Jain story నిజమైన దీవెన

ABN , First Publish Date - 2023-08-18T02:39:15+05:30 IST

ఇంట్లో శుభ కార్యాలు జరుగుతున్నప్పుడు... ఒక సాధువో, స్వామీజీయో అందుబాటులో ఉంటే, సాధారణ ప్రజలు వారిని ఆహ్వానిస్తారు. పాదపూజల్లాంటివి చేసి, తమ కార్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగేలా ఆశీర్వదించాలని కోరుతారు. అలాంటి ఆశీర్వాదం లభించినప్పుడు సంబరపడతారు. వారిపట్ల తమ శ్రద్ధాభక్తులను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. తమ జన్మ ధన్యమయిందనుకుంటారు. అయితే బాగా పేరున్న సాధువులు, స్వామీజీలు, గురువులు మాత్రం పెద్ద హోదా ఉన్న సంపన్నుల ఇళ్ళకు వెళ్తారు తప్ప... ఇలాంటి సాధారణ ప్రజల ఇళ్ళలో కాలు పెట్టరు. ఆ ప్రజలే వారి ఆశ్రమాలకు వెళ్ళి కలుసుకోవాలనుకున్నా అనుమతి ఇవ్వరు. కానీ జెన్‌ సాధువుల వైఖరి భిన్నంగా ఉంటుంది.

Jain story  నిజమైన దీవెన

జెన్‌ కథ

జపాన్‌లో ఒకప్పుడు షుకెన్‌ అనే జెన్‌ సాధువు ఉండేవాడు. షుకెన్‌ గురువైన కాసో అతనికి ‘ఇక్యూ’ అనే పేరు పెట్టడం వల్ల... ‘ఇక్యూ షుకెన్‌’ అని అందరూ పిలిచేవారు. కాసో పర్యవేక్షణలో జెన్‌ సాధన చేసిన ఇక్యూకు... అతని ఇరవయ్యారో ఏట జ్ఞానోదయం అయింది. ఇక్యూను తన వారసుడిగా కాసో ప్రకటిస్తూ... తను ఉంటున్న జెంకో-ఆన్‌ ఆలయాన్ని అతనికి అప్పగించాడు. కానీ ఆలయానికే పరిమితం అవడం, అక్కడి సన్యాసులకు మాత్రమే బోధించడం ఇక్యూకు ఇష్టం లేకపోవడందో.... దాన్ని వదిలి వెళ్ళిపోయాడు. సమాజం చిన్న చూపు చూసే అట్టడుగు వర్గాల ప్రజల దగ్గరకు వెళ్ళాడు. వారికి తన బోధల ద్వారా మార్గ నిర్దేశం చేశాడు. క్యోటో, ఒసాకా పరిసర ప్రాంతాలన్నీ తిరిగాడు. బీదా బిక్కీ జనానికి దగ్గరయ్యాడు. వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చాడు. అతనికి సంగీత సాహిత్యాల్లో, కళలలో ప్రవేశం ఉండేది. మోరీ అనే మహిళను ప్రేమించి, ఎన్నో ప్రేమ గీతాలను కూడా రాసి ఆలపించాడు. ఎందరో కవులను, కళాకారులను ఆకర్షించాడు.

ఒకసారి ఒక వ్యాపారి తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా... అభినందనలు తెలుపుతూ ఏవైనా రెండు వాక్యాలు రాసి ఇవ్వాలని ఇక్యూని వేడుకున్నాడు. వెంటనే అతని కోరికను మన్నించిన ఇక్యూ ‘‘తల్లితండ్రులు చనిపోతారు, కొడుకు చనిపోతాడు, మనవడు చనిపోతాడు’’ అని రాసి ఇచ్చాడు. దాన్ని చదివిన వ్యాపారి దిగ్ర్బాంతి చెందాడు. ‘‘ఇలాంటి శుభ సందర్భంలో ఇంత అసహ్యకరమైన మాటలు రాయాలని ఎలా అనిపించింది? ఎందుకు రాశారు?’’ అని అడిగాడు. దానికి ఇక్యూ సమాధానం ఇస్తూ ‘‘మొదట తల్లితండ్రులు చనిపోతారు, అనంతరం కొడుకు చనిపోతాడు. ఆ తరువాత మనవడు పెరిగి, పెద్దవాడై, వృద్ధుడై... చివరికి మరణిస్తాడు. ఇలా సహజ క్రమంలో జరగాలని కోరుకోవడం సముచితమే కదా! మీ కుటుంబంలో సహజక్రమంలో మరణాలు సంభవించడం ఆనందాయకమే కదా!’’ అన్నాడు.

‘నిజానికి నూరేళ్ళు జీవించు, దీర్ఘాయువు కలిగి ఉండు’ అనే ఆకాంక్షల భావమే ఇందులోనూ ఉంది. కానీ ‘చావు, మరణం’ అనే మాటలు ఆ సందర్భంలో వాడడం సామాన్యులకు నచ్చదు. జీవితం ఆద్యంతాలను నిర్వికారంగా చూసే జ్ఞానుల స్పందన మామూలు మనుషులకు రుచించదు. కళ్ళముందే పిల్లలు, మనుమలు మరణించిన వారి దుఃఖాన్ని గమనించినప్పుడు... ఇక్యూ పేర్కొన్న సహజక్రమంలోనే అంతా జరిగితే బాగుంటుందనీ, అదే నిజమైన దీవెన అనీ అర్థమవుతుంది.

- రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2023-08-18T02:39:15+05:30 IST