LOVE: నాడు కాలమే కరిగిపోయింది... నేడు కాలాంతకుల చేతుల్లో...

ABN , First Publish Date - 2023-02-27T15:15:58+05:30 IST

మనసులు కలిపి, ఆమెతో చనువుగా ఉన్న రోజులన్నీ మరిచిపోయి కసి, కోపం, ఉక్రోషం

 LOVE: నాడు కాలమే కరిగిపోయింది... నేడు కాలాంతకుల చేతుల్లో...
love stories

గుండెల్లో పదిలంగా ఉండాల్సిన ప్రేమ గుండెల్ని చీల్చేదాకా వెళుతోంది. దీన్ని ప్రేమంటారా? చూడగానే మనసు పారేసుకోవడం... నాలుగు రోజుల పాటు క్లబ్స్, పబ్స్, పార్క్స్ అంటూ సరదాలు తీర్చుకున్నాక బ్రేకప్ అంటూ మరో తోడు చూసుకోవడం. మల్టిపుల్ పార్ట్‌నర్స్‌ని మెయింటెయిన్ చేస్తూ, స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయ్స్ వరకూ నాలుగు రోజుల ముచ్చటలా సాగుతున్న ప్రేమకు అర్థం లేకుండా పోతోంది... స్నేహాన్ని చిదిమేస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రేమ పేరిట కొనసాగుతున్న దారుణాల నేపథ్యంలో.. ఒకప్పుడు ప్రేమ కోసమే పరితపించి, జీవితాల్ని అంకితం చేసిన ప్రేమికులతో మొదలుపెట్టి... ప్రేమ చిగురించకుండానే తుంచి పడేస్తున్న నేటి రోజుల వరకూ, ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందో చూద్దామా...

కాలం మారిపోతుందా? సమాజం తీరుతెన్నుల్లోనూ మార్పు కాస్త వేగంగానే ఉందా? బంధాల చీలికలు, పేలవంగా మారిన నైతికత ఇద్దరి మధ్య అన్యోన్యత లోపించడానికి కారణం అవుతుందా? అవుననే లెక్కలు తేలుతున్నాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడచ్చు. అయితే అది ఫలించాలని చేసే ప్రయత్న ఫలితం మాత్రం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ప్రతి ప్రేమా, వివాహం వరకూ వెళ్లకపోవచ్చు. ప్రస్తుత ప్రేమ తీరుతెన్నులు పరిశీలిస్తే..

ఎప్పుడో బీసీకాలంనాటి ప్రేమలెలా ఉండేవంటే..

ప్రేమిస్తే ఆమెదే లోకంగా, ప్రేమను అపురూపంగా స్వీకరించేవారు. ఆమెకు పెళ్ళి చేసుకుంటానని ఇచ్చిన మాట కోసం తల్లిదండ్రుల్ని ఒప్పించో, నొప్పించో జీవిత భాగస్వామిని చేసుకునేవారు. అదే ప్రేమ దక్కదని తెలిస్తే ఆమె జీవితం బావుంటే చాలని తమ జీవితం ఏమైనా పరవాలేదనే వారు అప్పట్లో లేకపోలేదు. లేదంటే ఆమె సుఖాన్ని అతను, అతని సుఖాన్ని ఆమె కోరుకుని, జీవితంలో రాజీకి వచ్చేవారు. ప్రేమలన్నీ విజయం వైపుకే పరుగులు తీస్తే, ఇక చెప్పుకునేదేం ఉంటుంది. ఆమె జీవితంలో రాజీ పడిపోయి వివాహ బంధంలో స్థిరపడిపోతే, అతను ప్రేయసినే తలుచుకుంటూ బ్రహ్మచారిగా కాలం వెళ్ళదీసేవాడు. ఎప్పుడన్నా ఆమె తారసపడితే మాత్రం కోతకు గురైన తన భగ్న హృదయాన్ని ఆమె చూపులతో నింపేసుకుని తృప్తి పడేవాడు. ఇది అప్పటి మాట. కానీ కాలం మారుతుంది.

ఒకప్పటి ప్రేమకు అందంలేదు, డబ్బులేదు, మోసం తెలీదు.

ప్రేమించుకోవడానికి, ప్రేమలో పడడానికి క్షణకాలం సరిపోతుంది. మరి ప్రేమని నిలుపుకోవడానికో చాలా కావాలి. ఒకప్పుడు అమ్మయి, అబ్బాయి ప్రేమకు కులం అంటూ పెద్దలు అడ్డంకులు పెడితే, ఎదిరించి ప్రేమను గెలిపించుకునేవారు. కొన్నాళ్ళకు కాకపోయినా బిడ్డలు పుట్టాకా అయినా పెద్దలు చేరదీస్తారనే భరోసా ప్రేమ ఇది.

మరికొంత కాలానికి ప్రేమ ఎలా మారిందంటే..

మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, కఠిన నిర్ణయాలు వీటన్నింటి మధ్యా ఆమె దక్కలేదని అతను, అతను దక్కలేదని ఆమె ఆత్మహత్యలు చేసుకోవడం జరిగేది. ఇది పిరికితనం అనుకున్నా, చేసేదేం లేక ఇద్దరూ ప్రేమను గెలిపించుకోలేక చావుతో గెలిపించుకునేవారు. ఇది ఆత్మత్యాగం ప్రేమ.

విఫలమైన ప్రేమ బ్రేకప్ అంటుంది.

ఈకాలంలో ప్రేమించాలి అంటే అందంగా ఉండాలి, డబ్బు, పలుకుబడి, సంఘంలో మంచి స్థానం ఇవన్నీ కలిసి వస్తే, ప్రేమ కాసిని రోజులు సజావుగా సాగి, చెట్లు, పుట్టలు, సినిమాలు, పబ్బులు ఇలా తిరిగేసి చివరకు బోర్ కొట్టిందనో, సినిమాకు టైంకి రాలేదనో, పక్కవాడిని దొంగచూపులు చూస్తున్నావనో కారణం లేని కారణాలతో విడిపోవడం పరిపాటి అయిపోయింది. ప్రాణం తీసుకునేలా చేస్తుంది. మరి ఇప్పుడో ఇంకాస్త అడ్వాస్స్‌గా మారి ప్రాణాలను తీస్తుంది. పరిత్ర హృదయాల కలబోసుకునే ప్రేమ ఎటు పోతుంది. ప్రేమకున్న ప్రమాణాలు ఏమైపోయాయి. పెద్దల దగ్గర తమ ప్రేమను ఉంచకముందే, బ్రేకప్‌తో విడిపోవడమే.. ఇది బ్రేకప్ ప్రేమ..

ఇది కక్ష సాధించే ప్రేమ..

ఆమె తనతో కాకుండా ఇంకొకరితో చనువుగా ఉంటుందని కక్ష పెంచుకుని, తనకు దక్కని ప్రేమ ఇంకెవరికీ దక్కకూడదనే కోణం మొదలవుతుంది. మనసులు కలిపి, ఆమెతో చనువుగా ఉన్న రోజులన్నీ మరిచిపోయి కసి, కోపం, ఉక్రోషం మాత్రమే మిగిలి చివరికి ఆ అందమైన ముఖాన్ని నాశనం చేసేయాలనేంత వరకూ వస్తుంది పరిస్థితి. ఆమె మీద యాసిడ్ దాడికి తెగబడతాడు సదరు ప్రేమికుడు. ప్రేమలో త్యాగం ఉంటుందనే మాట పోయి, దక్కకపోతే శాడిజం కూడా ఉంటుందనే వరకూ వస్తుంది. అందమైన తన ముఖం కాలిపోయి వికృతంగా మారి బ్రతికినన్నాళ్ళూ జీవచ్చవంగా బ్రతుకుతుంది ఆమె. చేసిన పనికి కటకటాలు లెక్కకడతాడు సదరు ప్రేమికుడు.

ఇది హంతక ప్రేమ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

ప్రేమించి కాస్త కాలం గడిపాకా, ఇద్దరి మధ్య విభేదాలు వస్తే వద్దనుకుని బ్రేకప్ చెప్పుకుని ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తే ఇంకేం ఉంది. అలా కావడం లేదే.. ఈ ట్రయాంగిల్ స్టోరీలో మరో అబ్బాయినో, మరో అమ్మాయినో ప్రేమించి పాతవాడికి తెలియకుండా కొత్తవాడిని కెలికి, కక్షలు పెంచుకునేలా చేసి ఆఖరుకి హత్య చేయించే దాకా వస్తుంది. ఇదేం కొత్తకాదు మా ఊళ్లోనూ ఫలానా అమ్మాయి విషయంలో ఇలానే జరిగింది, అని మాట్లాడుకునేలా ఈమధ్యకాలంలో ఇవే ప్రేమ హత్యలు పదే పదే జరుగుతున్నాయి. ఒకేసారి ఇద్దరితో ప్రేమ వ్యవహారంలో ఉంటున్నారు. ఇప్పటి అబ్బాయిలు, అమ్మాయిలు. ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. ఆమె కోసం హత్య చేసేంత ప్రేమ చూపిస్తున్నాడు త్రికోణంలోని ప్రేమికుడు, అతని కోసం భర్తనే చంపేంత సాహసం చేస్తుంది ప్రేయసి. ఇదంతా వికృత ప్రేమ.

ప్రేమకు త్యాగం మాత్రమే తెలుసుననే ప్రమాణాలను మార్చేస్తూ ప్రేమిస్తే చంపేంత వరకూ వెళ్ళచ్చుననే కోణం కూడా చూపుతున్నారు ఇప్పటి ప్రేమికులు. ఇక మునుముందు ప్రేమికులుగా మారుతున్న యువతలో ఇంకెలాంటి కోణాలను చూడాల్సివస్తుందో.. హతవిధీ..!

Updated Date - 2023-02-27T15:29:42+05:30 IST