Share News

WC Champion Australia : కలలు కల్లలై..

ABN , First Publish Date - 2023-11-20T01:19:23+05:30 IST

అంచనాలు తలకిందులయ్యాయి. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. పదికి పది విజయాలతో దూసుకెళ్లిన టీమిండియాను ఆదివారం జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా అడ్డుకుంది. పక్కా ప్రణాళికతో, ప్రశాంత చిత్తంతో

WC Champion Australia : కలలు కల్లలై..
విశ్వ విజేత ఆస్ట్రేలియా

  • ఫైనల్లో ఓడిన భారత్‌

  • విశ్వ విజేత ఆస్ట్రేలియా

  • ట్రావిస్‌ హెడ్‌ సూపర్‌ సెంచరీ

విజేత ఆస్ట్రేలియాకు - రూ. 33.29 కోట్లు

రన్నరప్‌ భారత్‌కు - రూ. 16.64 కోట్లు

సెమీస్‌లో ఓడిన జట్టుకు - రూ. 6.65 కోట్లు

గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన జట్టుకు - రూ. 83.22 లక్షలు

వన్డే వరల్డ్‌కప్‌ ఏమిటీ పరిస్థితి. మునుపెన్నడూ చూడని అప్రతిహత విజయాలు.. బ్యాటర్ల అసాధారణ ప్రదర్శన.. బౌలింగ్‌ దళం నుంచి వికెట్ల జాతరే.. పైగా పదికి పది విజయాలతో ఇక మనకు ఎదురేముందిలే.. అనుకున్న వేళ.. జీవితకాల అవకాశం కళ్లముందే ఉండగా.. ఆఖరి పోరాటంలో టీమిండియా అయ్యో అనిపించింది. మన పదునెక్కిన బ్యాట్లు గర్జించలేదు.. పేసర్ల బుల్ల్లెట్‌లాంటి బంతులు గురి తప్పాయి.. స్పిన్నర్ల ఊసే లేదు. ఫలితంగా.. ఆరు నూరైనా ఈసారి కప్‌ మనదే అనే నమ్మకంతో ఉన్న కోట్లాది భారతీయులహృదయాలు తీవ్ర ఆవేదనతో బరువెక్కాయి. దీంతో రోహిత్‌ బాదేస్తుంటే చప్పట్లు కొట్టిన చేతులతోనే.. తర్వాత ఆసీస్‌ బౌలర్ల దాడికి ముఖాలను కప్పేసుకోవాల్సి వచ్చింది.

ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ అనుకున్నది సాధించాడు.. తమ ప్రదర్శనతోప్రపంచలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో నిశ్శబ్దాన్ని సృష్టిస్తామని దీమాగా చెప్పిన వ్యాఖ్యలను తన సైన్యంతో నిజం చేశాడు. అద్భుత బౌలింగ్‌.. అద్వితీయ ఫీల్డింగ్‌.. నిలకడైన బ్యాటింగ్‌ వనరులను వాడుకొని ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ మన విజయానికి అడ్డుగా నిలిచిన ట్రావిస్‌ హెడ్‌ ఇక్కడా అదే ఆటను పునరావృతం చేశాడు. కష్టతరమైన పిచ్‌పై అసాధారణ పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా నాకౌట్‌ మ్యాచుల్లో తమను మించినోళ్లు లేరనే సత్యాన్ని కంగారూలు మరోసారి నిరూపించారు.

అహ్మదాబాద్‌: అంచనాలు తలకిందులయ్యాయి. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. పదికి పది విజయాలతో దూసుకెళ్లిన టీమిండియాను ఆదివారం జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా అడ్డుకుంది. పక్కా ప్రణాళికతో, ప్రశాంత చిత్తంతో బరిలోకి దిగిన ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ చెలరేగింది. తద్వారా 6 వికెట్లతో నెగ్గి వన్డే వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆసీస్‌ కెరీర్‌లో ఇది ఆరో టైటిల్‌ కావడం విశేషం. గాయంతో తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమైన ట్రావిస్‌ హెడ్‌ (120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137) ఈ విజయానికి కారణమయ్యాడు. అతడికి లబుషేన్‌ (110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్‌) సహకరించడంతో మూడో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ (66), విరాట్‌ (54), రోహిత్‌ (47) మాత్రమే రాణించారు. స్టార్క్‌కు మూడు.. కమిన్స్‌, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి గెలిచింది. బుమ్రాకు 2 వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హెడ్‌ నిలిచాడు.

