NRI: రియాధ్‌లో తెలుగు ఎన్నారైల క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు.. అంబరాన్నంటిన సంబరం..

ABN , First Publish Date - 2023-01-01T18:39:22+05:30 IST

రియాధ్‌లో తెలుగు ఎన్నారైలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

NRI: రియాధ్‌లో తెలుగు ఎన్నారైల క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు.. అంబరాన్నంటిన సంబరం..

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుఖమైనా, సుఖమైనా గతం గతః! పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్తగా చిగురించే ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం.. అందునా మాతృగడ్డకు దూరంగా పరాయి దేశాన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఓ కొత్త అనుభూతి. నూతన సంవత్సర ఆగమన వేడుకలకు తోడుగా పండుగ తోడయితే ఆనందం రెట్టింపవుతుంది.

ఏ పండుగ అయినా ధార్మిక సార్వత్రిక ఆచారాలలో భాగం. మతమేదైనా భారత గడ్డపై వికసించడానికి కారణం అది భారతీయ సంస్కృతిలో మమేకం కావడమే. దసరా, దీపావళి, నవరాత్రి, ఉగాదిలతో పాటు గురునానక్ జయంతి, ఈద్, క్రిస్మస్ పండుగలు.. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశ సంస్కృతి, సంప్రదాయంలో ఒక భాగం.

వివిధ ప్రాంతాలలో భిన్న స్వరూపస్వభావాలున్న భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటుంది. వైవిధ్యంతో కూడిన తెలుగునాట అన్ని ప్రధాన ఆధ్యాత్మిక పండుగలను ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇంటా బయటా అనే బేధం ఉండదు. ప్రత్యేకించి విదేశీ గడ్డపై మాత్రం ఏ పండగ అయినా సరే దాన్ని తెలుగుదనంతో నింపి చేసుకోవడం ప్రవాసీయులకు ఇష్టం. విదేశాలలో తెలుగు ప్రవాసీయులు జరుపుకునే పండుగలు దేశభక్తి, సమానత్వం, సమైక్యతా భావాలను మరింత దృఢపరుస్తాయనే దానికి శుక్రవారం సౌదీ అరేబియా రాజధాని రియాధ్(Riyadh) నగరంలో కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకున్న క్రిస్మస్ పండుగ(Christmas), నూతన సంవత్సర ఆగమన స్వాగతం కార్యక్రమం(New Year Celebrations) ఒక నిదర్శనం.

దసరా, దీపావళీ, ఉగాది పండుగలను ఆహ్లదకరంగా, ధార్మిక ఆచార వ్యవహారాలతో ఎలా జరుపుకున్నారో అదే తరహాలో క్రిస్మస్ పండుగను కూడా రియాధ్‌లోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు చూడముచ్చటగా జరుపుకుని భారత వైవిధ్యసారాన్ని చాటాయి.

6.jpg

ఒక వైపు రోజంతా కురుస్తున్న వర్షానికి తోడుగా క్రిస్మస్ చల్లటి రాత్రిని సైతం లెక్క చేయకుండా ప్రవాసాంధ్రులు(NRIs) పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్సాహంతో అన్నింటా ముందుడే ఆనంద్ పోకూరి, పిరాటి సుబ్రమణ్యం (సుబ్బు), వంశీ సునకు, ఆనందరాజు, ఎర్రన్న, అనిల్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రియాధ్ నగరంలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఆసక్తిగా పాల్గొనడమే కాకుండా తమకు ప్రావీణ్యత ఉన్న పాకశాస్త్రం నుండి న్యత్యాల వరకు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు సంప్రదాయ పిండి వంటల ప్రదర్శనశాలలు అమితంగా ఆకర్షించాయి. తెలుగు ప్రవాసీ సంఘం సాటా తన వంతుగా సహకరించింది. సంఘం అధ్యక్షులు విశ్వానథ మల్లేశన్, ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్‌లు కార్యక్రమాన్ని సమన్వయం చేయగా మహిళా విభాగం అధ్యక్షురాలు సుచరిత ఏర్పాట్లన్నీ పరిశీలించారు.

