Asian Games 2023: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. గత రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన భారత్

ABN , First Publish Date - 2023-10-04T11:10:57+05:30 IST

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుచుకోవడం ద్వారా గత రికార్డులను తిరగరాసింది.

Asian Games 2023: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. గత రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన భారత్

హాంగ్జౌ: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుచుకోవడం ద్వారా గత రికార్డులను తిరగరాసింది. తమ ఆసియా క్రీడల చరిత్రలోనే ఈ సారి అత్యధిక పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ ఫైనల్‌లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటాలేతో కూడిన భారత జట్టు విజయకేతనం ఎగురవేసి స్వర్ణం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణ కొరియా జోడీ సో చెవాన్- జూ జేహూన్‌‌పై భారత జోడి జ్యోతి సురేఖ వెన్నం-ఓజాస్ డియోటాలే 159-158తో గెలుపొందారు. ఆరంభం నుంచి రెండు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా పొరాడారు. మొదటి గేమ్ ముగిసే సమయానికి భారత్, కొరియా 40-39 పాయింట్లతో నిలిచాయి. రెండో గేమ్ ముగిసే సమయానికి 80-79తో నిలిచాయి. కీలకమైన మూడో గేమ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకానొక దశలో రెండు జట్లు 119-119తో సమంగా నిలిచాయి.


ఆ తర్వాత భారత ఆటగాళ్లు పుంజుకుని 158-155తో అధిక్యంలోకి వెళ్లారు. చివరకు 159-158తో మ్యాచ్ ముగిసింది. దీంతో స్వర్ణం భారత్ కైవసం అయింది. ఆరంభం నుంచి స్వల్ప అధిక్యంలో ఉన్న భారత జోడి జ్యోతి సురేఖ వెన్నం-ఓజాస్ డియోటాలే చివరి వరకు అదే కొనసాగించడంతో విజయం వరించింది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది 16వ బంగారు పతకం కాగా.. మొత్తంగా 71వది. మొత్తంగా ఒక ఎడిషన్‌లో భారత్‌కు ఇవే అత్యధిక పతకాలు కావడం గమనార్హం. దీంతో భారత్ గత రికార్డులను తిరగరాసింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో గెలిచిన 70 పతకాల రికార్డును బద్దలుకొట్టింది. అలాగే 2018లో గెలిచిన 16 బంగారు పతకాల రికార్డును కూడా సమం చేసింది. మరొక బంగారు పతకం గెలిస్తే ఒక ఎడిషన్‌లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన రికార్డును కూడా అందుకుంటుంది. ఇక భారత్ ఇప్పటివరకు గెలిచిన 71 పతకాల్లో 16 గోల్డ్, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

Updated Date - 2023-10-04T15:01:57+05:30 IST