పవర్‌ప్లే ఇద్దరిదీ..: స్వల్ప ఛేదనను కాపాడుకునేందుకు భారత బౌలింగ్‌ దళం నుంచి ఆరంభంలో అద్భుత పోరాటమే కనిపించింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి చక్కగా స్వింగ్‌ కావడంతో పేసర్లు బుమ్రా, షమి తొలిసారి కొత్త బంతిని పంచుకుని ఆసీ్‌సను వణికించారు. అయితే తొలి ఓవర్‌లో మాత్రం బుమ్రా ఏకంగా 15 పరుగులిచ్చుకున్నాడు. ఇన్నింగ్స్‌ మొదటి బంతికే వార్నర్‌ (7) అవుట్‌ కావాల్సింది. బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతిని స్లిప్‌లో ఉన్న కోహ్లీ, గిల్‌ మధ్యలో నుంచి వెళ్లినా ఇద్దరూ అలా చూస్తుండిపోవడంతో అది ఫోర్‌గా వెళ్లింది. హెడ్‌ మరో రెండు ఫోర్లు బాదాడు. ఇక కొత్త బంతిని సిరాజ్‌కు కాకుండా షమి చేతికివ్వడంతో ఫలితం వచ్చింది. తన తొలి బంతికే వార్నర్‌ను అవుట్‌ చేశాడు. అటు బుమ్రా పుంజుకుని పరుగులను కట్టడి చేయడంతో పాటు మార్ష్‌ (15), స్మిత్‌ (4) వికెట్లను తీయడంతో మొతేరా మోతెక్కింది. అప్పటికి స్కోరు 47/3. అయితే స్మిత్‌ తన ఎల్బీ నిర్ణయంపై రివ్యూకు వెళితే బతికిపోయేవాడు. బంతి అవుట్‌సైడ్‌ ద ఆఫ్‌ స్టంప్‌గా వెళుతున్నట్టు రీప్లేలో కనిపించింది. ఇక పదో ఓవర్‌లో ఓపెనర్‌ హెడ్‌ రెండు ఫోర్లు బాది పవర్‌ప్లేలో స్కోరును 60 పరుగులకు చేర్చాడు.

travis-head-(7).jpg

హెడ్‌ షో..: పవర్‌ప్లే ముగిశాక పరిస్థితులను ఆసీస్‌ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. హెడ్‌కు జత కలిసిన లబుషేన్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడలేదు. పిచ్‌ కూడా ఆశించిన రీతిలో టర్న్‌ కాలేదు. దీంతో వికెట్‌ కోసం బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. అటు స్పిన్నర్‌ కుల్దీప్‌ ఓవర్‌లో హెడ్‌ స్లాగ్‌స్వీ్‌ప ద్వారా భారీ సిక్సర్‌తో ఆధిపత్యానికి తెర తీశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో ఇద్దరూ చకచకా స్కోరును పెంచసాగారు. లబుషేన్‌ డిఫెన్సివ్‌ ఆటతో హెడ్‌కు చక్కగా సహకరించాడు. 58 బంతుల్లో హెడ్‌ అర్ధసెంచరీని పూర్తి చేశాడు. షమి ఓవర్‌లోనూ ఇద్దరూ ఫోర్లు రాబట్టడంతో బౌలర్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. బుమ్రా బంతి చేతపట్టినా హెడ్‌ మూడు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 28వ ఓవర్‌లో లబుషేన్‌ ఎల్బీని అంపైర్‌ నిరాకరించగా.. భారత్‌ రివ్యూకు వెళ్లింది. రీప్లేలో బంతి వికెట్‌ తాకినట్టు తేలినా అంపైర్‌ కాల్‌తో బతికిపోయాడు. కుల్దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌లో హెడ్‌ రెండు వరుస ఫోర్లతో 95 బంతుల్లోనే శతకం బాదేశాడు. సమన్వయ ఆటతీరుతో ఈ ఇద్దరూ బౌలర్లనే కాదు చూస్తున్న ప్రేక్షకులను సైతం చేష్టలుడిగిపోయేలా చేశారు. అటు లబుషేన్‌ కూడా అర్ధసెంచరీ పూర్తి చేయగా.. మరో 2 పరుగుల దూరంలో హెడ్‌ అవుటయ్యాడు. కానీ మ్యాక్స్‌వెల్‌ (2 నాటౌట్‌) విన్నింగ్‌ షాట్‌తో 42 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

