IPL RR vs DC : ఢిల్లీ.. మళ్లీ

ABN , First Publish Date - 2023-04-09T01:20:50+05:30 IST

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలరాత మారడం లేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 57 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తుచేసింది.

IPL RR vs DC : ఢిల్లీ.. మళ్లీ

క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

రాజస్థాన్‌ ఘన విజయం

బట్లర్‌, జైస్వాల్‌ విజృంభణ

గువాహటి: ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలరాత మారడం లేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 57 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తుచేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (31 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 60), బట్లర్‌ (51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 79) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగుల భారీస్కోరు సాధించింది. ముకేశ్‌కు 2 వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో కెప్టెన్‌ వార్నర్‌ (55 బంతుల్లో 7 ఫోర్లతో 65), లలిత్‌ యాదవ్‌ (24 బంతుల్లో 5 ఫోర్లతో 38) మినహా అంతా విఫలమవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 142/9 స్కోరుకే పరిమితమై హ్యాట్రిక్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌల్ట్‌, చాహల్‌ చెరో 3 వికెట్లు, అశ్విన్‌ 2 వికెట్లు తీశాడు. యశస్వీ జైస్వాల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఓపెనర్ల విధ్వంసం: ఓపెనర్లు జైస్వాల్‌, బట్లర్‌ విరుచుకుపడడంతో ఆరంభం నుంచే రాజస్థాన్‌ దూకుడు మొదలైంది. బౌలర్‌ ఖలీల్‌కు చుక్కలు చూపిస్తూ జైస్వాల్‌ వరుసగా 4,4,4,0, 4,4తో తొలి ఓవర్‌లోనే 20 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 63రన్స్‌ చేసింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌.. ఆ తర్వాత ముకేశ్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 98 పరుగుల తొలివికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత సంజూ శాంసన్‌ (0), రియాన్‌ పరాగ్‌ (7) వెంటవెంటనే వెనుదిరిగారు. 32 బంతుల్లో అర్ధసెంచరీ బాదిన బట్లర్‌.. హెట్‌మయెర్‌ (21 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 39 నాటౌట్‌)తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, 49 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీస్తూ బట్లర్‌ను ముకేశ్‌ వెనక్కిపంపాడు. ఆఖర్లో ధ్రువ్‌ జురెల్‌ (8 నాటౌట్‌) జతగా హెట్‌మయెర్‌ ఐదో వికెట్‌కు 9 బంతుల్లోనే 24 రన్స్‌ జోడించి జట్టుకు భారీస్కోరు అందించాడు.

ఢిల్లీ తడ‘బ్యాటు’: చేదనలో ఢిల్లీకి మొదటి ఓవర్‌లోనే డబుల్‌ షాక్‌ తగిలింది. ఇంపాక్ట్‌ ఆటగాడిగా వచ్చిన పృథ్వీ షా (0) డకౌటవగా, ఆ వెంటనే మనీష్‌ పాండే (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తర్వాత రోసో (14) నిరాశపరిచినా.. వార్నర్‌ పట్టుదలగా ఆడాడు. లలిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 64 రన్స్‌ జత చేశారు. 13వ ఓవర్‌లో బౌల్ట్‌ బౌలింగ్‌లో లలిత్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. స్లాగ్‌ ఓవర్ల ముందు అక్షర్‌ పటేల్‌ (2), పావెల్‌ (2) వెనుదిరగగా.. జట్టు స్కోరు 139 ఉన్నప్పుడు చాహల్‌ బౌలింగ్‌లో వార్నర్‌ 8వ వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. నోకియా (0) అవుటైనా, కుల్దీప్‌ (3 నాటౌట్‌), ముకేశ్‌ (1 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా ఇన్నింగ్స్‌ను ముగించారు.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి అండ్‌ బి) ముకేశ్‌ 60, బట్లర్‌ (సి అండ్‌ బి) ముకేశ్‌ 79, సంజూ శాంసన్‌ (సి) నోకియా (బి) కుల్దీప్‌ 0, పరాగ్‌ (బి) పావెల్‌ 7, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 39, ధ్రువ్‌ జురెల్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 199/4; వికెట్ల పతనం: 1-98, 2-103, 3-126, 4-175; బౌలింగ్‌: ఖలీల్‌ 2-0-31-0, నోకియా 4-0-44-0, ముకేశ్‌ 4-0-36-2, అక్షర్‌ 4-0-38-0, కుల్దీప్‌ 4-0-31-1, పావెల్‌ 2-0-18-1.

ఢిల్లీ: పృథ్వీ షా (సి) శాంసన్‌ (బి) బౌల్ట్‌ 0, వార్నర్‌ (ఎల్బీ) చాహల్‌ 65, మనీష్‌ పాండే (ఎల్బీ) బౌల్ట్‌ 0, రోసో (సి) జైస్వాల్‌ (బి) అశ్విన్‌ 14, లలిత్‌ (బి) బౌల్ట్‌ 38, అక్షర్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) చాహల్‌ 2, పావెల్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) అశ్విన్‌ 2, అభిషేక్‌ పొరెల్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) చాహల్‌ 7, కుల్దీప్‌ (నాటౌట్‌) 3, నోకియా (బి) సందీప్‌ 0, ముకేశ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 142/9; వికెట్ల పతనం: 1-0, 2-0, 3-36, 4-100, 5-111, 6-118, 7-138, 8-139, 9-140; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-29-3, సందీప్‌ 4-0-20-1, ఆర్‌. అశ్విన్‌ 4-0-25-2, హోల్డర్‌ 3-0-28-0, చాహల్‌ 4-0-27-3, మురుగన్‌ అశ్విన్‌ 1-0-11-0.

Updated Date - 2023-04-09T01:20:50+05:30 IST