USA: సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.. అమెరికాలో కొత్త చట్టం
ABN , First Publish Date - 2023-03-24T21:11:55+05:30 IST
చిన్నారులు సోషల్ మీడియా బారిన పడకుండా ఉండేందుకు అమెరికాలోని యూటా రాష్ట్రం తాజాగా కీలక చట్టాన్ని ప్రవేశపెట్టింది.
ఎన్నారై డెస్క్: చిన్నారులు సోషల్ మీడియా(Social Media Law) బారిన పడకుండా ఉండేందుకు అమెరికాలోని యూటా రాష్ట్రం(Utah) తాజాగా కీలక చట్టాన్ని ప్రవేశపెట్టింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్‌లో అకౌంట్ తెరిచేందుకు మైనర్లకు తల్లిదండ్రుల అనుమతి(Parental Consent) తప్పనిసరి చేసింది. అంతేకాకుండా.. రాత్రి 10.30 నుంచి ఉదయం 6.00 మధ్యలో చిన్నారుల సోషల్ మీడియా వాడకంపైనా నిషేధం విధించింది. ఈ మేరకు రెండు బిల్లులపై గవర్నర్ స్పెన్సర్ కాక్స్ సంతకం చేశారు. సోషల్ మీడియా వినియోగించదలిచిన వారికి వయసు ధ్రువీకరణను కూడా తప్పనిసరి చేస్తూ నిబంధన రూపొందించింది. పిల్లలను సోషల్ మీడియావైపు ఆకర్షించేలా టెక్ కంపెనీలు యాప్స్ రూపొందించడంపైనా నిషేధం విధించింది. దీంతో.. సోషల్ మీడియాపై ఈ తరహా ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రంగా యూటా చరిత్ర సృష్టించింది.
వాణిజ్యానికి ప్రాధాన్యమిచ్చే రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి చట్టం తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్ కంపెనీలపై అమెరికా ప్రజాప్రతినిధుల అభిప్రాయంలో మార్పు కనిపిస్తోందనడానికి ఇది నిదర్శనమన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఫేస్‌బుక్, గూగుల్ లాంటి సంస్థలు ఆసాధారణ స్థాయిలో వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో యూజర్ల వ్యక్తిగత గోప్యత, మానసిక ఆరోగ్యం, తప్పుడు సమాచారం వ్యాప్తి, విద్వేషపూరిత వ్యాఖ్యలు తదితర అంశాలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యూటా చట్టాలు అమెరికావ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపాయి.