Heroes: మూడు పాత్రల్లో మరోసారి
ABN , First Publish Date - 2023-07-30T02:34:10+05:30 IST
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే చిత్రంలో మూడు విభిన్న పాత్రలను పోషించిన హీరోలు కొందరే కనిపిస్తారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే చిత్రంలో మూడు విభిన్న పాత్రలను పోషించిన హీరోలు కొందరే కనిపిస్తారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. అక్కినేని నాగేశ్వరరావు ‘నవరాత్రి’ చిత్రంలో తొమ్మిది గెటప్స్‌లో కనిపిస్తారు. అది వేరే విషయం అనుకోండి. ఎన్టీఆర్ ‘శ్రీ కృష్ణ సత్య’ చిత్రంలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారు. రామాయణానికి, భారత కథకూ ముడి పెడుతూ రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీరాముడిగా, రావణుడిగా, శ్రీకృష్ణుడిగా నటించారు. ఇది దర్శకుడు కె.వి. రెడ్డికి ఆఖరి చిత్రం కావడం గమనార్హం. అలాగే ఎన్టీఆర్ రంగుల్లో భారీ వ్యయంతో నిర్మించిన తొలి చిత్రం ఇదే. ఆ తర్వాత మరోసారి ‘కుల గౌరవం’ చిత్రంలో ఎన్టీఆర్ తాత, తండ్రి, మనవడు పాత్రలను పోషించారు.
ఈ సినిమాకు పేకేటి శివరామ్ దర్శకత్వం వహించారు. ఆయన కన్నడంలో రూపొందించిన ‘కుల గౌరవ’ చిత్రం చూసి ఈ అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్. ఈ విషయంలో విమర్శలు ఎదురైనా, శ్రేయోభిలాషులు వారించినా ఎన్టీఆర్ లెక్క చేయలేదు. ‘ఆయన వద్దు.. మీరే చెయ్యండి’ అని తమ్ముడు త్రివిక్రమరావు చెప్పడంతో ‘కన్నడంలో పేకేటి బాగా తీశాడు. అతనికి అవకాశం ఇద్దాం. సెట్‌లో నేను ఉండి చూసుకుంటాగా’ అని తమ్ముడికి నచ్చజెప్పి ‘కుల గౌరవం’ చిత్రం తీశారు ఎన్టీఆర్. ఈ సినిమాకు ఆయనే స్ర్కీన్‌ప్లే సమకూర్చారు. ఆయన సరసన జయంతి, కన్నడ నటి ఆరతి హీరోయిన్లుగా నటించారు. నాగయ్య, పద్మనాభం, రావి కొండలరావు, మాడా, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
‘శ్రీ కృష్ణ సత్య’ చిత్రాన్ని పూర్తి రంగుల్లో భారీ ఎత్తున నిర్మించిన ఎన్టీఆర్ ‘కుల గౌరవం’ చిత్రాన్ని మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో నిర్మించడం విశేషం. 1972 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో మళ్లీ త్రిపాత్రాభినయం చేశారు ఎన్టీఆర్. ఈ సినిమా సృష్టించిన చరిత్ర, సాధించిన రికార్డుల గురించి తెలిసిందే!