వచ్చేసింది.. టైటాన్స్
ABN , First Publish Date - 2023-05-27T04:00:01+05:30 IST
94, 101, 129.. నరేంద్ర మోదీ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో స్కోర్లివి. తాజా సీజన్‌లో శతకాల మోతతో అదరగొడుతున్న ఈ యువ బ్యాటర్ అద్వితీయ ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు వెళ్లింది.
గిల్ మెరుపు శతకం
ముంబై ఆశలు గల్లంతు
మోహిత్‌కు ఐదు వికెట్లు
ఫైనల్లో చెన్నై X గుజరాత్
అహ్మదాబాద్: 94, 101, 129.. నరేంద్ర మోదీ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో స్కోర్లివి. తాజా సీజన్‌లో శతకాల మోతతో అదరగొడుతున్న ఈ యువ బ్యాటర్ అద్వితీయ ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు వెళ్లింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఈ జట్టు 62 పరుగుల తేడాతో నెగ్గింది. శుభ్‌మన్ గిల్ (60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129) ఇన్నింగ్స్‌లో బౌండరీల రూపంలోనే 111 పరుగులు రావడం విశేషం. ఆదివారం ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో చెన్నైతో గుజరాత్ తలపడనుంది. పేసర్ మోహిత్ శర్మ (2.2-0-10-5) డెత్ ఓవర్లలో దెబ్బతీశాడు. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగుల భారీ స్కోరు సాధించింది. సాయి సుదర్శన్ (43 రిటైర్డ్ అవుట్) రాణించాడు. ఆ తర్వాత ఛేదనలో ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61), తిలక్ వర్మ (14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), గ్రీన్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షమి, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా గిల్ నిలిచాడు. కంటి గాయంతో ఇషాన్ బ్యాటింగ్‌కు దూరం కాగా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విష్ణు వినోద్ బరిలోకి దిగాడు.
వేగంగానే ఆడినా..: రికార్డు ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై వేగంగానే ఆడినా వికెట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. పేసర్ మోహిత్ ఆఖర్లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్, తిలక్ వర్మ మాత్రం తమ దూకుడుతో ఆశలు రేపారు. తొలి ఓవర్‌లోనే ముంబై ఓపెనర్ నేహల్ (4) వికెట్‌ను కోల్పోయింది. ఇక గ్రీన్ రెండో ఓవర్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం, మూడో ఓవర్‌లో రోహిత్ (8) అవుట్ కావడంతో జట్టు పరిస్థితి గందరగోళంగా కనిపించింది. కానీ తిలక్ వర్మ ఐదో ఓవర్‌లో 4,4,4,4,2,6తో 24 రన్స్ రాబట్టడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి తిలక్‌ను రషీద్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తిరిగి క్రీజులోకి వచ్చిన గ్రీన్ ఉన్న కాసేపు బ్యాట్ ఝుళిపించాడు. పదో ఓవర్‌లో సూర్య రెండు, గ్రీన్ ఓ ఫోర్‌తో 15 రన్స్ వచ్చాయి. 12వ ఓవర్‌లో గ్రీన్‌ను లిటిల్ అవుట్ చేయడంతో స్కోరు నెమ్మదించింది. అటు 14వ ఓవర్‌లో సూర్య ఇచ్చిన క్యాచ్‌ను షమి వదిలేయగా.. అదే ఓవర్‌లో 4,6 బాది తను అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికి స్కోరు 14 ఓవర్‌లో 149కి చేరింది. ఈ సమయలో ముంబై విజయం దిశగా సాగుతున్నట్టనిపించింది. కానీ 15వ ఓవర్‌లో మోహిత్ గట్టి ఝలక్ ఇచ్చాడు. మూడు బంతుల వ్యవధిలో ఊపు మీదున్న సూర్యతో పాటు వినోద్ (5)ను అవుట్ చేశాడు. ఇక భారీ హిట్టర్ డేవిడ్ (2)ను మరుసటి ఓవర్‌లోనే రషీద్ ఎల్బీ చేయడంతో ముంబైకి ఆశలు లేకుండా పోయాయి.