భారత్‌ తడ‘బ్యాటు’: భారత్‌ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకోవాలని ఫైనల్‌ మ్యాచ్‌కు ముందే అంతా అంచనా వేశారు. అయితే టాస్‌ ఓడినా బ్యాటింగ్‌ మనోళ్లకే వచ్చింది. దీంతో స్టేడియంలో జోష్‌ కనిపించింది. ఇంకేముంది భారీ స్కోరుతో ఆసీ్‌సకు ముకుతాడు వేసేసినట్టేననిపించింది. అయితే స్లో ట్రాక్‌పై ఆసీస్‌ బౌలర్లు కట్టర్స్‌, షార్ట్‌ బంతులతో చెలరేగారు. పేసర్లు రివర్స్‌ స్వింగ్‌ సైతం రాబట్టారు. అటు ఫీల్డింగ్‌ కూడా టాప్‌ క్లాస్‌తో కనిపించింది. అసలు మైదానంలో 20 మంది ఫీల్డర్లున్నారా? అని అనిపించింది. కానీ హిట్‌మ్యాన్‌ అవుటయ్యాక పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయింది. 11 నుంచి 50 ఓవర్ల మధ్య కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే వచ్చాయంటే ఆసీస్‌ బౌలింగ్‌కు భారత బ్యాటింగ్‌ ఎలా దాసోహమైందో తెలుస్తోంది.

రోహిత్‌ మెరుపుల్‌: ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ క్రీజులోకి రాగా.. మనోళ్ల ఆరంభం అదుర్స్‌.. ముగింపు మాత్రం బెదుర్స్‌గా అనిపించింది. ఆసీ్‌సతో లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ డకౌటైనప్పటికీ.. ఈ కీలక మ్యాచ్‌లో బ్యాట్‌ ఝుళిపించాడు. హాజెల్‌వుడ్‌ను లక్ష్యంగా చేసుకుని అతడి తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో 6,4తో ఆధిపత్యం చూపాడు. కానీ గిల్‌ (4)ను ఐదో ఓవర్‌లోనే స్టార్క్‌ అవుట్‌ చేశాడు. వచ్చీ రాగానే విరాట్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో మొతేరాను మోతెక్కించాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో 6,4తో రోహిత్‌ అదుర్స్‌ అనిపించాడు. అదే ఓవర్‌లో రోహిత్‌ ఆడిన షాట్‌ను కవర్‌ పాయింట్‌ నుంచి వెనక్కి పరిగెత్తుతూ హెడ్‌ తీసుకున్న సూపర్‌ క్యాచ్‌తో స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. అయితే పవర్‌ప్లే ముగిసేసరికి అతడి బాదుడు కారణంగా జట్టు 80 పరుగులు సాధించడం విశేషం. అలాగే రెండో వికెట్‌కు ఈ జోడీ 32 బంతుల్లో 46 పరుగులు జత చేసింది. ఇక తర్వాతి ఓవర్‌లోనే కమిన్స్‌ మరో షాక్‌ ఇస్తూ శ్రేయాస్‌(4)ను అవుట్‌ చేయడంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది.

