UAE: ప్రవాసులు జర జాగ్రత్త.. లైసెన్స్ లేకుండా ఆ పని చేశారో.. రూ.2.23కోట్ల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు!
ABN , First Publish Date - 2023-04-06T12:25:48+05:30 IST
అరబ్ దేశాల్లో చట్టాలు (Laws in Arab Countries) ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే.
అబుదాబి: అరబ్ దేశాల్లో చట్టాలు (Laws in Arab Countries) ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. ఇక ప్రవాసులు (Expats) ఆ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి చట్టాల గురించి తెలుసుకోవడం బెటర్. లేనిపక్షంలో చిక్కుల్లో పడడం ఖాయం. ఇప్పటికే చాలా సంఘటనలు ఈ కోవలో జరిగాయి కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పబ్లిక్ ప్రాసిక్యూషన్ కీలక ప్రకటన చేసింది. లైసెన్స్ లేకుండా డబ్బు వసూలు చేస్తే జరిగే పరిణామాలను ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) వివరించింది. ఈ నేపథ్యంలో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ప్రత్యేకంగా ఓ పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. రూమర్లు, సైబర్ క్రైమ్‌లను (Cybercrimes) ఎదుర్కోవడంపై 2021లో తీసుకువచ్చిన ఫెడరల్ డిక్రీ లా నం. 34లోని ఆర్టికల్ 41 ప్రకారం క్రిప్టో కరెన్సీ కోసం ఆహ్వానించే లేదా ప్రోత్సహించే లేదా నకిలీ కంపెనీ లేదా పోర్ట్‌ఫోలియోను సృష్టించే వ్యక్తి లేదా నిర్వహించే వ్యక్తి పెట్టుబడి, నిర్వహణ, వినియోగం కోసం ప్రజల నుంచి డబ్బును సేకరించడం లేదా స్వీకరించడం అనేది సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా చేస్తే భారీ జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. సుమారు 1మిలియన్ దిర్హమ్స్ (రూ.2.23కోట్లు) ఫైన్, ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించింది. ఇది నివాసితులు, దేశ పౌరులందరికీ వర్తిస్తుందని పేర్కొంది. దీనిద్వారా పౌరులు, నివాసితుల్లో చట్టపరమైన సంస్కృతిని ప్రోత్సహించడానికి, దేశంలోని తాజా చట్టాలపై వారిలో అవగాహన కల్పించడానికి సాయం చేస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పుకొచ్చింది.