్రవాదం, హిందువుల విశ్వాసం వారికి పెద్దవిషయం కాదు. క్రోనీ కేపిటలిజం ముందు ద్రవ్యోల్బణం, అవినీతి పెద్ద విషయాలు కాదు’’ అని దుయ్యబట్టారు.

Updated Date - Dec 28 , 2023 | 03:34 AM