India vs Australia: ఒక్క దెబ్బతో బోల్డన్ని రికార్డులు కొల్లగొట్టిన ఖావాజా!
ABN , First Publish Date - 2023-03-10T17:46:11+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ ఓపెనర్
అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు సెంచరీ చేసిన ఈ ఓపెనర్ .. రెండో రోజూ అదే జోరు కొనసాగించాడు. 180 పరుగులు చేసి డబుల్ సెంచరీకి కాస్త ముందు అవుటయ్యాడు. తాను ఎదుర్కొన్న 346వ బంతికి 150 పరుగులు పూర్తి చేసుకున్న ఖావాజా అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో తొలి సెంచరీ చేయడంతో పాటు మరిన్ని రికార్డులను తన పేర రాసుకున్నాడు.
2001లో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ 150కిపైగా పరుగులు సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఖావాజా ఆ ఘనత అందుకున్నాడు. అంతేకాదు, ఇండియాలో 150కిపైగా పరుగులు చేసిన నాలుగో ఆస్ట్రేలియా ఓపెనర్‌గా మరో రికార్డు అందుకున్నాడు. 2001లో చెన్నైలో జరిగిన టెస్టులో హేడెన్ డబుల్ సెంచరీ (203) సాధించాడు.
భారత్‌పై 150కిపైగా చేసిన ఆసీస్ ఓపెనర్లు వీరే..
* జిమ్ బుర్కే 1956లో బ్రాబౌన్‌లో 161 పరుగులు చేశాడు
* గ్రహమ్ యలోప్ 1979లో ఈడెన్ గార్డెన్స్ టెస్టులో 167 పరుగులు చేశాడు
* 2001లో చెన్నైలో జరిగిన టెస్టులో మాథ్యూ హేడెన్ 203 పరుగులు చేశాడు
* ఇప్పుడు అహ్మదాబాద్ టెస్టులో ఖావాజా 180 పరుగులు చేశాడు.
కాగా, అక్టోబరు 2019లో భారత గడ్డపై దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ 150కిపైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత పర్యాటక జట్టు ఆటగాడు 150 ప్లస్ పరుగులు సాధించడం ఇదే తొలిసారి. 2001 చెన్నై టెస్టులో హేడన్ డబుల్ సెంచరీ (203) సాధించిన తర్వాత ఇప్పటి వరకు పర్యాటక జట్ల ఆటగాళ్లు ఐదుగురు మాత్రమే 150కిపైగా పరుగులు సాధించారు. 2004లో సఫారీ బ్యాటర్ ఆండ్రూ హాల్ 163 పరుగులు సాధించగా, 2008లో దక్షిణాఫ్రికా ఆటగాడు నీల్ మెకంజీ 155, 2010లో కివీస్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ 225, ఇంగ్లండ్ బ్యాటర్ అలిస్టర్ 2012లో అహ్మదాబాద్‌లో 176, కోల్‌కతాలో 190 పరుగులు, 2019లో డీన్ ఎల్గర్ 160 పరుగులు చేశారు.