విరాట్‌-రాహుల్‌ జోడీ నిలకడ: ఆసీ్‌సతో తొలి మ్యాచ్‌లో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. ఆదుకుంది విరాట్‌-రాహుల్‌ జోడీనే. ఈసారి కూడా క్లిష్ట పరిస్థితిలో జత కలిసిన వీరు ఎప్పటిలానే క్రీజులో పాతుకుపోయారు. కమిన్స్‌, జంపా ధాటికి 11వ ఓవర్‌ నుంచి 97 బంతులపాటు జట్టుకు ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. అయితే కోహ్లీ మాత్రం 56 బంతుల్లో వరుసగా ఐదో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. చివరికి 27వ ఓవర్‌లో రెండో బంతిని రాహుల్‌ ఫోర్‌గా మలిచి అభిమానుల్లో కాస్త కదిలిక తెచ్చాడు. ఓవైపు మ్యాచ్‌ నిస్సారంగా సాగుతూ ప్రేక్షకులు అసహనంగా ఉన్న తరుణంలో 29వ ఓవర్‌లో విరాట్‌ను కమిన్స్‌ బౌల్ట్‌ చేయడంతో వారు షాక్‌కు గురయ్యారు. మూడో వికెట్‌కు 67 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. అటు రాహుల్‌ను 42వ ఓవర్లో స్టార్క్‌ అవుట్‌చేయడంతో 203/6తో జట్టు కష్టాల్లో పడింది.

తేలిపోయిన సూర్య: గాయపడిన హార్దిక్‌ స్థానంలో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌ కనీసం ఫైనల్లోనైనా మెరుపులు మెరిపిస్తాడని అంతా ఆశించినా అంత సీన్‌ కనిపించలేదు. టీ20 ఫార్మాట్‌లో పిచ్‌ ఎలాంటిదైనా విజృంభించే తను.. ఇక్కడ మాత్రం వెనుకడుగు వేశాడు. ఓవైపు టెయిలెండర్లు షమి (6), బుమ్రా (1) వరుసగా పెవిలియన్‌కు చేరినా తన బ్యాట్‌లో పదును కనిపించలేదు. ఓవర్లు కరుగుతున్నా హిట్టింగ్‌కు ప్రయత్నించని సూర్య 48వ ఓవర్‌లో కీపర్‌ ఇన్‌గ్లిస్కు క్యాచ్‌ ఇచ్చాడు. హాజెల్‌వుడ్‌కు ఈ వికెట్‌ దక్కడంతో భారత్‌కు స్వల్ప స్కోరు ఖాయమైంది. చివరి ఓవర్‌లో 8 పరుగులు రాగా ఆఖరి బంతికి కుల్దీప్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

modi-trophy2.jpg

నాకౌట్‌ వీరుడుఫైనల్లో భారత్‌ను దెబ్బతీసిన ట్రావిస్‌ హెడ్‌ ఈ వరల్డ్‌క్‌పలో మొత్తం ఆరు మ్యాచ్‌లాడాడు. తొలుత న్యూజిలాండ్‌పై శతకం (109) బాదాడు. దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో 62, భారత్‌పై ఫైనల్లో 137 పరుగులతో జట్టును గెలిపించాడు.

ఈ వరల్డ్‌క్‌పలో భారత్‌ ఆలౌటవడం ఇదే తొలిసారి.ఒకే జట్టు (ఆసీ్‌సపై 86)పై ఎక్కువ సిక్సర్లు బాదిన

బ్యాటర్‌గా రోహిత్‌. వరల్డ్‌క్‌పలో ఎక్కువ వికెట్లు (23) తీసిన స్పిన్నర్‌ జాబితాలో ఆడమ్‌ జంపా. 2007లో మురళీధరన్‌ ఇన్నే వికెట్లు తీశాడు.వరల్డ్‌క్‌పలో వరుసగా రెండుసార్లు 5 అర్ధసెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ (2019, 2023లో). స్మిత్‌ (2015) ఓసారి సాధించాడు.

