Himabindu : పనికిరానన్నవారే ప్రశంసించారు

ABN , First Publish Date - 2023-03-27T03:58:11+05:30 IST

‘ముఖంలో హావభావాలు పలకడంలేదు. జనాలకీ నచ్చడంలేదు. ఈమెను మార్చేయండి’... నటనంటే ఎంతో ఇష్టంతో అప్పుడే వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయికి ఎదురైన అవమానాలివి. కానీ ఆమె వెనుదిరిగి వెళ్లిపోలేదు.

Himabindu : పనికిరానన్నవారే ప్రశంసించారు

‘ముఖంలో హావభావాలు పలకడంలేదు. జనాలకీ నచ్చడంలేదు. ఈమెను మార్చేయండి’...

నటనంటే ఎంతో ఇష్టంతో అప్పుడే వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయికి ఎదురైన అవమానాలివి. కానీ ఆమె వెనుదిరిగి వెళ్లిపోలేదు. ఆ అవమానాలనే సవాలుగా తీసుకొని... కసిగా కృషి చేసింది. కాదు పొమ్మన్న చోటే తనను తాను నిరూపించుకుని... మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ‘మందాకిని’గా తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తున్న హిమబిందు ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలివి...

‘‘ఇంట్లో అందరూ సినిమా రంగంతో అనుబంధం ఉన్నవారే. మా నాన్న, తాతయ్య, నాయనమ్మ... పరిశ్రమకు చెందినవారే. వాళ్లు పోషించింది చిన్న చిన్న పాత్రలే అయినా... తెలుగు, తమిళం, హిందీ... అన్ని భాషల్లో నటించారు. మా స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. కానీ నాన్న గోవింద్‌ పరిశ్రమ మనిషి కావడంవల్ల చెన్నైకి మకాం మారింది. టెన్త్‌ వరకు భీమవరం, గూడూరుల్లో నా విద్యాభ్యాసం సాగింది. ప్లస్‌ టు నుంచి చెన్నైలో చదివాను. అమ్మ మాధురి గృహిణి. మా కుటుంబం నేపథ్యంవల్ల సాధారణంగానే నాకు కూడా సినిమాలపై ఆసక్తి ఎక్కువైంది. భవిష్యత్తులో మంచి నటి కావాలనుకున్నాను.

డిగ్రీ తరువాత...

సినిమాల్లో నటించాలనుకుంటున్నానని ఇంట్లోవాళ్లకి చెబితే వద్దంటే వద్దన్నారు. ముఖ్యంగా మా అమ్మా నాన్న. చదువుపైనే దృష్టి పెట్టమన్నారు. వాళ్ల మాట కాదనలేదు. ప్లస్‌-2 అయిపోయింది. బీకాంలో చేరాను. కానీ నటి కావాలన్న కోరిక నాలో ఇంకా సజీవంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే... మరింత బలపడింది. అదే విషయం అమ్మా నాన్నలకు చెప్పాను. సినిమాలంటే ఎంతో ఇష్టమని, అటువైపు వెళతానని అన్నాను. ఈసారి నా మాట కాదనలేకపోయారు. నా ఇష్టాన్ని అర్థం చేసుకున్నారు. సరేనన్నారు. అయితే మా కుటుంబంలోని వారికి పరిశ్రమతో సంబంధాలున్నా ఎవరూ నన్ను రికమండ్‌ చేయలేదు. చేయరు కూడా! మా నాన్నకు అలాంటివి నచ్చవు. నా స్వశక్తితో, ప్రతిభతో అవకాశాలు తెచ్చుకోవాలని చెప్పారు. ‘ప్రయత్నించు. అవకాశాలు వస్తే వెళ్లు. లేదంటే లేదు’ అన్నారు. ఇది నేను కోరుకున్న రంగం కనుక సాధించి చూపించాలని అనుకున్నాను. డిగ్రీలో ఉండగానే నా ప్రయత్నాలు మొదలుపెట్టాను.

