YSRCPలో కలవరం..రాజమండ్రిలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..?

ABN , First Publish Date - 2023-02-17T12:00:40+05:30 IST

ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల సమయంలో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల కోసం అమలు చేయలేని హామీలు గుప్పించారు. ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు

YSRCPలో కలవరం..రాజమండ్రిలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..?

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యే అవతారమెత్తారా?.. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమయ్యారా?.. మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఎంపీపై గుర్రుగా ఉన్నారా?.. మార్గాని తీరుపై పార్లమెంట్ పరిధిలోని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందా?.. ఇంతకీ.. ఎంపీ భరత్‌ పరిమితం అయిన ఆ అసెంబ్లీ నియోజకవర్గమేంటి?.. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం కావడం వెనకున్న ఆంతర్యమేంటి?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1154.jpg

7 నియోజకవర్గాల్లో ఓట్ల కోసం అంతులేని హామీలు

గత లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మార్గాని భరత్ వైసీపీ ఎంపీగా గెలుపొందారు. రాజమండ్రి ఎంపీ పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలు.. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల సమయంలో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల కోసం అమలు చేయలేని హామీలు గుప్పించారు. ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు వెళ్ళకుండా ముఖం చాటేశారు. రాజమండ్రి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ పర్యటించకపోవడం, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఓట్ల కోసం పదేపదే తిరిగిన ఎంపీ.. ఇప్పుడు మోహం చాటేయటంతో ప్రజలు మండిపడుతున్నారు.

Untitled-1354.jpg

రాజమండ్రి సిటీ ఇన్‌చార్జ్‌గా నియామకం

ఇదిలావుంటే.. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ను.. సీఎం జగన్ రాజమండ్రి సిటీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యత వహించాల్సిన ఎంపీని.. జగన్‌... కేవలం రాజమండ్రి సిటీకే పరిమితం చేశారు. భరత్‌కు రాజమండ్రి ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం, ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరిగిందని అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే.. ఎంపీ భరత్‌ను.. కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేసి కట్టడి చేశారని వైసీపీ నేతలు బాహాటంగా చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారుతోంది.

Untitled-164.jpg

ఎంపీకి వ్యతిరేకంగా వైసీపీలోని ముఖ్య నేతలు

మరోవైపు.. ఎంపీ మార్గాని భరత్.. రాజమండ్రి సిటీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీలో అసంతృప్తి భగ్గుమంటోంది. రాజమండ్రి సిటీ బాధ్యతలు ఎంపీ భరత్‌కు అప్పగించడంపై కీలక వైసీపీ నేతలతోపాటు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా ఉన్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. భరత్ రాజమండ్రి సిటీ పరిధిలో నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ కీలక నేతలెవ్వరూ పాల్గొనడం లేదు. ఆయా వార్డుల్లో జక్కంపూడి రాజా అనుచరులుగా ఉన్న ఇన్‌చార్జ్‌లను తొలగించి ఎంపీ అనుచరులను నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ క్రమంలోనే.. వైసీపీలోని ముఖ్య నేతలంతా ఎంపీకి వ్యతిరేకంగా మారారు. అదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరతామని ఎంపీ వ్యతిరేక వర్గం చెప్తుండడం వైసీపీలో హీట్‌ పెంచుతోంది.

Untitled-140.jpg

సుందరీకరణ పనుల్లో ఎంపీ అవినీతిపై ఆరోపణలు

వాస్తవానికి.. రాజమండ్రి సిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంపీ భరత్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజమండ్రి సిటీ పరిధిలో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో ఎంపీ అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవానీ ఆరోపిస్తున్నారు. సుందరీకరణ పనుల్లో నాణ్యత లోపించిందని, ఇసుక అక్రమ తవ్వకాలు ద్వారా ఎంపీ అనుచరులు దోపిడీ చేస్తున్నారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంపీపై రాజమండ్రి వాసులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఎంపీపై సొంత సామాజికవర్గం నేతలు సైతం గుర్రుగా ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. ఇటీవల రాజమండ్రిలో శెట్టిబలిజ నేతలు ఎంపీకి వ్యతిరేకంగా ప్రత్యేక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ మధ్య భరత్‌ ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధనను కూడా శెట్టిబలిజలు బహిష్కరించారు.

Untitled-1545.jpg

మొత్తంగా... ఎంపీ భరత్‌ వ్యవహారం రాజమండ్రి వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఎంపీగా ఉన్న భరత్‌.. ఎమ్మెల్యే అవతారమెత్తి ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎంపీ భరత్‌పై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో వైసీపీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో.. రాజమండ్రి వైసీపీలో.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి..

Updated Date - 2023-02-17T12:00:41+05:30 IST