US: అగ్రరాజ్యం అధ్యక్షుల అఫైర్స్.. అప్పుడు వైట్‌హౌస్ ఉద్యోగినితో బిల్ క్లింటన్.. ఇప్పుడు పోర్న్ స్టార్‌తో ట్రంప్..!
ABN , First Publish Date - 2023-04-05T11:52:54+05:30 IST
తాజాగా అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US Former President Donald Trump).. పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్‌తో నెరిపిన వ్యవహారం కారణంగా అరెస్ట్ కావడంతో మరోసారి అమెరికా మాజీ అధ్యక్షుల అఫైర్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తోంది.
వాషింగ్టన్: తాజాగా అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US Former President Donald Trump).. పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్‌తో నెరిపిన వ్యవహారం కారణంగా అరెస్ట్ కావడంతో మరోసారి అమెరికా మాజీ అధ్యక్షుల అఫైర్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తోంది. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton).. వైట్‌హౌస్ ఉద్యోగిని మోనికా లెవిన్‌స్కీ (Monica Lewinsky) ప్రేమాయణం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మోనికాతో వైట్‌హౌస్‌లో (White House) జరిపిన రాసలీలలు 1998లో ఓ ప్రముఖ న్యూస్ మ్యాగ్జైన్ కథనంతో బయటకు వచ్చింది. నాటి ఈ సంఘటన ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావమే చూపింది. తాను చేసింది తప్పేనని పలు సందర్భాల్లో క్లింటన్ బహిరంగంగానే అంగీకరించారు కూడా. తనను ఎప్పటికీ ఇది వెంటాడుతోందని చెప్పారాయన.
ఇక ఆమెతో లైంగిక సంబంధం (Sexual Relationship) పెట్టుకోడానికి దారితీసిన పరిస్థితుల గురించి ఓ డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు కూడా. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని చెప్పిన ఆయన.. వాటి నుంచి ఉపశమనం పొందడానికి మోనికతో శారీరక సంబంధం పెట్టుకున్నానని తెలిపారు. కానీ, తాను చేసింది చాలా తప్పుడు పని అని, అప్పుడు అలా చేసుండాల్సింది కాదన్నారు. తాను ఆనాడు చేసింది తప్పేనని అంగీకరించిన క్లింటన్.. ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని చెప్పుకొచ్చారు.
Donald Trump: అగ్రరాజ్యం రాజకీయ చరిత్రలో పెను సంచలనం.. ట్రంప్ అరెస్ట్.. అసలు హష్‌మనీ అంటే ఏంటి?
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్..
2006లో లేక్‌తాహో హోటల్‌లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నట్టు పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్ (Stormy Daniels) ఇటీవల వెల్లడించి ప్రకంపనలు రేపారు. ట్రంప్, తాను నెవెడాలో సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా కలుసుకున్నామని చెప్పింది. ఆ తర్వాత మరుసటి ఏడాది ఒక రోజు లేక్‌తాహో హోటల్‌లో తనతో ట్రంప్ శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపింది. ట్రంప్‌తో తన సంబంధాన్ని ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా బయట పెట్టింది. దాంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచేందుకు ట్రంప్ వ్యక్తిగత అడ్వొకేట్ మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారు. అనంతరం ఇది నిజమేనని ఒప్పుకుంటూ కోహెన్.. ట్రంప్ పరువును బజారుకీడ్చాడు. డేనియల్స్‌కు 1.30 లక్షల అమెరికా డాలర్లు ముట్టజెప్పినట్లు అతడు అంగీకరించాడు. దాంతో కోహెన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. కాగా, ఈ కేసులో తానే తప్పు చేయలేదని ట్రంప్ అంటున్నారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో తనను పోటీ చేకుండా నిలువరించేందుకు జరుగుతున్న కుట్రగా ఆయన పేర్కొంటున్నారు.