షార్ట్‌ ఫిలిమ్స్‌తో...

ప్రేక్షకులను మెప్పించాలంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నటనలో అనుభవం కావాలి. దాని కోసం తొలుత కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌ చేశాను. నటనతో పాటు చాలా అంశాల గురించి తెలుసుకొనే అవకాశం అక్కడ లభించింది. డిగ్రీ తరువాత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరాను. అదే సమయంలో ఆడిషన్స్‌ ఇస్తూ వెళ్లాను. ఎట్టకేలకు నా ప్రయత్నం ఫలించింది. ఓ తమిళ్‌ సీరియల్‌ కోసం ఇచ్చిన ఆడిషన్‌ ఓకే అయింది. అలా మూడేళ్ల కిందట ‘ఇదయతాయి తిరుడాతె’తో నటిగా బుల్లితెరకు పరిచయమ్యాను. మొదటి రోజు కెమెరా ముందు నిలుచున్నప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. అందులో నాదే ప్రధాన పాత్ర. దాదాపు 1,100 ఎపిసోడ్స్‌ నడించిందా సీరియల్‌. నాకు బాగా పేరు తెచ్చింది.

అవమానించినా...

కానీ ‘ఇదయతాయి తిరుడాతె’ చేస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆరంభంలో నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను. ముప్ఫై ఎపిసోడ్స్‌ తరువాత నా బదులు వేరే హీరోయిన్‌ను పెడదామని అనుకున్నారు. ఎందుకంటే నా నటన వాళ్లకు నచ్చలేదుట. ‘ముఖంలో హావభావాలు పలకడంలేదు. ఈ అమ్మాయి ముఖమూ బాలేదు. ప్రేక్షకులకు కూడా ఈమె నటన నచ్చడంలేదు. అసలు ఎలా తీసుకున్నారు’ అంటూ నా ముందే సెట్‌లో ఎంతో చులకనగా మాట్లాడేవారు. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. ఎంతో బాధపడ్డాను. ‘నేను అనవసరంగా వెళ్లానేమో! నాకు వద్దు ఈ ఫీల్డ్‌. ఇక మీదట నటించను. చదువుకొని వేరొకటి చూసుకొంటా’ అని ఇంట్లోవాళ్లకు చెప్పాను. ఆ సమయంలో అమ్మా నాన్న, శ్రేయోభిలాషులు వచ్చి ఒకటి చెప్పారు... ‘అందం కాదు... మనలో టాలెంట్‌ ఎంత? మనల్ని మనం నిరూపించుకోగలమా... లేదా అన్నదే ముఖ్యం’ అని. నాకు మద్దతుగా నిలిచారు. వాళ్లు ఇచ్చిన ధైర్యం నా మీద నాకు నమ్మకం కలిగించింది. ‘కచ్చితంగా అందరికీ నేను నచ్చుతాను. ఒక రోజు నా విజయాన్ని కూడా సెలబ్రేట్‌ చేస్తారు. అందుకోసం మరింత కష్టపడాలి’ అని నాకు నేను సంకల్పించుకున్నాను. అవమానాలు భరించి, బాధను దిగమింగి మరింత కష్టపడ్డాను. ఎక్కడైతే నేను పనికిరానని అన్నారో అక్కడే నేనేంటో నిరూపించి చూపించాను. ముప్ఫై ఎపిసోడ్స్‌ తరువాత నన్ను తీసేద్దామనుకున్నారు. ఆ తరువాత అదే సీరియల్‌ వెయ్యి ఎపిసోడ్స్‌కు పైగా చేశాను. నటన రాదన్నవారే నీ నటన అద్భుతమని సెట్‌లోనే పొగడ్తలతో ముంచెత్తారు. ఇష్టంతో కష్టపడితే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.

మొదటిసారి మాతృభాషలో...

