Share News

CM Chandrababu: వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:03 AM

ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం

  • 30 ఏళ్ల కలను నిజం చేశాం.. నా చేతుల మీదుగా చేయడం పూర్వజన్మ సుకృతం

  • పేదరికం లేని సమాజమే నా లక్ష్యం.. మోదీ, పవన్‌తో కలిసి ఈ దిశగా ముందుకు

  • కుల వివక్షపై టీడీపీ యుద్ధం చేసింది.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తున్నామని తెలిపారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మొదలై, ఇప్పటివరకు సాగిన వర్గీకరణ అంశం... తన హయాంలోనే సాకారం కావడం సంతృప్తినిచ్చిందన్నారు. 2011 జనాభాలెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని, 2026 జనగణన తర్వాత జిల్లా యూనిట్‌గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వివరించారు. ‘‘మాదిగల సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. వారు డిమాండ్లు సమంజసమని భావించి 1996 సెప్టెంబరు 10న జస్టిస్‌ రామచంద్రరావు కమిషన్‌ వేశాను. కమిషన్‌ రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేసి 1997 మే 28న నివేదిక ఇచ్చింది. సమాజంలో అసమానతలు తొలగి, పేదరికంలేని సమాజం లక్ష్యంగా 1997 జూన్‌ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చాను. 1999 నవంబర్‌ 30న రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ పాలసీ అమల్లోకి తెచ్చాం. దీనివల్ల మాదిగలు, ఉపకులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు లభించాయి. అయితే వర్గీకరణ అంశంపై అధికారం ఒక్క పార్లమెంట్‌కే ఉందని 2004 నవంబర్‌ 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


ఈ క్రమంలో నాటి కేంద్ర ప్రభుత్వం వేసిన ఉషామెహ్రా కమిషన్‌ వర్గీకరణ అమలైన 2000-2004 మధ్య మంచి ఫలితాలొచ్చాయని స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.’’ అంటూ చరిత్రను సభలో వివరించారు. ఇంకా ఏమన్నారంటే. వివక్షను కళ్లారా చూశాను.. ‘‘తొలిసారి సీఎంగా పనిచేసిన కాలంలో ఎస్సీల పట్ల జరుగుతున్న వివక్షను కళ్లారా చూ శాను. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ వేశాం. కుల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో 25 మెమోలు, జీవోలు ఇచ్చాం. కుల వివక్ష చూపేవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు ఆదేశాలిచ్చాం. రాష్ట్ర స్థాయిలో నోడల్‌ ఆఫీసర్‌ని నియమించాం. ప్రతినెలా 30న ప్రతిగ్రామంలో పౌరహక్కుల ఉత్సవాలు జరిపాం.’’ దళిత చాంపియన్‌ టీడీపీయే.. ‘‘ఎస్సీ వర్గీకరణపై 2024 నవంబరు 15న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాతో ఏకసభ్య కమిషన్‌ వేశాం. ఈ ఏడాది మార్చి 10న కమిషన్‌ సమగ్ర నివేదిక ఇచ్చింది. 59 ఉపకులాలను మూడు కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్లను కేటాయించారు. దాని ప్రకారం.. 8శాతం పోస్టులు మాలలు, ఉప కులాలు; ఆరు శాతం మాదిగలు, ఉపకులాలు; 1 శాతం రెల్లి సామాజిక వర్గానికి వస్తాయి. మూడూ కలిపితే 15 శాతం అవుతుంది. మొదటిసారిగా దళితుణ్ని లోక్‌సభ స్పీకర్‌ని చేసిన ఘనత మాది. దళిత మహిళ ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్‌ని చేశాను. దళిత ఐఏఎస్‌ కాకి మాధవరావును సీఎస్‌గా నియమించాం. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడే అంబేడ్కర్‌కు భారతరత్న ప్రదానం జరిగింది. వాజపేయి హయాంలో అంబేడ్కర్‌ ఫొటో పార్లమెంట్‌లో పెట్టారు. నేను యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉన్నప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన కేఆర్‌ నారాయణన్‌ను రాష్ట్రపతిని చేశాం. అబ్దుల్‌ కలామ్‌ని రాష్ట్రపతిని చేశాం. దళిత చాంపియన్‌ టీడీపీ.


గత ప్రభుత్వం ఐదేళ్లలో వెనకబడిన కులాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వారి సంక్షేమం పట్టించుకోలేదు’’ అని చంద్రబాబు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్నారు. ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కాలువ శ్రీనివాసులు, కొణతాల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్‌ కూడా మాట్లాడారు. జిల్లా యూనిట్‌గా వర్గీకరణ: ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్‌గా జరిగితేనే సమన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాల జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా ఉందని.. కాబట్టి రాష్ట్ర యూనిట్‌గా చేస్తే అందరికీ సమాన అవకాశాలు లభించే అవకాశం ఉండదని అన్నారు. అయితే 2011 జనాభా లెక్కలే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నందున కొత్త జనగణన చేసిన తర్వాత జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు. చర్చలో నక్కా ఆనంద్‌బాబు, బి.రామాంజనేయులు, కొండ్రు మురళీ, మద్దిపాటి వెంకటరాజు, బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. 20 ఇళ్లు ఉండే ఊరు మాది.. రోడ్డూ లేదు.. : చంద్రబాబు 20 ఇళ్లు మాత్రమే ఉన్న మారుమూల గ్రామంలో పుట్టానని చంద్రబాబు తెలిపారు. ‘‘మా ఊరికి అప్పట్లో సరైన రోడ్డు లేదు. రోడ్డు వేయించేందుకు ఇంటికో ఎడ్లబండి కట్టి మట్టి తోలేవాళ్లం. ఢిల్లీలో బిల్‌గేట్స్‌తో మాట్లాడినప్పుడు 30 ఏళ్ల కిందటి సంగతులు ఆయన గుర్తు చేస్తే చాలా సంతోషమేసింది. ఒకప్పుడు పీ-3 తెచ్చి సంపద సృష్టించి పేదలను ఆదుకున్నాం. ఈ ఉగాది నాడు పీ-4 తెస్తున్నాం. తూర్పుకాపులకు కుల సర్టిఫికెట్‌ అంశంపై కసరత్తు చేస్తున్నాం.’’ అని వివరించారు.

Updated Date - Mar 21 , 2025 | 05:03 AM