CM KCR : నామినేషన్ వేశాక రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఏమన్నారో చూడండి..
ABN , First Publish Date - 2023-11-09T17:14:50+05:30 IST
CM KCR Vs Revanth Reddy : కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన కొద్దిరోజుల్లోనే..
కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన కొద్దిరోజుల్లోనే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని.. రాజకీయ అస్థిరత తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేను కొనేందుకు వచ్చి రూ. 50 లక్షలతో పట్టుబడిన ‘మహాత్ముడు’ కామారెడ్డిలో తనపై పోటీచేస్తున్నాడని చెప్పుకొచ్చారు. దీనిపై కామారెడ్డి ప్రజలు ఆలోచించుకోవాలని.. వారికి తగిన బుద్ధి చెప్పే బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. కాగా.. అంతకుముందు కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో కేసీఆర్ నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్లు కేసీఆర్ దాఖలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు.
కామారెడ్డి నుంచే ఎందుకు..?
‘ కామారెడ్డితో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. మా అమ్మ వాళ్లది కోనాపూర్.. జలసాధన ఉద్యమం చేసినపుడు కామారెడ్డి మండల బ్రిగేదియర్గా పని చేశాను. గులాబీ కూలీ చేసి బీడీ ఫ్యాక్టరీలో పని చేశాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది కామారెడ్డి బార్ అసోసియేషన్. గత ఎన్నికల్లో కామారెడ్డిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చాను.. చేశాను. నన్ను కామారెడ్డి నేతలు కోరడంతో ఇక్కడ పోటీ చేస్తున్నాను. కేసీఆర్ వెంబడి చాలా వస్తాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీరు పారించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. కామారెడ్డి పట్టణంతో పాటు పల్లెల రూపు రేఖలు మారుతాయి’ అని నియోజకవర్గంపై కేసీఆర్ వరాల వర్షం కురిపించారు.
విచక్షణతో ఓటేయండి..!
‘ఎన్నికల్లో పార్టీకి ఒకరు నిలబడతారు. వ్యక్తుల గురించి ఆలోచించాలి.. దానికి మించి అతని వెనుకున్న పార్టీని చూడాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.. విచక్షణతో వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిణితి రావాలి. 1956 దాకా మనతో ఉన్న తెలంగాణను మనకు కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలంతా చరిత్ర తెలుసుకోవాలి.ఒక్క తెలంగాణలో తప్ప ఏ ఇతర రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్తగా వచ్చిన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తాం. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం నాశనం చేశారు. ఉత్తమ్ కుమార్ రైతుబందు దుబారా అంటున్నాడు. ప్రధాని మోదీ నియోజకవర్గంలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టకపోతే మన నిధులకు కోత పెట్టారు. ఇది బీజేపీ నేతలను అడగండి. తెలంగాణపై పగబట్టిన బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
నేను చూస్కుంటా..!
‘50 లక్షలతో పట్టుబడిన వ్యక్తినే నామీద పోటీకి వచ్చిండు. ఎలా బుద్ధి చెప్పాలో మీరు నిర్ణయించుకోండి. మేము అధికారంలోకి వచ్చాక కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు.. కరువూ లేదు. కామారెడ్డి కి ఐటీ రంగం వస్తుంది. కామారెడ్డి నియోజకవర్గాన్ని బంగారు తునకలాగా చేసి మీకు అప్పగిస్తాను. గంప గోవర్ధన్ పదవి త్యాగం చేసి నాకు ఇచ్చారు. గోవర్ధన్ రాజకీయ భవిష్యత్తు సేఫ్గా కాపాడుతాను. ఆయన మంచి స్థాయిలో ఉంటారు’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మరోవైపు.. సమావేశానికి ముందు కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప నివాసంలో సీఎం సమావేశమయ్యారు. గ్రూప్ తగాదాలు వీడి కలిసి కట్టుగా పని చేయాలని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పార్టీ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన కేసీఆర్ పైవిధంగా ప్రసంగం చేశారు.