Lion- Leopard- Fox: సింహం- చిరుత- నక్క

ABN , First Publish Date - 2023-07-30T02:04:19+05:30 IST

ఒక అడవిలో జంతువులన్నీ సుభిక్షంగా ఉండేవి. అయితే ఉన్నట్లుండి ఓ ఉపద్రవం వచ్చింది. వానలే పడలేదు. దీంతో అడవంతా చెల్లాచెదురైంది. చిన్న చిన్న ప్రాణాలన్నీ గాల్లో కలసిపోయాయి.

Lion- Leopard- Fox: సింహం- చిరుత- నక్క

ఒక అడవిలో జంతువులన్నీ సుభిక్షంగా ఉండేవి. అయితే ఉన్నట్లుండి ఓ ఉపద్రవం వచ్చింది. వానలే పడలేదు. దీంతో అడవంతా చెల్లాచెదురైంది. చిన్న చిన్న ప్రాణాలన్నీ గాల్లో కలసిపోయాయి. సింహరాజుకు కూడా ఆహారం లేదు. జింకలు, కుందేళ్లు కరువయ్యాయి. దీంతో సింహరాజు కడుపు మాడిపోయేది. పస్తులు ఉండేది. అలానే ఓ పొగరుబోతు చిరుత కూడా ఆ అడవిలో ఉండేది. చెట్లెక్కే చిరుతకు ఏ కోతులూ దొరకలేదు.. ఏ జింకా కనపడలేదు. దీంతో అది కూడా ఎంతో బాధతో అడవంతా తిరగసాగింది. అడవిలో పొదల్లోకి వెళ్తూనే సింహం ఉంది. ఏదో జింక వచ్చిందని సింహం ఎగిరి చిరుత మీద పడింది. చిరుత కూడా సింహంతో పోట్లాడింది. ఇద్దరికీ రక్తం. దెబ్బలు తగిలి అలసిపోయాయి. దీంతో చిరుత ఇలా అన్నది.. ‘అయ్యా.. రాజావారు.. మీరు దయచేసి పోట్లాడకండి. నేను పోట్లాడను. మనం కొట్లాడితే ఏమీ ఉపయోగం లేదు’ అన్నది. ‘మరేమి చేద్దాం? ఆహారమే దొరకట్లేదు’ అన్నది సింహం. ‘ఇలా గొడవలొద్దు. మనం ఇద్దరం కలసి వేటాడితే ఎలా ఉంటుందో ఆలోచించండి’ అంటూ చిరుత సలహా ఇచ్చింది. సింహానికి అవమానం అని తెలిసీ.. ఆకలి కడుపుతో ఉండటం వల్ల ఏదోటి సరేలే అన్నది.

సింహం- చిరుత వేటకు బయలుదేరాయి. అడవిలో ఒక్క జీవి కనపడట్లేదు. వలసెళ్లిపోయాయేమో అనుకున్నాయి. ఇంతలో ఓ బలిసిన దుప్పి కనపడింది చిరుతకు. దూరం నుంచి సింహం చూసింది. ‘అది డొక్కలు ఎండిపోయిన జింక’ అన్నది. ఏదోటి దాన్ని వేటాడదామన్నది చిరుత. ఇద్దరూ వేటాడారు. ఆ జింక దొరికింది. నాకంటే నాకు.. అంటూ జింక మాంసం కోసం మళ్లీ కొట్లాట మొదలైంది. చినికి చినికి గాలివానలా కొట్లాట అయ్యింది. ఇద్దరూ గొడవపడుతున్నారు. మట్టిలో దొర్లుతూ దూరంగా వెళ్లారు. ఇంతలో ఓ ముసలి నక్క పొదల్లోంచి చూసి జింక ఆహారాన్ని లాక్కెళ్లిపోయింది. సింహం- చిరుత మళ్లీ గొడవపడకూడదని నిర్ణయించుకుని ఆబగా జింక మాంసం దగ్గరకు వచ్చాయి. అక్కడ జింక మాంసం తుంటలు మాత్రమే దొరికాయి. అదే పదివేలని ఆ క్రూరజంతువులు తిన్నాయి. అడవిలో మమ్మల్నెవరూ కొట్టేవారు లేరని పొగరుగా ఉండే ఆ రెండు జంతువులు దొరికిన మాంసంతో సరిపడాల్సి వచ్చిందలా.

Updated Date - 2023-07-30T02:04:19+05:30 IST