శతక బాదుడు: వర్షం కారణంగా ఈ మ్యాచ్ అర్ధగంట ఆలస్యంగా ప్రారంభమైంది. పిచ్ మరీ బ్యాటింగ్‌కు అనుకూలంగా కూడా లేదు. బంతి నేరుగా బ్యాట్‌పైకి రావడం లేదు. ఇదే ఆలోచనతో టాస్ గెలవగానే ముంబై బౌలింగ్‌కు దిగింది. కానీ భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు ఇదేమీ పట్టలేదు. బంతిని బలంగా బాదేస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పేస్, స్పిన్ ఏదైనా అతడి బ్యాట్‌కు బలైంది. దీనికి తోడు ఆరో ఓవర్‌లో అతను 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు టిమ్ డేవిడ్ వదిలేసిన క్యాచ్‌కు ముంబై భారీ మూల్యమే చెల్లించుకుంది. 17వ ఓవర్‌లో చివరికి గిల్ క్యాచ్‌ను అతడే పట్టినప్పటికీ ఈ మధ్యలో జరిగిన విధ్వంసం మామూలుగా లేదు. సాహా (18)తో కలిసి తొలి వికెట్‌కు 54 పరుగులు అందించిన గిల్.. ఆ తర్వాత సాయి సుదర్శన్‌తో రెండో వికెట్‌కు 138 పరుగులు జత చేశాడు. ఆరంభంలో కాస్త నిదానంగానే ఆడినా, 12వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో గిల్ వీరంగం ఆరంభమైంది. తర్వాతి ఓవర్‌లో 6,4,6తో 20 రన్స్ సాధించాడు. 15వ ఓవర్‌లో తొలి బంతికి 49 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసిన గిల్.. అదే ఓవర్‌లో వరుసగా 6,4,6తో చెలరేగాడు. 150 కూడా చేసేటట్టు కనిపించిన గిల్‌ను ఎట్టకేలకు ఆకాశ్ మధ్వల్ 17వ ఓవర్‌లో అవుట్ చేశాడు. అటు చక్కగా సహకరించిన సుదర్శన్ 19వ ఓవర్‌లో రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగగా, ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 నాటౌట్) 4,6.. రషీద్ ఖాన్ (5 నాటౌట్) 4తో టైటాన్స్ 19 రన్స్ సాధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో భారీ స్కోరు చేసిన జట్టుగా గుజరాత్ నిలిచింది.
గుజరాత్ తరఫున ఉత్తమ బౌలింగ్ నమోదు చేసిన మోహిత్ (5/10). అంతేగాకుండా.. ఈ సీజన్ డెత్ ఓవర్లలో ఎక్కువ వికెట్లు (14) తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. పథిరన (16) ముందున్నాడు.
ఈ సీజన్‌లో గిల్‌కిది మూడో సెంచరీ. దీంతో ఒకే సీజన్‌లో ఎక్కువ శతకాలు బాదిన రెండో బ్యాటర్ గిల్. కోహ్లీ (4), బట్లర్ (4) టాప్‌లో ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (129) సాధించిన రెండో భారత బ్యాటర్‌గా గిల్. రాహుల్ (132 నాటౌట్) ముందున్నాడు.
ప్లేఆఫ్స్‌లో అత్యధిక స్కోరు (233) చేసిన జట్టుగా గుజరాత్ టైటాన్స్. అలాగే నాకౌట్‌లో ఎక్కువ స్కోరు సాధించిన అతిపిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. అంతేకాకుండా ప్లేఆఫ్స్‌లో తక్కువ బంతుల్లోనే (49) శతకం బాదిన సాహా, పటీదార్ సరసన చేరాడు.
స్కోరుబోర్డు
గుజరాత్: సాహా (స్టంప్డ్) ఇషాన్ (బి) చావ్లా 18, గిల్ (సి) టిమ్ డేవిడ్ (బి) ఆకాశ్ 129, సాయి సుదర్శన్ (రిటైర్డ్ అవుట్) 43, హార్దిక్ పాండ్యా (నాటౌట్) 28, రషీద్ ఖాన్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 233/3; వికెట్ల పతనం: 1-54, 2-192, 3-214; బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 4-0-28-0, గ్రీన్ 3-0-35-0, ఆకాశ్ మధ్వల్ 4-0-52-1, జోర్డాన్ 4-0-56-0, పీయూష్ చావ్లా 3-0-45-1, కుమార్ కార్తికేయ 2-0-15-0.
ముంబై: రోహిత్ (సి) లిటిల్ (బి) షమి 8, నేహల్ వధేరా (సి) సాహా (బి) షమి 4, గ్రీన్ (బి) లిటిల్ 30, సూర్యకుమార్ (బి) మోహిత్ 61, తిలక్ వర్మ (బి) రషీద్ 43, విష్ణు వినోద్ (సి) హార్దిక్ (బి) మోహిత్ 5, టిమ్ డేవిడ్ (ఎల్బీ) రషీద్ 2, జోర్డాన్ (సి) సుదర్శన్ (బి) మోహిత్ 2, పీయూష్ చావ్లా (సి) మిల్లర్ (బి) మోహిత్ 0, కుమార్ కార్తికేయ (సి) మిల్లర్ (బి) మోహిత్ 6, బెహ్రెన్‌డార్ఫ్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18.2 ఓవర్లలో 171 ఆలౌట్; వికెట్ల పతనం: 1-5, 1-17, 2-21, 3-72, 4-124, 5-155, 6-156, 7-158, 8-161, 9-162, 10-171; బౌలింగ్: షమి 3-0-41-2, హార్దిక్ పాండ్యా 2-0-24-0, రషీద్ ఖాన్ 4-0-33-2, నూర్ అహ్మద్ 4-0-35-0, జోష్ లిటిల్ 3-0-26-1, మోహిత్ శర్మ 2.2-0-10-5.