Sridevi Varthanti : మనవరాలిగా నటించిన హీరో పక్కనే హీరోయిన్‌గా శ్రీదేవీ.. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..

ABN , First Publish Date - 2023-02-24T11:34:27+05:30 IST

అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి సగటు ప్రేక్షకుడి మదిలో జగదేకసుందరే..

Sridevi Varthanti : మనవరాలిగా నటించిన హీరో పక్కనే హీరోయిన్‌గా శ్రీదేవీ.. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..
Sridevi Death

అందాల రాశి, దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య, "ఎంత గొప్ప సొగసురో.. ఏడ దాచినావురో" అని ప్రేక్షకులంతా ఈ అందాల దేవకన్య గురించి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు, తన ఓర చూపు తగిలినా చాలునని తపించిపోయే ప్రేమ పూజారులకు శ్రీదేవి ఎంపిక కాస్త నిరుత్సాహాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమె చేయని పాత్ర లేదు. ఆమె చేయని డ్యాన్స్‌లేదు. ఆమె పలికించని హావబావాలు లేవు. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి సగటు ప్రేక్షకుడి మదిలో జగదేకసుందరే.. ఆ దేవకన్య ఈలోకాన్ని వదిలి వెళిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేని సత్యమే..

"బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో ఉన్నాడు,. కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు".

ఈ చిన్న పిల్ల రేపు పెరిగి పెద్దదై తాతగా నటించిన నటసార్వభౌముడి పక్కనే హీరోయిన్‌గా నటిస్తుందని అప్పుడు ఎవరూ అనుకొని ఉండకపోవచ్చు. దొండ ముక్కుని సూది మొనలా చెక్కించుకుని, నాజూకు అందాలను తెరకు పరిచయం చేసిన నటి శ్రీదేవి. చిరునవ్వుతోనే కట్టి పడేయగలిగే చమక్కు ఆమె సొంతం. ఇదంతా నగుమోముతోనే సాధ్యం కాలేదు. తను సాధించలేనిది ఏదో కూతురు సాధిస్తుందని గట్టిగా నమ్మింది తల్లి రాజేశ్వరి. ఐదేళ్ళకే 'తునైవన్' అనే తమిళ చిత్రంలో సుబ్రమణ్యస్వామి వేషం వేయించింది. బాల నటిగా మానాన్న నిర్దోషి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. అందులో సూపర్ స్టార్ కృష్ణతో నటించింది. అదే హీరో సరసన భవిష్యత్తులో హీరోయిన్‌గా నటిస్తుందని బహుశా ఎవరూ అనుకుని ఉండకపోవచ్చు!

చిన్నారిగా కెరియర్ మొదలు పెట్టాకా తను నటించిన అగ్రహీరోలందరితోనూ పెద్దయ్యాకా కథానాయికగా చేసింది శ్రీదేవి. ఎన్. టీ. ఆర్, ఎ.ఎన్. ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అప్పటి హీరోలందరితోనూ పెద్దయ్యాకా నటించింది. అంతేనా నాగేశ్వరరావు పక్కన నటించడమే కాదు ఆయన కొడుకు నాగార్జున పక్కన కూడా చేసింది. పదహారేళ్ళ పరుగులుతీసే వయసులో తాను నటించిన 'పదహారేళ్ళ వయసు' సినిమా ఒక్క తెలుగు తెరనే కాదు అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. శ్రీదేవి కథానాయికగా నిలబడేందుకు ఈ చిత్రం మైులురాయి అయింది. ఓరకంగా తల్లి రాజేశ్వరి పంతమే శ్రీదేవిని తారగా అగ్రస్థానంలో కూచోబెట్టింది.

WhatsApp Image 2023-02-24 at 11.26.22 AM.jpeg

నవరసాల్లోనూ పండి, సమ్మోహన పరిచే ముగ్ధమనోహర రూపం శ్రీదేవిని తెరమీద రాణిని చేసి నిలబెట్టింది. ఆమెలోని నటనా కౌశలం కూడా దానికి తోడైంది. 1963లో జన్మించిన శ్రీదేవి గురించి అప్పటివారికి, ఇప్పటివారికీ కొత్తగా చెప్పేదేం లేదు. తన చూపుతో హావభావాలను అలవోకగా పలికించగలిగే ఆమె తెలుగు, హిందీ, తమిళం, కన్నడం ఇలా ప్రతి హుడ్ నీ కదిపేసింది. జగదేక సుందరిగా వెలుగుల తెరమీద వెలిగిపోయింది. చలన చిత్రరంగానికి ఊపు తెచ్చిన సినిమాలే అన్నీను. కెరియర్ ప్రారంభంలో తనకన్నా పెద్దవయసు నటులతో నటించినా ఆమె అందానికి అది పెద్ద తేడాగా కనిపించేది కాదు. 1980-90 దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి.

