Gujarat Vs Lucknow: లక్నో బౌలర్లను చితక్కొట్టిన గుజరాత్ బ్యాటర్లు.. లక్నో లక్ష్యం ఎంతంటే...
ABN , First Publish Date - 2023-05-07T17:31:52+05:30 IST
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రెచ్చిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) బౌలర్లలో గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు.
అహ్మదాబాద్: సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రెచ్చిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) బౌలర్లలో గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు పరుగుల వరద పారించారు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ భారీ స్కోర్లు సాధించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్లు ఇద్దరూ తొలి ఓవర్ నుంచే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 8 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులు దాటిందంటే వీరిద్దరూ ఏ రేంజ్‌లో ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఏ దశలోనూ స్కోరు నెమ్మదించలేదు. అయితే ధాటిగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 142 పరుగుల వద్ద వృద్ధి సాహా రూపంలో తొలి వికెట్ పడింది. సాహా కేవలం 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించారు. ఇందులో 4 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (25) రూపంలో 184 పరుగుల వద్ద 2వ వికెట్ పడింది. కాగా ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. 51 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఏకంగా 7 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. చివరిలో డేవిడ్ మిల్లర్ సైతం వేగంగా ఆడాడు. కేవలం 12 బంతుల్లో 21 పరుగులు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు.
కాగా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ల దూకుడుకి లక్నో బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన యశ్ థాకూర్ అత్యధికంగా 48 పరుగులు, 3 ఓవర్లు వేసిన మోసిన్ ఖాన్ 42 పరుగులు, కృనాల్ పాండ్యా 38 పరుగులు చొప్పున ఇచ్చారు. మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ భారీ లక్ష్యాన్ని ఎంతవరకు ఛేదిస్తుందో చూడాలి.