Hyderabad: ఎట్టకేలకు ఆమె ఆట కట్టించేశారుగా. ఏం జరిగిందంటే...
ABN , Publish Date - Mar 27 , 2025 | 07:04 AM
తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరకకపోరు అన్నట్లుగా.. గత కొన్నేళ్లుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఆమె’ పాపం ఎట్టకేలకు పండింది. గంజాయి లేడీ డాన్ ఎదిగిన ఆమె ప్రస్తుతం అరెస్టయి ఊసలు లెక్కిస్తోంది.

- గంజాయి లేడీ డాన్ సంగీత సాహూ అరెస్ట్
- కొంతకాలంగా అజ్ఞాతంలో
- ఒడిశాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గంజాయి స్మగ్లర్లతో లింకులు
హైదరాబాద్ సిటీ: కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న లేడీ గంజాయి డాన్ సంగీతా సాహూ(Sangeeta Sahu) ఆటకట్టించారు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు. ఒడిశాలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి కటకటాల్లోకి నెట్టారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కుర్థా జిల్లా, కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీతా సాహు నాలుగేళ్లుగా గంజాయి హోల్‌సేల్ వ్యాపారం చేస్తోంది. గంజాయి వినియోగం ఎక్కడ ఎక్కువగా ఉంటే, అక్కడి వ్యాపారులతో పరిచయం పెంచుకునేది. వారికి గంజాయిని సరఫరా చేసేది. అనతికాలంలోనే సంగీత సాహూ గంజాయి డాన్‌గా ఎదిగింది. ఖాళీ సమయంలో హీరోయున్‌లా ఫోజులు కొడుతూ ఇన్‌స్టా రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది.
ఈ వార్తను కూడా చదవండి: మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదం
ధూల్‌పేట స్మగ్లర్స్‌తో లింకులు
నగరంలోని ధూల్‌పేటకు చెందిన గంజాయి స్మగ్లర్లు సంగీత సాహూ నుంచే సరుకును తెప్పించుకునేవారు. చదువుకునే యువతిలా నటిస్తూ బ్యాగుల్లో, లేదా ఇతర రహస్య మార్గాల ద్వారా గంజాయిని నగరానికి తెచ్చి సరఫరా చేసేది. ఆమెకు ధూల్‌పేట లేడీ గంజాయి డాన్‌లుగా పేరున్న షీలాబాయ్, నేహాబాయ్, ఇషికాసింగ్‌లతో పరిచయం ఏర్పడింది. ఇటీవల 29 కేజీలు, 11.3 కేజీల గంజాయితో పట్టుబడిన స్మగ్లర్స్‌కు సంగీత సాహూ సరుకు సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2022లో రైల్వే పోలీసులకు చిక్కిన సంగీత ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు.
అరెస్ట్ చేశారిలా..
తెలంగాణలో మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లు తెలుసుకున్న సంగీత సాహూ కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లింది. ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని నిర్ణయించుకున్న ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రత్యేక ఎస్‌టీఎఫ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎస్‌టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి పర్యవేక్షణలో నిందితురాలికి సంబంధించిన వివరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు.
సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశాకు వెళ్లారు. మంగళవారం నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి లేడీ గంజాయి డాన్‌ను పట్టుకున్న ఎస్‌టీఎఫ్ టీమ్ ఎస్‌ఐ సైదులు, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుళ్లు మహేష్, అరుణ్, మంగను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News