ఇక ఇప్పటివారికి బాగా కనెక్ట్ అయిన సినిమాలంటే జగదేకవీరుడు అతిలోక సుందరీ, క్షణక్షణం ఈ రెండు సినిమాల్లోనూ శ్రీదేవి అందం దేవకన్యను పోలే ఉంటుంది. నటన ఒక ఎత్తు ఆమె అందం మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది శ్రీదేవి ఈ సినిమాల్లో. డబ్బు, పేరు, హీరోయిన్‌గా మంచి స్థానం ఉన్నాకూడా తనవైపు నిలబడే తోడుకోసం చూసింది శ్రీదేవి. తల్లి అనారోగ్యం కారణంగా కుంగిపోయిన స్థితిలో తనకు తోడుగా ఉన్నది మాత్రం బోనీకపూరే.. సినీ రంగంలో ఎందరు ప్రముఖులతో పరిచయాలున్నా శ్రీదేవి కష్టంలో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకున్నది మాత్రం బోనీనే..

కారులో వెళుతూ తల్లి అన్న ఒక్కమాటకు కట్టుబడిపోయి బోనీ కపూర్‌తో సినిమాలు చేసేందుకు అంగీకరించింది. కలిసి సినిమాలు చేస్తున్న పదేళ్ళకుగానీ శ్రీదేవి మీద ఉన్న ప్రేమను ఆమెకు తెలీనీయలేదు బోనీకపూర్. కాదనేందుకు ఆమె దగ్గర కూడా పెద్దగా కారణాలు లేవు. బయటి ప్రపంచం చూసే వయసు వ్యత్యాసాన్ని కూడా పట్టించుకోలేదు. తను ఉన్న ఒంటరితనం తీసుకున్న నిర్ణయమే గెలిచింది. ప్రేక్షకుల ఆలోచనకు చిక్కని విధంగా మొత్తం సినీ ప్రపంచాన్ని ఫ్రీజ్ చేసే విధంగా తన నిర్ణయం ఉండబోతుందని తెలిసినా అటే మొగ్గు చూపింది. ఆమె జీవితంలోకి బోనీ కపూర్ వచ్చాడని, పెళ్ళినాటికి శ్రీదేవి మూడునెలల గర్భవతి అనే పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. కోట్ల రూపాయలు, లగ్జరీ బ్రతుకులు అయినా ఏదో వెలితి, అన్నీ తానే అయిన అమ్మను కోల్పోయాననే బాధలో బోనీకపూర్ ఆహ్వానించిన ప్రేమ ప్రపంచంలోకి సునాయాసంగా ప్రవేశించింది శ్రీదేవి. 1996 బోనీ కపూర్‌ని వివాహం చేసుకుంది. బోనీ మొదటి భార్య మోనా నుండి ఆమె కుటుంబం నుంచి చాలా శాపనార్థాలు ఎదురయినా అన్న తట్టుకుంది. ఇద్దరు బిడ్డల తల్లి అయింది. కాస్త విరామం తీసుకున్నా.. మళ్ళీ 2012లో ఇంగ్లీష్, వింగ్లీష్‌తో తిరిగి తన అత్యద్భుత ప్రతిభను చూపించింది.

2017లో 'మామ్' మూవీతో కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. తన నటనకు చావు లేదని నిరూపించుకుంది. సుమారు 300 మూవీస్‌లో నటించిన శ్రీదేవికి 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో బాటు, 2013 లో పద్మశ్రీ అవార్డ్ కూడా వచ్చింది. అన్నీ అనుభవించినా, తన కూతురు జాన్వి నటిస్తున్న చిత్రం విడుదలను కళ్ళారా చూడకుండానే, జీవితరంగంలో తన పాత్ర ముగించుకుని వెళిపోయింది.

శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని వీడి వెళ్ళింది. ఆ వార్త విన్న అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బంధువుల పెళ్ళి కోసం దుబాయ్ వెళ్లి ఓ హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసింది. జీవితంలో ఎంత తొందరగా బంగారు బాటను వేసుకుంటూ ఎదిగిందో అంతే తొందరగా పాత్ర ముగించుకుని వెళిపోయింది. ఆమె అద్భుత నటన చిత్రసీమలో చెరగని ముద్ర. ఎందరు నటీమణులు ఇండస్ట్రీకి వచ్చినా ఆమె స్థానం ఎప్పటికీ అజరామరం, సుస్థిరం.

Updated Date - 2023-02-24T12:39:28+05:30 IST