PM Modi US visit: అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న మోదీ మేనియా.. 20 నగరాల్లో ఆహ్వాన ర్యాలీలు
ABN , First Publish Date - 2023-06-20T07:35:45+05:30 IST
అమెరికాను మోదీ మేనియా కుదిపేస్తోంది. ప్రధాని మోదీ ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన రాక కోసం వేలాదిమంది భారతీయ అమెరికన్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ప్రధాని రాక కోసం భారతీయ అమెరికన్ల ఎదురుచూపులు..
మార్మోగిన ‘మోదీ-మోదీ’ నినాదాలు
అగ్రరాజ్యంలో త్రివర్ణ పతాకాల రెపరెపలు
పటిష్ఠ రక్షణ బంధమే ఎజెండా
రేపటి నుంచే మోదీ అమెరికా పర్యటన
వాషింగ్టన్/హూస్టన్, జూన్ 19: అమెరికాను మోదీ మేనియా కుదిపేస్తోంది. ప్రధాని మోదీ ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన రాక కోసం వేలాదిమంది భారతీయ అమెరికన్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం అమెరికాలోని సుమారు 20 నగరాలలో ఆహ్వాన ర్యాలీలు నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాన్యుమెంట్ నుంచి చారిత్రక లింకన్ మెమోరియల్ వరకు నిర్వహించిన ర్యాలీలో వందలాదిమంది పాల్గొని ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే, హూస్టన్‌లోని సుగర్లాండ్ మెమోరియల్ పార్కు వద్ద నిర్వహించిన ర్యాలీలో ప్లకార్డులను ప్రదర్శించడంతోపాటు త్రివర్ణపతాకాలను రెపరెపలాడించారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్, శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జి తదితర అనేక చారిత్రక ప్రదేశాల్లోనూ ఆదివారం ఇవే దృశ్యాలు కనిపించాయి.
బోస్టన్, చికాగో, అట్లాంటా, మియామి, టెక్సాస్, డల్లాస్, లాస్ ఏంజెలిస్ తదితర నగరాల్లోనూ మోదీ రాకకు ఆహ్వానం పలుకుతూ ర్యాలీలు నిర్వహించారు. అలాగే, మోదీ ప్రసంగించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు టికెట్ల కోసం భారతీయ అమెరికన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో విజిటర్స్ గ్యాలరీ సీట్లకు డిమాండ్ బాగా పెరిగింది. అమెరికాతో రక్షణ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడమే మోదీ పర్యటన ప్రధాన ఎజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అన్నారు. ‘‘వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ చర్చలు జరుపుతారు. రక్షణ పరికరాల ఉమ్మడి అభివృద్ధి, తయారీకి పరిశ్రమల ఏర్పాటుకు ఈ సందర్భంగా రోడ్‌మ్యాప్ ఖరారు చేస్తారు’’ అని క్వాత్రా సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు.
21న న్యూయార్క్ సందర్శనతో మోదీ అమెరికా పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొంటారు. 22న వైట్‌హౌస్ వద్ద మోదీకి ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 23న ప్రముఖ కంపెనీల సీఈవోలతో మోదీ సంభాషిస్తారు. అదే రోజు మధ్యాహ్నం రీగన్ సెంటర్‌లో భారతీయ-అమెరికన్లనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. 2014 నుంచి మోదీ ఆరు సార్లు అమెరికాలో పర్యటించారు. కాగా.. మోదీ అధికారిక పర్యటన ద్వైపాక్షిక బంధంలో కీలక మైలురాయిగా పలువురు అమెరికన్ సెనేటర్లు అభివర్ణించారు. కాగా.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ఆ దేశంలో కూడా మోదీ 24, 25 తేదీల్లో పర్యటిస్తారు. బొహ్రా ముస్లిం వర్గం పునరుద్ధరించిన 11వ శతాబ్దినాటి అల్-హకీమ్ మసీదును సందర్శిస్తారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.
భారత్‌తో ఒప్పందానికి 'నాసా' తహతహ
చంద్రుడిపై అధ్యయనం కోసం అమెరికా చేపడుతున్న ఆర్టెమిస్ ప్రాజెక్టులో భారత్‌ను కూడా భాగస్వామిని చేయాలని నాసా భావిస్తోంది. అందుకే మోదీ అమెరికా పర్యటనకు ముందు నాసా అధికారులు ఆర్టెమిస్ ఒప్పందం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 2025 నాటికి మానవులను చంద్రునిపైకి పంపే లక్ష్యంతో నాసా ఈ మిషన్‌ను చేపట్టింది. అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ వైట్‌హౌ్‌సలో జో బైడెన్‌తో భేటీకానున్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష రంగంలో సహకారం గురించి ప్రధానంగా చర్చకు వస్తుందని అమెరికా స్పేస్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాసాలో అడ్మినిస్ట్రేటర్ భవ్యలాల్ ఇటీవల మాట్లాడుతూ.. ఆర్టెమిస్ ఒప్పందంపై ప్రస్తుతం 25 దేశాలు సంతకాలు చేశాయని, భారత్ 26వ దేశంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.