Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!!

ABN , First Publish Date - 2023-09-19T15:48:05+05:30 IST

చైనా వేదికగా ఏషియన్ గేమ్స్ 2023 జరగనున్నాయి. టీమిండియా మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే తలపడుతుంది. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా టీమిండియా క్వార్టర్ ఫైనల్లోనే ఆడనుంది.

 Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!!

చైనా వేదికగా ఏషియన్ గేమ్స్ 2023 జరగనున్నాయి. క్రికెట్‌కు సంబంధించి ఈనెల 19 నుంచి మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 26న జరగనుంది. పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 7న జరుగుతుంది. అయితే టీమిండియా మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే తలపడుతుంది. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా టీమిండియా క్వార్టర్ ఫైనల్లోనే ఆడనుంది. అక్టోబర్ 3న జరిగే క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే భారత జట్టు అక్టోబర్ 6న జరిగే సెమీస్ ఆడుతుంది. అక్కడ కూడా గెలిస్తే అక్టోబర్ 7న ఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా క్రీడల్లో టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏషియన్ గేమ్స్‌లో టీమిండియాతో పాటు ఆసియా కప్‌లో ఆడిన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా తలపడనున్నాయి. ఆయా జట్లు కూడా నేరుగా క్వార్టర్ ఫైనల్‌ ఆడనున్నాయి.

ఇది కూడా చదవండి: IND Vs AUS: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు ముందు గ్రూప్ దశ ఉంటుంది. తొమ్మిది జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో నేపాల్, మంగోలియా, మాల్దీవులు ఉన్నాయి. గ్రూప్ Bలో జపాన్, కాంబోడియా, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్-సిలో మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ ఉన్నాయి. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరుగుతాయి. కాగా ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీలో దర్శనమివ్వనుంది. రెగ్యులర్ జెర్సీతో పోలిస్తే ఈ జెర్సీ చాలా విభిన్నంగా కనిపిస్తోంది. ఆసియా క్రీడలకు వెళ్లే టీమిండియాలో రుతురాజ్ గైక్వాడ్, యషస్వీ జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శివం దూబె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి ఉన్నారు.

ఇటీదల ఆసియా క్రీడల కోసం శ్రీలంక బోర్డు 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌-2023కు సమయం ఆసన్నం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపాలని శ్రీలంక సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక యువ జట్టుకు ఆల్‌రౌండర్‌ సహన్ అరాచ్చిగే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సహన్ అరాచ్చిగే శ్రీలంక సీనియర్‌ జట్టు తరపున ఇప్పటివరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉండడంతో జట్టు పగ్గాలు అతడికి సెలక్టర్లు అప్పగించారు.

Updated Date - 2023-09-19T15:48:05+05:30 IST