నాకు ఒక కోరిక... మాతృభాష తెలుగులో చేయాలని. ప్రయత్నాలు కూడా చేశాను. అవి ఫలించాయి. ‘ఆహా’ ఓటీటీలో ‘మందాకిని’ డైలీ సీరియల్‌లో అవకాశం వచ్చింది. నా ప్రధాన లక్ష్యం వెండితెరపై కథానాయికగా కనిపించాలని. దాని కోసమే చాలా సీరియల్స్‌కు అడిగినా నో చెప్పాను. ‘మందాకిని’ ఒప్పుకోవడానికి కారణం... ఓటీటీలు సినిమా అవకాశాలకు దగ్గర దారి అని! మంచి పేరు వస్తుందని! ఒక మంచి వేదిక, చక్కని స్ర్కిప్ట్‌ దొరికినప్పుడు అవకాశాన్ని చేజార్చుకోకూడదు కదా! ఇందులో ‘మందాకిని’గా విభిన్న పాత్రలో నటిస్తున్నా. తను ఆర్కిటెక్ట్‌. పురాతన దేవాలయాలపై పరిశోధన చేస్తుంటుంది. ఓటీటీలో నాకు ఇదే తొలి ప్రాజెక్ట్‌. దీంతోపాటే ‘ఇళక్కియా’ తమిళ సీరియల్‌ కూడా చేస్తున్నా. నెలలో సగం రోజులు ఇక్కడ... సగం అక్కడ షూటింగ్‌ ఉంటుంది.

బొటిక్‌ పెట్టాలి...

మహిళా సాధికారత అంటారు కదా... దానికి నేను తొలి ప్రాధాన్యం ఇస్తాను. ఒకరిపై ఆధారపడకుండా ఎత్తుకు ఎదగాలనే తత్వం నాది. ఈ దారిలో ఇబ్బందులు, సవాళ్లనేవి సహజం. మన రోజువారీ జీవితంలోకి ఎంతో మంది వచ్చి వెళుతుంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో కేరెక్టర్‌. ఎవరినీ నొప్పించకుండా... ఎవరేమన్నా నొచ్చుకోకుండా... సాగిపోవాలి. ఏదిఏమైనా మనమేంటో, మన లక్ష్యం ఏంటో మనకు ఒక స్పష్టత ఉండాలి. ఓర్పుగా ప్రయత్నించాలి. అప్పుడే ముందడుగు వేయగలం. నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను సాధించింది నా స్వయంకృషితోనే. నా అసలు లక్ష్యం పెద్ద బొటిక్‌ పెట్టి, పారిశ్రామికవేత్తగా ఎదగాలని! దాని కోసమే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకున్నా. డ్రెస్‌లు, డిజైనింగ్‌లంటే నాకు చాలా క్రేజ్‌. ఎప్పటికైనా కచ్చితంగా బొటిక్‌ ప్రారంభిస్తా. అందులోనూ రాణిస్తా. విజయవంతమైన మహిళగా నలుగురూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. అదే నా కోరిక.’’

ఫ్రెండ్స్‌తో రేస్‌ బైక్‌లు...

నటనతో పాటు డ్యాన్స్‌, డ్రాయింగ్‌, లాంగ్‌ డ్రైవింగ్‌ చాలా ఇష్టం. ఇదివరకు స్నేహితులతో కలిసి రేస్‌ బైక్స్‌ నడిపేదాన్ని. బైక్‌ రైడింగ్‌ బాగా ఆస్వాదిస్తా.

ఆ రోజు కోసం...

ఎంత పెద్ద సమస్య వచ్చినా వెనకడుగు వేయను. దాన్ని ఒక సవాలుగా తీసుకొని ప్రయత్నిస్తాను. అదే నా బలం. అందర్నీ గుడ్డిగా నమ్మేయడం నా బలహీనత. ఇక నటనపరంగా బిగ్‌స్ర్కీన్‌ మీద హీరోయిన్‌గా నన్ను నేను చూసుకోవాలి. అందర్నీ మెప్పించి, మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష. ఆ రోజు కోసమే నిరీక్షిస్తున్నా.

హనుమా

Updated Date - 2023-03-27T03:58:11+05:30 IST