పెళ్ళిలో డిజే పెట్టారు.. నేేను మీ పెళ్ళి చేయనని వెళ్ళిపోయిన మౌల్వీ.. వధువు కుటుంబం చేసిన పనికి పాపం..
ABN , First Publish Date - 2023-03-15T12:47:05+05:30 IST
అందితే కాళ్ళు.. అందకుంటే జుట్టు పట్టుకునే వాళ్ళు కొందరుంటారు..
భారతదేశం సర్వమత సమ్మేళనం. ప్రతి మతం తమ పండుగలను, శుభకార్యాలను సంప్రదాయ బద్దంగా జరుపుకుంటుంది. దీనికి తగ్గట్టుు ఆయా మతాలు కొన్ని పనులను నిషిద్దం చేస్తాయి. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త పోకడలు పోతారు కొందరు. సంప్రదాయంలో భాగంకాని వాటిని అందులో జొప్పించి పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఇక్కడా అదే జరిగింది. ఇస్లాం మతంలో కొన్ని సంప్రదాయాలుంటాయి. పెళ్ళిలో డాన్సులు, డీ.జేలు పెట్టడం వారికి నిషిద్దం. కానీ వారు మాత్రం పెళ్ళికి డీ.జే పెట్టించారు. దీంతో పెళ్ళి జరిపించడానికి వచ్చిన వారి మత పెద్ద మౌల్వీ మీరు సంప్రదాయానికి విరుద్దంగా చేశారంటూ కోప్పడ్డారు. నేను పెళ్ళి జరిపించనని అక్కడినుండి అసహనంగా వెళ్ళిపోయాడు. కానీ వధువు కుటుంబం మౌల్వీ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం బిజ్నోర్(Bijnor) లో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన పెళ్ళి వేడుక జరుగుతోంది. పెళ్ళి జరిపించడానికి అక్కడికి వారి మత పెద్ద వచ్చాడు. పెళ్ళిలో పెద్ద ఎత్తున సౌండ్ తో డీ.జే(DJ) పెట్టి ఉండటం గమనించిన ఆయన 'మీరు మనది కాని సంప్రదాయాన్ని పాటించి మన మతాన్ని అగౌరవపరుస్తున్నారు' అని కోపం చేసుకున్నాడు. దాంతో అమ్మాయి కుటుంబం వారు మౌల్వీ తో 'అదేమీ అగౌరవ పరచడం కాదు. పిల్లల సరదా కోసం చేశాము. మాకు మతం మీద గౌరవం ఉంది' అని చెప్పారు. 'మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? కొంచెం కూడా సంప్రదాయాల పట్ల భాద్యత, భయం లేవు' అని వాళ్ళను నిందించి అక్కిడినుండి వెళ్ళిపోయాడు.
పెళ్ళి జరిపించకుండా వెళ్ళిపోయాడనే కోపం మౌల్వీ మీద ఉన్నా మరొకవైపు ఇంకా పెళ్ళి జరగలేదనే కంగారులో అప్పటికప్పుడు ఇంకొక మౌల్వీని పిలుచుకుని వచ్చారు. ఆ మౌల్వీ కూడా డీ.జే విషయంలో ఏదైనా గొడవ చేస్తాడేమోనని ఆయన చెవులలో పత్తి నింపారు. కానీ ఆ రెండవ మౌల్వీ కూడా వారు చేసిన పనికి రివర్స్ అయ్యాడు. నేను పెళ్ళి జరిపించనని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతో రెండు కుటుంబాలు ఆందోళన చెందాయి. చివరికి మూడవ మౌల్వీని తీసుకొచ్చి అక్కడ పెళ్ళి తంతు చేయించారు. పెళ్ళి మొత్తం అయిపోయాక మొదటి మౌల్వీ పెళ్ళి జరిపించి ఉంటే ఈ గోల అంతా ఉండేది కాదనే కోపంతో ఆయన ఇంటికి వెళ్ళి కర్రలతో దాడి చేశారు. మౌల్వీ కుటుంబ సభ్యులందరినీ కొట్టారు. ఈ దాడిలో ఆ ఇంటి మహిళలకు కూడా దెబ్బలు తగిలాయి. మౌల్వీ కుటుంబంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.