Ola Auto Driver: ఓలా, ఉబెర్ ఆటో డ్రైవర్ల కొత్త స్కెచ్.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవమేంటో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-07-27T20:10:05+05:30 IST
బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ టెకీని రైడ్ క్యాన్సిల్ చేసి యాప్ చార్జీపై అదనంగా రూ.100 ఇస్తేనే గమ్యస్థానానికి చేరుస్తానంటూ డిమాండ్ చేశాడు. దీంతో, షాకయిపోయిన టెకీ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓలా(Ola), ఊబర్(Uber) సేవలకు జనాలు అలవాటు పడిపోయారు. మరి డ్రైవర్ల పరిస్థితి ఏంటీ అంటే వారు తమ ఒకప్పటి అలవాట్లను వదులుకోలేక పోతున్నారు. ఇందుకు ఉదాహరణే తాజా ఉదంతం. బెంగళూరులో ఓ ఓలా ఆటో డ్రైవర్ వేసిన స్కెచ్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దిమ్మెరపోయాడు. ఇక్కడ జనాలు ఎలా బతుకుతున్నారో అంటూ నిస్సహాయంగా ట్వీట్ చేశారు. దాదాపు మూడు రోజుల క్రితం అతడీ ట్వీట్ చేయగా ఇప్పటికీ నెట్టింట్లో చర్చ కొనసాగుతోందంటే సామాన్యుల పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల బెంగళూరు(Bengaluru) సిటీ స్టేషన్ వద్ద దిగిన ప్రశాంత యాదవ్(Techie) ఓలా ఆటో బుక్ చేసుకున్నాడు. ఆ తరువాత అతడికి డ్రైవర్ కనిపించాడు. ఆటో ఎక్కబోతుండగా అతడు రైడ్ క్యాన్సిల్ చేయమని సలహా ఇచ్చాడు. అందులో కనిపించిన రేటు కంటే వంద ఎక్కవ ఇస్తేనే ప్రశాంత వెళ్లాల్సిన చోట దింపుతానంటూ నిర్మొహమాటంగా చెప్పాడు.(Ola driver asking passenger to cancel ride and additional rs.100)
ఈ అనుభవంతో షాకయిపోయిన ప్రశాంత ఆ ఘటనా క్రమాన్ని వివరిస్తూ ట్వీట్ చేశాడు. ఇలాంటి చోట్ల మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన ట్వీట్‌కు నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు. అక్కడ ఉండటం మామూలు విషయం కాదంటూ అనేక మంది కామెంట్ చేశారు. నేనైతే వెంటనే ఆ రైడ్ క్యాన్సి్ల్ చేసి మరో ఆటో బుక్ చేసుకుని ఉండేవాడిని అని మరికొందరు ఠకీమని సమాధానమిచ్చారు. ఆ ఆటో డ్రైవర్‌పై ఓలాకు ఫిర్యాదు చేయాలని మరికొందరు సూచించారు.
కాగా, కొద్ది రోజుల క్రితం బెంగళూరులో అర కిటోమీటరు ఆటో ప్రయాణానికి ఏకంగా వంద రూపాయలు చెల్లించిన ఓ కంపెనీ సీఈఓ ఉదంతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దేశఆర్థిక రాజధాని అయిన ముంబైలో కూడా ఇలాంటి రేట్లు లేవని, అక్కడ ఆరు కిలోమీటర్ల దూరానికి వందే అవుతుందంటూ ఆయన సోషల్ మీడియాలో చెప్పడం వైరల్‌గా మారింది. నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.