IPL: వచ్చేస్తోంది వేసవి వినోదం
ABN , First Publish Date - 2023-03-28T02:41:34+05:30 IST
టెస్టు, వన్డే, టీ20 సిరీ్‌సలతో పాటు కొత్తగా వచ్చి చేరిన మహిళల ప్రీమియర్ లీగ్ కూడా ముగిసింది. కానీ ఇక్కడితో అయిపోలేదు..క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజాను పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమవుతోంది.

మరో మూడు రోజుల్లో ఐపీఎల్
టెస్టు, వన్డే, టీ20 సిరీ్‌సలతో పాటు కొత్తగా వచ్చి చేరిన మహిళల ప్రీమియర్ లీగ్ కూడా ముగిసింది. కానీ ఇక్కడితో అయిపోలేదు..క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజాను పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమవుతోంది. మండు వేసవిలో ఇంటా, బయటా వేదికల్లో సాగే ధనాధన్ క్రికెట్‌తో దేశంలోని స్టేడియాలన్నీ దద్దరిల్లబోతున్నాయి. ‘మిస్టర్ కూల్’ ధోనీకిదే చివరి సీజన్‌గా భావిస్తున్న తరుణంలో ఈసారి లీగ్ మరింత ప్రత్యేకం కానుంది. ఈ నేపథ్యంలో లీగ్‌లో పోటీపడుతున్న జట్ల పైఓసారి దృష్టి సారిద్దాం.
పంజాబ్ కింగ్స్
తాజా సీజన్‌లో ఈ జట్టు కొత్త కెప్టెన్ శిఖర్ ధవన్ ఆధ్వర్యంలో బరిలోకి దిగబోతోంది. గతేడాది మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌ల్లో ఏడు ఓడి ఏడు గెలిచి ఆరో స్థానంలో నిలిచింది. ఈసారి డాషింగ్ ఓపెనర్ బెయిర్‌స్టో రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది సెప్టెంబరులో కాలి గాయానికి గురైన తను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడి స్థానంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌ను తీసుకుంది. గతేడాది బిగ్‌బాష్ లీగ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవడం సానుకూలాంశం. ఇక రూ.18.50 కోట్ల రికార్డు ధరతో జట్టులోకి వచ్చిన పేసర్ సామ్ కర్రాన్‌పై అందరి దృష్టి ఉండనుంది. అలాగే తమ తొలి మ్యాచ్‌కు స్టార్ పేసర్ రబాడ కూడా దూరం కాబోతున్నాడు.
కీలక ఆటగాళ్లు
శిఖర్ ధవన్ (కెప్టెన్), సామ్ కర్రాన్, అర్ష్‌దీప్, రబాడ, లివింగ్‌స్టోన్, రాజపక్స, సికిందర్ రజా.
రాజస్థాన్ రాయల్స్
ఆరంభ సీజన్ (2008)లో అనూహ్యంగా టైటిల్ సాధించిన రాజస్థాన్ రాయల్స్ గతేడాది ఫైనల్ వరకు చేరింది. ఈసారి ఎలాంటి పొరపాటుకు తావీయకుండా 15 ఏళ్ల తర్వాత మరోసారి విజేతగా నిలవాలని తపిస్తోంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని ఈ జట్టు యువ, సీనియర్ మేళవింపుతో కనిపిస్తుంటుంది. సీనియర్లు అశ్విన్, బట్లర్‌తో పాటు యువ ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్, యశస్వీ జైశ్వాల్ జట్టు విజయాల్లో భాగం పంచుకుంటున్నారు. ఈ సీజన్ కోసం పంజాబ్ జేసన్ హోల్డర్, ఆడమ్ జంపాను తీసుకుంది. అంతేకాకుండా ఏ జట్టూ పరిగణనలోకి తీసుకోని, ఐపీఎల్‌లో ఎలాంటి అనుభవం లేని జో రూట్‌ను సైతం జట్టులో చేర్చుకుంది. గత సీజన్‌లో తమ బ్యాటింగ్ బలంతోనే ఆర్‌ఆర్ దూసుకెళ్లింది. బట్లర్, జైశ్వాల్ రూపంలో అదరగొట్టే ఓపెనర్లుండగా.. శాంసన్ హిట్టింగ్ పవర్ తెలిసిందే. పేసర్ ప్రసిద్ధ్ లీగ్‌కు దూరం కావడం లోటే. బౌల్ట్ మినహా పేస్ విభాగం కూడా బలహీనంగా కనిపిస్తోంది.
కీలక ఆటగాళ్లు
సంజూ శాంసన్ (కెప్టెన్), బట్లర్, యశస్వీ జైశ్వాల్, హెట్‌మయెర్, చాహల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్.
లఖ్‌నవూ
సూపర్ జెయింట్స్
ఈ జట్టుకిది రెండో సీజన్ మాత్రమే. అయితేనేం.. ఆరంభ సీజన్‌లోనే ఎల్‌ఎ్‌సజీ అద్భుత ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. రాహుల్ కెప్టెన్సీలో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచి ఐదు ఓడింది. ప్లేఆ్‌ఫ్సలో ఆర్‌సీబీ చేతిలో పరాజయం పాలైంది. ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శనతో టైటిల్ సాధించాలనే కసితో ఉంది. తమ జాతీయ జట్టు షెడ్యూల్ కారణంగా ఓపెనర్ డికాక్ తొలి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అంతేకాకుండా గత సీజన్‌లో ఆకట్టుకున్న పేసర్ మొహిసిన్ ఖాన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. దీంతో తను మెజారిటీ మ్యాచ్‌ల్లో ఆడేది సందేహమే. అయితే ఈసారి వేలంలో టీమ్‌లోకి వచ్చిన నికోలస్ పూరన్, పేసర్ ఉనాద్కట్ రాణించే అవకాశం ఉంది. అలాగే ఈ టీమ్ దీపక్ హుడా, క్రునాల్ పాండ్యా, గౌతమ్, స్టొయినిస్, షెఫర్డ్, మేయర్స్‌లాంటి ఆల్‌రౌండర్లతో కళకళలాడుతోంది. అయితే రాహుల్ మినహా మరో అనుభవజ్ఞుడైన భారత ఆటగాడు జట్టులో లేడు.
కీలక ఆటగాళ్లు
రాహుల్ (కెప్టెన్), డికాక్, స్టొయినిస్, అవేశ్ ఖాన్, మొహిసిన్ ఖాన్, హుడా, క్రునాల్, పూరన్, రవి బిష్ణోయ్.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)