Balineni Meets CM Jagan : అరగంటపాటు బుజ్జగించిన సీఎం జగన్.. వద్దంటే వద్దని తేల్చిచెప్పేసిన బాలినేని.. మీడియా కంటపడకుండా..
ABN , First Publish Date - 2023-05-02T18:21:07+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో (AP CM YS Jagan) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో (AP CM YS Jagan) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా తర్వాత హైదరాబాద్‌లో ఉన్న బాలినేనిని క్యాంప్ ఆఫీసుకు సీఎం జగన్ పిలిపించుకున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బాలినేని అరగంటపాటు జగన్‌తో భేటీ (Jagan-Balineni Meeting) అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. ముఖ్యంగా.. ‘ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా (Regional Co-ordinator) మళ్లీ మీరే కొనసాగాలి’ అని ఈ భేటీలో జగన్, టీటీడీ చైర్మన్, ప్రకాశం జిల్లా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) కోరారు. పదే పదే జగన్ కోరినప్పటికీ బాలినేని ఏ మాత్రం మెత్తపడలేదు. అటు జగన్.. ఇటు సుబ్బారెడ్డి ఇద్దరూ బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేసినా అవేమీ ఫలించలేదు. రీజనల్ కో-ఆర్డినేటర్‌గా కొనసాగేదే లేదని.. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతానని బాలినేని తేల్చి చెప్పేశారు. తాను నియోజకవర్గంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జగన్‌కు బాలినేని వివరించారు. అందుకే తాను రీజనల్ కో-ఆర్డినేటర్ పదవి వద్దని సమావేశంలో జగన్‌కు బాలినేని వివరించారట.
అసంతృప్తి వెళ్లగక్కిన బాలినేని..!
కాగా ఇదే భేటీలో వైవీ సుబ్బారెడ్డిపై సీఎం జగన్ ముందే బాలినేని తన అసంతృప్తి వెళ్ళగక్కారు. ఇటీవల ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్థన్ రెడ్డిని జిల్లా వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి నియమించినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే.. ఈ విషయంలో తనకు ఏ మాత్రం సమాచారం లేదని.. తెలియకుండా ఎలా పోస్టింగ్ ఇప్పిస్తారు..? సీఎం ముందే ప్రస్తావించారట. చర్చించాల్సిన విషయాలన్నీ పూర్తయ్యాక మళ్లీ కో-ఆర్డినేటర్ ప్రస్తావన వచ్చినప్పటికీ అస్సలు ఆ పంచాయితీనే వద్దని బాలినేని తెగేసి చెప్పేశారట. అయితే.. సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంపై పట్టుకోసం ఏ మాత్రం బాలినేని దిగిరాలేదు. జిల్లా వైసీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ పూసగుచ్చినట్లుగా సీఎం జగన్‌కు బాలినేని వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లపై బాలినేని చేసిన ఫిర్యాదులపై ఐప్యాక్ టీమ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. సొంత జిల్లాలో తనకి ప్రాధాన్యత తగ్గించడంపై బాలినేని మరోసారి ఈ సమావేశంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారట. ఇదే సమావేశంలో రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల గెలుపు, ఓటమిలపై కూడా చర్చించినట్టు సమాచారం.
తీవ్ర అసంతృప్తితోనే..!
సీఎం జగన్‌తో భేటీకి ఎంతో ఉత్సాహంగా వెళ్లిన బాలినేని.. తిరిగొచ్చేటప్పుడు మాత్రం ఆయనలో అదేమీ కనిపించలేదు. భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడుతారని అభిమానులు, అనుచరులు భావించారు. కానీ.. మీడియా ప్రతినిథులు క్యాంప్ ఆఫీసు బయట ఉన్నప్పటికీ వారి కంట పడకుండానే బాలినేని వెళ్లిపోయారు. దీంతో జగన్‌తో చర్చలు సాఫీగా సాగలేదని అర్థం చేసుకోవచ్చు. కాగా.. రెండ్రోజుల క్రితమే సీఎంవో నుంచి ధనుంజయరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆయనతో మాట్లాడారు. కానీ బాలినేని తిరిగి కోఆర్డినేటర్ పదవి తీసుకునేందుకు సిద్ధంగా లేరని ఆయన అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆ విషయంలో దృఢమైన నిర్ణయానికే వచ్చినబాలినేనిని శాంతిపజేసేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగి.. క్యాంప్ ఆఫీసుకు పిలిపించినా పంచాయితీకి మాత్రం ఫుల్‌స్టాప్ పడలేదు. బాలినేని ఇలా పంథంతో ఉంటే ఇక ఆ రీజనల్ కో-ఆర్డినేటర్ పదవి ఇంకెవరికిస్తారో అనేదానిపై జిల్లా ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.