Rajinikanth: ‘అలా చేసి తప్పు చేశా.. ఇప్పుడు ఆయనే లేరు’.. ఎమోషనలైన సూపర్‌స్టార్
ABN , First Publish Date - 2023-02-20T12:12:11+05:30 IST
ప్రముఖ తమిళ హాస్యనటుడు, నటుడు మైల్‌సామి (Mayilsamy) ఫిబ్రవరి 19న మరణించిన విషయం తెలిసిందే.
ప్రముఖ తమిళ హాస్యనటుడు, నటుడు మైల్‌సామి (Mayilsamy) ఫిబ్రవరి 19న మరణించిన విషయం తెలిసిందే. 57 సంవత్సరాల వయస్సులో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ తరుణంలో తాజాగా దివంగత కమెడియన్ నివాసంలో తన స్నేహితుడు మైల్‌సామికి సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నివాళులు అర్పించారు. మహాశివరాత్రి నాడు శివ భక్తుడైన మైల్‌సామి మరణించాడని, శివుడు తన ప్రియ భక్తుడిని తన దగ్గరకే తీసుకెళ్లాడని రజనీ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘మైల్‌సామి నా సన్నిహితులలో ఒకరు. ఆయన 23, 24 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి నటుడిగా ఎదిగారు. ఆయన ఎంజీఆర్ (MGR)కి వీరాభిమాని, అలాగే పరమ శివ భక్తుడు. మేమిద్దరం తరచుగా కలుసుకునేవాళ్లం. నేను ఆయన్ని సినిమా గురించి చెప్పు అని అడిగితే.. ఆయన మాత్రం ఎంజీఆర్, శివుడు గురించే ఎక్కువగా మాట్లాడేవారు. మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అయినప్పటికీ కలిసి ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయాం. కారణం మాత్రం తెలీదు. ఆయన ప్రతి సంవత్సరం కార్తీక దీపం సందర్భంగా తిరువణ్నామలై వెళ్లేవారు. అక్కడి జనాలను చూసి, వారంతా తన సినిమా మొదటి షోకి వచ్చినట్లు సంతోషించేవారు. అది ఆయన భక్తి’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: #RIPMayilSamy: సినీ పరిశ్రమలో విషాదం.. తమిళ ‘సీన్ స్టీలర్’ కన్నుమూత
అలాగే రజనీ ఇంకా మాట్లాడుతూ.. ‘మైల్ సామి ఏటా కార్తీక దీపం సందర్భంగా నాకు కాల్ చేసి విష్ చేసేవారు. ఈ ఏడాది ఆయన కాల్ చేసినప్పుడు, నేను పనిలో బిజీగా ఉండి కాల్ ఎత్తలేకపోయాను. ఆయన అలా మూడు సార్లు చేశాడు. కానీ నాకు మాట్లాడడం కుదరలేదు. అనంతరం నేనే కాల్ చేసి క్షమాపణలు చెబుదామని అనుకున్నా. కానీ అదీ సాధ్యం కాలేదు. ఇంతలోనే ఇంత దారుణం జరిగిపోయింది’ అని ఎమోషనల్‌గా తెలిపారు.