ఓ క్యాలెండర్‌ ఏడాది (2023)లో వన్డేల్లో ఎక్కువ పరుగుల భాగస్వామ్యం (1523) నెలకొల్పిన రెండో జోడీగా రోహిత్‌-గిల్‌. సచిన్‌-గంగూలీ (1998లో 1635) ముందున్నారు.

ఓ వరల్డ్‌క్‌పలో ఎక్కువ పరుగులు (3038) సాధించిన బ్యాటర్లలో భారత్‌ది రెండోస్థానం. 2019 టోర్నీలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు 3059 రన్స్‌ చేశారు.

వరల్డ్‌కప్‌ సెమీస్‌, ఫైనల్లో 50+ స్కోర్లు సాధించిన ఏడో బ్యాటర్‌గా కోహ్లీ. గతంలో బ్రియర్లీ (1979), డేవిడ్‌ బూన్‌ (1987), మియాందాద్‌ (1992), అరవింద డిసిల్వ (1996), గ్రాంట్‌ ఎలియట్‌ (2015), స్మిత్‌ (2015) ఉన్నారు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో సెంచరీ బాదిన ఏడో బ్యాటర్‌గా హెడ్‌. అలాగే ఛేజింగ్‌లో డిసిల్వ తర్వాత రెండో బ్యాటర్‌.

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) హెడ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 47, గిల్‌ (సి) జంపా (బి) స్టార్క్‌ 4, కోహ్లీ (బి) కమిన్స్‌ 54, అయ్యర్‌ (సి) ఇన్‌గ్లిస్(బి) కమిన్స్‌ 4, రాహుల్‌ (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్‌ 66, జడేజా (సి) ఇన్‌గ్లిస్ (బి) హాజెల్‌వుడ్‌ 9, సూర్యకుమార్‌ (సి) ఇన్‌గ్లిస్ (బి) హాజెల్‌వుడ్‌ 18, షమి (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్‌ 6, బుమ్రా (ఎల్బీ) జంపా 1, కుల్దీప్‌ (రనౌట్‌/లబుషేన్‌) 10, సిరాజ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 50 ఓవర్లలో 240 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-30, 2-76, 3-81, 4-148, 5-178, 6-203, 7-211, 8-214, 9-226; బౌలింగ్‌: స్టార్క్‌ 10-0-55-3, హాజెల్‌వుడ్‌ 10-0-60-2, మ్యాక్స్‌వెల్‌ 6-0-35-1, కమిన్స్‌ 10-0-34-2, జంపా 10-0-44-1, మార్ష్‌ 2-0-5-0, హెడ్‌ 2-0-4-0.

ఆస్ట్రేలియా: వార్నర్‌ (సి) కోహ్లీ (బి) షమి 7, హెడ్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 137, మార్ష్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 15, స్మిత్‌ (ఎల్బీ) బుమ్రా 4, లబుషేన్‌ (నాటౌట్‌) 58, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు:18; మొత్తం: 43 ఓవర్లలో 241/4; వికెట్ల పతనం: 1-16, 2-41, 3-47, 4-239; బౌలింగ్‌: బుమ్రా 9-2-43-2, షమి 7-1-47-1, జడేజా 10-0-43-0, కుల్దీప్‌ 10-0-56-0, సిరాజ్‌ 7-0-45-1.

టాస్‌ గెలిచినా బ్యాటింగ్‌

ఎందుకు తీసుకోలేదు..?టాస్‌ గెలిచిన ఆస్ర్టేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కమిన్స్‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని కొందరన్నారు.అయితే తాను టాస్‌ గెలిచివుంటే బ్యాటింగే ఎంచుకునివుండేవాడినని రోహిత్‌ శర్మ చెప్పాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసి భారీస్కోరు చేద్దామని రోహిత్‌ అనుకునివుంటాడు. అయితే రాత్రివేళలో మంచు ప్రభావం ఉంటుందని, అందుకే బౌలింగ్‌ తీసుకున్నానని కమిన్స్‌ చెప్పుకొచ్చాడు.

