IPL CSK vs KKR : కోల్‘కథ’ మిగిలే ఉంది
ABN , First Publish Date - 2023-05-15T05:34:40+05:30 IST
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఒక్క విజయంతో అధికారికంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడదామనుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు కాస్త బ్రేక్ పడింది. బ్యాటింగ్‌లో తడబడిన ఈ జట్టు అటు బౌలింగ్‌లోనూ ..

ఆరు వికెట్లతో చెన్నైపై గెలుపు
అదరగొట్టిన స్పిన్నర్లు రింకూ, రాణా అర్ధ సెంచరీలు
చెన్నై: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఒక్క విజయంతో అధికారికంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడదామనుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు కాస్త బ్రేక్ పడింది. బ్యాటింగ్‌లో తడబడిన ఈ జట్టు అటు బౌలింగ్‌లోనూ విఫలం కావడంతో మూల్యం చెల్లించుకుంది. అటు దాదాపుగా ఆశలు అడుగంటిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంది. దీంతో తామింకా రేసులోనే ఉన్నామని చాటుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా 12 పాయింట్లతో ఉన్న ఈ జట్టు మరో మ్యాచ్ గెలిచి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. శివమ్ దూబే (48 నాటౌట్), డెవాన్ కాన్వే (30), జడేజా (20) మాత్రమే రాణించారు. నరైన్, వరుణ్ చక్రవర్తిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసి నెగ్గింది. నితీశ్ రాణా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) హాఫ్ సెంచరీలు సాధించారు. దీపక్ చాహర్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రింకూ సింగ్ నిలిచాడు.
రింకూ, రాణా అండగా..: సీఎస్‌కే బ్యాటర్లు కష్టపడిన చోట రింకూ సింగ్, నితిశ్ రాణా అర్ధసెంచరీలతో చెలరేగారు. అయితే పిచ్ స్లోగా మారడంతో కేకేఆర్‌కు కూడా ఛేదన కష్టమవుతుం దనిపించింది. దీనికి తగ్గట్టుగానే పేసర్ దీపక్ చాహర్ తన వరుస ఓవర్లలో గుర్బాజ్ (1), వెంకటేశ్ అయ్యర్ (9), రాయ్ (12)ల వికెట్లను తీయడంతో పవర్‌ప్లే పూర్తి కాకుండానే జట్టు 33/3 స్కోరుతో నిలిచింది. కానీ ఆ తర్వాత మాత్రం చెన్నైకి నిరాశే మిగిలింది. రాణా, రింకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాణా 18 రన్స్ వద్ద పథిరన క్యాచ్‌ను వదిలేయడం కూడా కలిసివచ్చింది. అటు రింకూ దూకుడుగా ఆడేస్తూ సిక్సర్లతో సత్తా చాటుకున్నాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక 18వ ఓవర్ తొలి బంతికి రింకూ రనౌటైనప్పటికీ అప్పటికి కేకేఆర్ గెలుపు కోసం మరో 13 పరుగుల దూరంలోనే ఉండడంతో చెన్నైకి నిరాశ తప్పలేదు. రాణా ఫోర్‌తో మరో 9 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది.
ఆదుకున్న దూబే: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆరంభం ఆశాజనకంగానే సాగినా మధ్య ఓవర్లలో పరుగులకు ఇబ్బందిపడింది. అలాగే స్పిన్నర్ల ధాటికి టపటపా వికెట్లను కోల్పోయింది. కానీ శివమ్ దూబే–జడేజా జోడీ ఆరో వికెట్‌కు 68 పరుగులు జోడించి ఆదుకుంది. అంతకుముందు ఓపెనర్లు కాన్వే, రుతురాజ్ (17) తొలి వికెట్‌కు 31 పరుగులు జోడించారు. నాలుగో ఓవర్‌లోనే రుతురాజ్‌ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. అటు రహానె (16) వచ్చీ రాగానే 4,6తో ఆకట్టుకున్నా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలో 51 పరుగులు చేసిన సీఎస్‌కే ఆ తర్వాత పిచ్ నెమ్మదించడంతో తడబడింది. దీంతో 8–11 ఓవర్ల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ముందుగా రహానెను వరుణ్ దెబ్బతీయగా.. క్రీజులో చక్కగా కుదురుకున్న కాన్వేను పదో ఓవర్‌లో శార్దూల్ అవుట్ చేశాడు. ఇక ఇటీవలి మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోతున్న స్పిన్నర్ నరైన్ 11వ ఓవర్‌లో చెలరేగి రాయుడు (4), అలీ (1)లను బౌల్డ్ చేయడంతో జట్టు 72/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో దూబే, జడేజా ఆచితూచి ఆడాల్సి వచ్చింది. అయితే 17వ ఓవర్‌లో చెరో సిక్సర్ బాది 16 రన్స్ రాబట్టడంతో జట్టు వంద పరుగులు దాటింది. తర్వాతి ఓవర్‌లోనూ దూబే సిక్సర్‌తో 15 రన్స్ వచ్చాయి. కానీ 19వ ఓవర్‌లో మాత్రం శార్దూల్ ఐదు పరుగులు.. ఆఖరి ఓవర్‌లో ఆకాశ్ 9 రన్స్ ఇచ్చి జడేజా వికెట్ తీయడంతో సీఎస్‌కే 150లోపే పరిమితమైంది.
స్కోరుబోర్డు
చెన్నైసూపర్‌కింగ్స్: రుతురాజ్ (సి) వైభవ్ (బి) వరుణ్ 17, కాన్వే (సి) రింకూ (బి) శార్దూల్ 30, రహానె (సి) రాయ్ (బి) వరుణ్ 16, రాయుడు (బి) నరైన్ 4, దూబె (నాటౌట్) 48, మొయిన్ (బి) నరైన్ 1, జడేజా (సి) వరుణ్ (బి) వైభవ్ 20, ధోనీ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 144/6; వికెట్ల పతనం: 1–31, 2–61, 3–66, 4–68, 5–72, 6–140; బౌలింగ్: వైభవ్ 4–0–30–1, హర్షిత్ 2–0–19–0, వరుణ్ 4–0–36–2, నరైన్ 4–0–15–2, శార్దూల్ 3–0–15–1, సుయాశ్ 3–0–29–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్: రాయ్ (సి) పథిరన (బి) చాహర్ 12, గుర్బాజ్ (సి) దేశ్‌పాండే (బి) చాహర్ 1, వెంకటేశ్ (సి) జడేజా (బి) చాహర్ 9, నితీశ్ (నాటౌట్) 57, రింకూ (రనౌట్) 54, రస్సెల్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 18.3 ఓవర్లలో 147/4; వికెట్ల పతనం: 1–4, 2–21, 3–33, 4–132; బౌలింగ్: దీపక్ 3–0–27–3, తుషార్ 3.3–0–25–0, మొయిన్ 4–0–31–0, తీక్షణ 3–0–22–0, పథిరన 3–0–23–0, జడేజా 2–0–18–0.