Teegala Vs Sabitha : సబితతో రహస్య భేటీ జరిగిన వారం రోజుల్లోనే సీన్ రివర్స్.. ‘తీగల’ మళ్లీ మొదటికొచ్చారే!?
ABN , First Publish Date - 2023-08-18T22:24:21+05:30 IST
అవును.. మహేశ్వరం నియోజకవర్గంలో (Maheswaram) ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) , మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)ఒక్కటయ్యారు..! వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.! ..
అవును.. మహేశ్వరం నియోజకవర్గంలో (Maheswaram) ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) , మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)ఒక్కటయ్యారు..! వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.! నియోజకవర్గాన్ని సబిత భ్రష్టు పట్టిస్తున్నారని, తన అనుచరులు చేసే భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఇటీవల ఘాటు విమర్శలు చేసిన తీగల.. ఎట్టకేలకు చల్లబడి సబితకు జైకొట్టారు కూడా.! అయితే వారం రోజులు తిరగక ముందే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. తాజాగా తీగల మాట్లాడిన ఒకే ఒక్క మాటతో ‘‘ఏం మాట్లాడుతున్నావయ్యా.. ‘తీగ’లు కట్ అవుతున్నాయ్’’ అని అనుచరులు, కార్యకర్తలు అనుకుంటున్నారట. ఇంతకీ తీగల ఏమన్నారు..? వారం రోజుల్లోనే ఎందుకీ పరిస్థితి వచ్చింది..? అనే ఆసక్తికర విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
అసలేం జరిగిందంటే..?
శుక్రవారం నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌లో తీగల పర్యటించారు. ఈ సందర్భంగా బడంగ్‌పేట భూ బాధితులు తమ సమస్యలను కృష్ణారెడ్డికి మొరపెట్టుకున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ జనాలు చెప్పిన సమస్యలు విన్న తీగల.. ఏం చేయలేకపోయాననే ఆవేదన లోనయ్యారట. మరికొందరు బాధితులు చెప్పిన మాటలకు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. ‘అయ్యో.. అధికారంలో ఉండి కూడా ఎందుకీ పరిస్థితి.. గుండెల్లో పెట్టుకుంటానని మాటిచ్చినే.. అలాంటిది జనాలు కష్టాల్లో ఉంటే చూడలేకపోతున్నాను.. ఏదో ఒకటి చేయాలి’ అని తన అనుచరులు, కార్యకర్తలు, భూ బాధితులకు చెప్పి ఎమోషనల్ అయ్యారట. ‘కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న బడంగ్‌పేట్ భూ బాధితులకు నేను అండగా ఉంటాను’ అని మాటిచ్చారు తీగల. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంతో పాటు.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఏంటమ్మా సబితమ్మా..?
వాస్తవానికి ఈ బాధితులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నవారే. గత ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్‌కే మద్దతిచ్చారు. వీరి ఓట్లతో కాంగ్రెస్ తరఫున గెలిచి.. బీఆర్ఎస్‌లో చేరి మంత్రి కూడా అయిన సబితా ఇంద్రారెడ్డికి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వారంతా సబితపై గుర్రుమని ఉన్నారట. పదులసార్లు సబితకు తమ సమస్యలు చెప్పుకున్నా పరిష్కరించలేదట. దీంతో మంత్రికి చెప్పడమే మానేశారట. శుక్రవారం నాడు తీగల ఇక్కడికి రావడంతో మీరైనా పట్టించుకోండి మహాప్రభో అని సమస్యలు చెప్పి వాపోయారట. తీగల కూడా అన్ని విధాలుగా అండగా ఉంటానని మాట కూడా ఇచ్చారట. అయితే.. బీఆర్ఎస్‌లో ఉన్న ఈయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఏం పని..? అనేది ఇప్పుడు జనాల్లో మెదులుతున్న ప్రశ్న.
‘తీగలు’ తెగుతున్నాయ్!
చాలా రోజులుగా.. బీఆర్ఎస్‌పై గుర్రుగా ఉన్న తీగల.. ఇటీవలే సబితతో అరగంటపాటు రహస్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించుకొని కలిసి ముందుకెళ్లాలని మాట్లాడుకున్నారు కూడా. అంతేకాదు జై సబితమ్మ అని కూడా నినదించారు తీగల. అయితే.. సడన్‌గా ఇప్పుడు తీగల ఇలా మాట్లాడటంతో అభిమానులు, అనుచరుల తీగలు తెగుతున్నాయట. తీగల హస్తం గూటికి చేరనున్నట్లు చాలారోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో తీగల విడివిడిగా చర్చలు జరిపినట్లు సమాచారం. తీగలతో పాటు ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే ఆ మధ్య ఈ వార్తలపై స్పందించకపోగా.. తాజాగా తీగల చేసిన కామెంట్స్‌తో పాత వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఏమో ఎన్నికల ముందు మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నెన్ని చిత్రవిచిత్రాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే మరి.