Autowala Newstons Third Law: ఆటోవాలాను తక్కువ అంచనా వేశాడు.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందంటే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:53 PM
ఆటోవాలాను అతడు అజ్ఞాని అనుకున్నాడు. న్యూటన్ మూడో గమన సూత్రం చెబితే రూ.500 ఇస్తానన్నాడు. తడుముకోకుండా సమాధానం చెప్పిన ఆటోవాలా ..ఆ వ్యక్తి చేతిలోని రూ.500 దర్జాగా లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరిలో ఎంత సామర్థ్యం ఉంటుందో చూడగానే అంచనా వేయలేము. దుస్తులను బట్టి, వృత్తిని బట్టి లోకువ కడితే చివరకు ఊహించని షాక్ తగులుతుంది. ఓ కంటెంట్ క్రియేటర్‌కు సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ జనాలను కడుపుబ్బా నవ్విస్తోంది. లక్షల కొద్దీ వ్యూస్ రాబడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూట్యూబర్‌లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఎక్కువైపోయిన జమానా ఇది. దీంతో, నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లు నానా తిప్పలు పడుతున్నారు. రకరకాల కొత్త కంటెంట్‌ను జనాల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా వీడియోలో కూడా ఓ కంటెంట్ క్రియేటర్ అలాంటి ప్రయత్నం చేశాడు. అతడు దారిన పోయే ఓ ఆటోవాలాను ఆపి తన ఆఫర్ గురించి వివరించాడు. తను అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెబితే రూ.500 ఇస్తానన్నాడు.
Also Read: మ్యాచ్‌లో ఓటమితో ఆగ్రహం.. బాలిక జుట్టు పట్టి లాగిన కోచ్‌కు భారీ షాక్
మొదట కంటెంట్ క్రియేటర్ ఆటోవాలాను సులువైన ప్రశ్నతో ఉచ్చులోకి దింపాడు. ఇండియాకు ఉన్న మరో రెండు పేర్లు చెప్పమని అన్నాడు. ప్రశ్న విని కాస్తంత ఖుష్ అయిన ఆటోవాటా భారత్.. హిందుస్థాన్ అంటూ ఠకీమని సమాధానం చెప్పాడు. భారత్‌లో ఇద్దరు సినీహీరోల పేర్లను చెప్పమని కంటెంట్ క్రియేటర్ అడిగాడు. షారుఖ్, సల్మాన్ అని తడుముకోకుండా సమాధానం చెప్పాడు ఆటోవాలా.
ఇలాంటి సింపుల్ ప్రశ్నలతో అతడికి ఉచ్చులోకి లాగాలనేది కంటెంట్ క్రియేటర్ ప్లాన్. ఆటోవాలాకు చదువురాదు కాబట్టి క్లిష్టమైన మూడో ప్రశ్నను అడిగి అతడి నిరాశను చిత్రీకరించి వ్యూస్ రాబట్టేందుకు సిద్ధమయ్యాడు.
Also Read: గగనతలంలో ఉండగా జరిగిన పొరపాటు గుర్తొచ్చి పైలట్‌కు షాక్.. విమానం యూటర్న్!
మూడో ప్రశ్నగా..న్యూటన్ మూడో గమన సిద్ధాంతాన్ని చెప్పమని ఆటోవాలాను అడిగాడు. అయితే, ఆటో డ్రైవర్ ఊహించని విధంగా.. ఆ సిద్ధాంతాన్ని ఇంగ్లిష్‌లోనే వినిపించాడు. ఆ దెబ్బకు షాకైపోయిన కంటెంట్ క్రియేటర్ తేరుకునే లోపే అతడి చేతిలోని రూ.500 కాగితాన్ని కూడా లాగేసుకున్నాడు.
ఇదంతా నిజమా లేక స్క్రిప్ట్ ప్రకారం తీసిన వీడియోనా అన్న సందేహాలు ఉన్నప్పటికీ జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పట్టారు. ఆటోవాలాను తక్కువ అంచనా వేసినందుకు దెబ్బైపోయాడంటూ కొందరు కామెంట్ చేశాడు. చేసే వృత్తిని బట్టి మనుషుల స్థాయిలను నిర్ణయించకూడదని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఓ లుక్కేయండి.