K Viswanath: ఆయన విలన్లు ఎంత మంచివాళ్లో?
ABN , First Publish Date - 2023-02-03T22:50:55+05:30 IST
సినిమాలో విలన్ అంటే ఎలా ఉండాలి? క్రూరంగా ఉండాలి. విలన్ ఎంత క్రూరంగా ఉంటే..
సినిమాలో విలన్ అంటే ఎలా ఉండాలి? క్రూరంగా ఉండాలి. విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడనేది చాలామంది కథకులకు, దర్శకులకు, ప్రేక్షకులకు కూడా ఉన్న అభిప్రాయం. క్రూరం అంటే? మంచివాళ్లను తిట్టాలి, కొట్టాలి..... ఇంకా క్రూరం అంటే? తనకు అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేయాలి. మరీ క్రూరం అంటే...? హీరోను చంపమని తనవాళ్లని పంపినప్పుడు వాళ్లు చంపలేక హీరో చేతిలో దెబ్బలు తిని తిరిగి వస్తే తన మనుషుల్ని తానే చంపెయ్యాలి..... ఇక అత్యంత క్రూరం అంటే... హీరో విలన్ కొడుకును కాపాడితే ‘‘నువ్వు కాపాడిన ఎంగిలి ప్రాణం నాకు వద్దు’’ అంటూ తన సొంత కొడుకును తానే చంపేసుకోవాలి. ఇలా విలన్ క్రూరత్వాన్ని పెంచుకుంటూ పోయేకొద్దీ హీరో బాగా ఎలివేట్ అవుతాడన్న భావన బలంగా ఉంది. కానీ కళాతపస్వి కె.విశ్వనాథ్ విలన్లు ఇందుకు పూర్తి భిన్నం. ఓ చిన్న పిల్లవాడు తనకంటే బాగా పాడుతున్నాడని ఓ గాయకుడు అసూయ పడడం విలనీ అవుతుందా? మరో గాయకుడు తన భార్యను వదిలిపెట్టి ఓ అమ్మాయితో ఉంటూ సంగీతాన్ని నిర్లక్ష్యం చేయడం విలనీ అవుతుందా? విశ్వనాథ్ సినిమాల్లో అవుతుంది మరి! ఆయన సినిమాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఉన్నతాదర్శాలు ఉంటాయి. లౌకిక సుఖాల్ని ఆశించకుండా కళలకు ప్రాణమిచ్చే వారుంటారు. అలాంటి మహాత్ముల మధ్య చిన్న చిన్న తప్పులు చేసేవారు, చిన్న చిన్న ఈర్ష్యాద్వేషాలు కలిగిన వారు కూడా విలన్లుగా కనిపిస్తారు. విలన్ విలన్‌లా కనిపించాలంటే అతడు క్రూరంగా ఉండక్కర్లేదు, సినిమాలో మనం నిర్మించే సద్గుణాల పునాది కంటే కాస్త కింద ఉంటే చాలు అని విశ్వనాథ్ నిరూపించారు. మంచివాళ్ల విలువల్ని, చెడ్డవాళ్ల విలువల్ని కూడా కిందికి కాకుండా కాస్త ఎత్తుకు తీసుకువెళ్లారు.