Air India plane : మగడాన్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయులు.. ఇది బంగారు నిక్షేపాలున్న పట్టణం!..
ABN , First Publish Date - 2023-06-07T13:52:33+05:30 IST
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా (Air India) విమానం మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో దిగింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా (Air India) విమానం మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో దిగింది. దీనిలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరిని సురక్షితంగా శాన్ ఫ్రాన్సిస్కోకు చేర్చేందుకు మరో విమానాన్ని ఎయిరిండియా పంపిస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. భారతీయులకు ఆతిథ్యమిచ్చిన మగడాన్ పట్టణం గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
మగడాన్ పట్టణం ఈశాన్య రష్యాలో ఉంది. ఒఖోట్‌స్క్ సముద్ర తీరంలో బంగారు గనులు ఉన్న ప్రాంతంలో ఈ పట్టణం ఉంది. మగడాన్ ఓబ్లాస్ట్ పరిపాలన పరిధిలో ఉన్న విమానాశ్రయాన్ని సోకోల్ లేదా మగడాన్ విమానాశ్రయం అంటారు. రష్యా (Russia) రాజధాని నగరం మాస్కో (Moscow) నుంచి 10,000 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. మగడాన్-మాస్కో మధ్య విమాన ప్రయాణానికి దాదాపు 7 గంటల 37 నిమిషాలు పడుతుంది. ఢిల్లీ-మగడాన్ మధ్య విమానయానానికి 23 గంటల 45 నిమిషాలు పడుతుంది. ఢిల్లీ-మగడాన్ మధ్య ప్రయాణానికి వారానికి 11 విమానాలు అందుబాటులో ఉంటాయి.
మగడాన్ పట్టణ నిర్మాణం 1993లో ప్రారంభమైంది. ఇక్కడ కొలిమా బంగారు గనులు ఉన్నాయి. కొన్ని సాధారణ పరిశ్రమలు, ఇంజినీరింగ్ షాపులు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు, పరిశోధన సంస్థలు ఈ పట్టణంలో ఉన్నాయి.
ప్రయాణికుల అవస్థలు
ఎయిరిండియా విమానం ఏఐ173లోని ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో మంగళవారం దిగింది. ఈ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి తగిన వసతి, హోటల్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులను డార్మిటరీల్లో ఉంచారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది. ఎయిరిండియాతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఎయిరిండియా B777-200LR VT-ALF విమానాన్ని మగడాన్ విమానాశ్రయానికి పంపిస్తున్నట్లు తెలిపింది. మగడాన్‌లో చిక్కుకున్న ప్రయాణికులను, సామాగ్రిని ఈ విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తున్నట్లు, స్థానిక ప్రభుత్వం కూడా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపిందని వివరించింది. విమానాశ్రయానికి సమీపంలోని ఓ పాఠశాలలో ప్రయాణికులకు వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపిందని పేర్కొంది. వీరికి భోజనం, ఇతర అవసరాల కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదించినట్లు తెలిపింది.
మగడాన్ విమానాశ్రయంలో కానీ, రష్యాలో కానీ తమ సిబ్బంది లేరని, అయినప్పటికీ ఈ అసాధారణ పరిస్థితిలో ప్రయాణికులకు సాధ్యమైనంత అత్యుత్తమ సహాయాన్ని అందిస్తున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Odisha Train Accident : డబ్బు కోసం ఇంత దారుణమా? ఒడిశా రైలు ప్రమాద మృతుల శవాలతో మోసాలు!
Wrestlers : క్రీడల శాఖ మంత్రితో రెజ్లర్ల చర్చలు ప్రారంభం