NCBN Remand : చంద్రబాబుకు మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఈసారి ఎన్నిరోజులంటే..?
ABN , First Publish Date - 2023-09-24T18:23:23+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు రిమాండ్ ముగియగానే..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు రిమాండ్ ముగియగానే.. మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ ఆశ్రయించింది. ఎందుకివ్వాలి..? అనేదానిపై నిశితంగా సీఐడీ వివరణ ఇవ్వడం.. ఇటు చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్నాక చంద్రబాబుకు అక్టోబర్-05 వరకు రిమాండ్ (Remand) పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది.
రిమాండ్ పొడిగింపు ఇలా..?
చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీకి ఎందుకు..? ఇంకా ఏం చేయాల్సి ఉంది..? అనేదానిపై ఏసీబీ న్యాయమూర్తికి సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో రిమాండ్ ఇవ్వాలన్న సీఐడీ వాదనలపై చంద్రబాబు తరపున లాయర్ పోసాని వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్ పొడిగిస్తే కారణాలు చెప్పాలని పోసాని డిమాండ్ చేయగా.. సీఐడీ తరఫు లాయర్లు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అక్టోబర్-05 వరకు చంద్రబాబును రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఇన్ని ప్రశ్నలా..?
కాగా.. ఈ కేసులో చంద్రబాబుకు రెండ్రోజుల సీఐడీ విచారణ ముగిసింది. ఇవాళ ఒక్కరోజే 12 గంటలపాటు బాబును సీఐడీ అధికారుల బృందం విచారించింది. దాదాపు 30 అంశాలపై 120 ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెట్టినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా.. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై, డాకుమెంట్స్ చూపించి నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే అంశాలపై.. బాబును సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ చంద్రబాబు జవాబు చెప్పినట్లుగా తెలిసింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో బాబును వర్చువల్‌గా సీఐడీ హాజరుపరచడం జరిగింది. అటు హాజరు.. ఇటు రిమాండ్ పొడిగింపుపై విచారణ జరిగింది.