5.jpg

హైందవ ధర్మంలో గోమాత ప్రాధాన్యత గూర్చి చెప్పవల్సిన అవసరం లేదు, ఏసు జన్మదిన వేడుకలలో గోమాత కమ్మనయిన గుమ్మపాలు కడివెలతో ఇస్తున్నానంటూ తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన పిరాటి సుబ్రమణ్యం (సుబ్బు), శ్రీప్రియ దంపతులు ప్రత్యేకంగా సమకూర్చిన జొన్ను ఆవు పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, శ్రీ అన్నమయ్య జిల్లాకు చెందిన చిట్లూరి రంజీత్, సింధూరలు చక్కగా వండించిన కరకరలాడే దోశలను అందరు ఎగబడి తినగా తూర్పు గోదావరి జిల్లా లక్కవరానికి చెందిన రమ్య తయారు చేసిన మిర్చి, అరటికాయ బజ్జీలు, భీమవరంలో ప్రాచుర్యం పొందిన బజ్జీ బండ్లను వెనక్కి నెట్టాయి. ఇక రియాధ్ నగరంలో తెలుగు పిండి వంటకాలకు పెట్టింది పేరయిన నెల్లూరుకు చెందిన గీతా శ్రీనివాస్ పచ్చళ్ళకు, పిండి వంటకాల గూర్చి ప్రత్యేకంగా అడిగి మరీ తిన్నారు. అలహాబాద్ కుంభమేళ సందర్భంగా ఎగబడి తిన్నట్లుగా దాసరి భారతీ (వైజాగ్), సుచరిత (హైద్రాబాద్)లు చేసిన పానీపూరి, ఉల్లి పకోడాలను అరగించారు. రుచికరమైన దివ్య ఔషధం కోసం చిన్నారులు చేయిచాపినట్లుగా బైరెడ్డి దివ్య చేసిన ప్రత్యేక చిప్స్ కోసం చిన్నారులు తిప్పలు పడ్డారు. చలికాలం రాత్రులలో కశ్మీరి చాయ్ రుచే వేరుగా ఉంటుంది, దీనికై శ్రీనగర్‌లోని దాల్ లేక్ సరస్సుకు వెళ్ళవల్సిన అవసరం లేకుండా అదే రకమైన రుచితో హైద్రాబాద్‌కు చెందిన డాక్టర్ అనుషా ఫాతిమా చేసిన గులాబీ కశ్మీరీటీ గుబాళించింది. మానస, శ్వేత రియాజోద్దీన్‌లు పిల్లలకు, మహిళలకు చేసిన అలంకరణ శుభకార్య సన్నహాలను మరిపించింది. అనిత ఏర్పాటు చేసిన పూల ప్రదర్శన అందరికి పరిమిళం వెదజెల్లారు.

4.jpg

రియాధ్ నగరంలో కార్యక్రమం ఏదైనా దాని వేదిక ఏ విధంగా అలంకరించాలనేది మాత్రం అమలాపూరంకు చెందిన తాటి శ్రీదేవి, గుంటూరు జిల్లా సత్తెనపల్లికు చెందిన ఇందిరల ఇష్టం. కోనసీమ కొబ్బరి తోటల ప్రకృతీ రమనీణయమైన శైలీతో శ్రీదేవి, కాలంతో పరుగులు పెట్టే నవీన మెట్రో వ్యవస్థను మరిపించే విధంగా స్వయానా మెట్రో పైలట్ ఇందిరలు చేసిన అలంకరణతో సభా వేదిక ముస్తాబయింది. మాటల కందని భాష్యం, మైమరిపించే కంఠంతో తెలుగుదనానికి కీరీటం ఎక్కించే చేతన జగదీశ్వరీ వ్యాఖ్యలు ఉత్తేజాన్ని కల్గించాయి. శ్వేత రియాజోద్దిన్, మానస, భారతీ, డాలీ, హారిక ముగ్గురు కాలానుగూణంగా చేసిన సినిమా పాటలపై డ్యాన్సులు ఆలరించాయి. శ్వేత, డాలీల తోడ్పాటు అన్నింటా అండగా నిలిచింది. ఎర్రన్న-ఉషా దంపతుల కుమార్తె మౌర్య, మల్లిఖార్జున్- శ్రీదేవిల కుమార్తె హనీషాలు చేసిన నృత్యాలు కూడా సభికులను ఆకట్టుకోన్నాయి.

3.jpg

అంతకు ముందు క్రిస్మస్ ప్రాముఖ్యత గూర్చి, క్రైస్తవ పాస్టర్ల బృందం వివరించింది. రాజమండ్రి నుండి ప్రత్యేకంగా వచ్చిన పాస్టర్ సైమన్ సుదర్శన్ లోకసువార్త రెండవ అధ్యాయంలో యేసు జన్మ గూర్చి వివరించగా పాస్టర్ విల్సన్ రియాధ్‌లో తెలుగు క్రైస్తవుల గూర్చి వివరించారు. సౌదీ అరేబియాలో ఈ రకమైన క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఇప్పటి వరకు జరుగలేదని సభికులలో అనేకులు పెర్కోన్నారు.

1.jpg2.jpg3.jpg1.jpg

Updated Date - 2023-01-02T18:42:42+05:30 IST