మంచు ప్రభావం అంటే...: రాత్రివేళల్లో గ్రౌండ్‌లోని పచ్చికపై పడిన మంచు వల్ల బంతి తడిగా మారుతుంది. దీనివల్ల బౌలర్లకు గ్రిప్‌ దొరకక, బౌలింగ్‌ లయ తప్పుతుంది. బంతి చేతుల్లోనుంచి జారిపోవడంవల్ల లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అలాగే ఫీల్డర్లు కూడా క్యాచ్‌లు సరిగా పట్టలేకపోవడం, త్రో సరిగా వేయలేకపోవడం జరుగుతుంది. మొత్తంగా ఈ డ్యూ ఫ్యాక్టర్‌ బ్యాటర్లకే అనుకూలంగా ఉంటుంది.

5.9 కోట్లతో రికార్డు

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ను అభిమానులు ఎగబడి చూశారు. ప్రత్యక్ష ప్రసారదారు డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను రికార్డుస్థాయిలో 5.9 కోట్ల మంది వీక్షించారు. ఈ క్రమంలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ రికార్డు (5.2 కోట్లు)ను ఫైనల్‌ పోరు అధిగమించింది. ఇక, లీగ్‌ దశలో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను 3.5 కోట్ల మంది వీక్షించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రపంచకప్‌ రికార్డులు

అత్యధిక వ్యక్తిగత స్కోరు - 201 (నాటౌట్‌), మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)

అత్యధిక పరుగులు - 765, కోహ్లీ (భారత్‌)

అత్యధిక వికెట్లు - 24, షమి (భారత్‌)

జట్టు అత్యధిక స్కోరు - 428/5 (దక్షిణాఫ్రికా)

జట్టు అత్యల్ప స్కోరు - 55 ఆలౌట్‌ (శ్రీలంక)

మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు - 771 (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మ్యాచ్‌)

అత్యుత్తమ బౌలింగ్‌ - 7/57 (షమి)

అత్యధిక సెంచరీలు - 4 (డికాక్‌)

ఫాస్టెస్ట్‌ సెంచరీ - 40 బంతుల్లో (మ్యాక్స్‌వెల్‌)

అత్యధిక సిక్సర్లు - 31 (రోహిత్‌)

అత్యధిక ఫోర్లు - 68 (కోహ్లీ)

అపురూపం..

ఆ విన్యాసంమెగా ఫైనల్‌ను తిలకించేందుకు వచ్చిన లక్షమందికిపైగా అభిమానులను ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ విమానాల బృందం ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. తొమ్మిది ‘హాక్‌ ఎంకే 132 స్కాట్‌’ విమానాలు ఆకాశంలో రివ్వున దూసుకుపోయిన దృశ్యాలు ఫ్యాన్స్‌లో ఉత్కంఠ, ఉద్వేగాలు కలిగించాయి. ఓ క్రికెట్‌ మ్యాచ్‌కు ముందు ఎయిర్‌ఫోర్స్‌ విమానాల ప్రదర్శన ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని 52వ స్క్వాడ్రన్‌కు చెందిన పైలెట్లు 10 నిమిషాలపాటు ప్రదర్శించిన విన్యాసాలు ఫైనల్‌కే హైలైట్‌గా నిలిచాయి.

pitch-invader-(1).jpg

‘పాలస్తీనా’ కలకలం

ప్రపంచకప్‌ ఫైనల్లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. స్టాండ్స్‌లో నుంచి ఓ వ్యక్తి అనూహ్యంగా మైదానంలోకి దూసుకొచ్చి టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లీని ఆలింగనం చేసుకోవడం కలకలం సృష్టించింది. భారత ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా దేశ జెండా రంగున్న మాస్క్‌ను ధరించి మైదానంలోకి చొరబడ్డాడు. అతను వేసుకున్న టీషర్ట్‌ ముందు భాగంలో బాంబింగ్‌ పాలస్తీనా, ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బయటకు పంపేశారు.

sachin--kohli.jpg

విరాట్‌కు సచిన్‌ గిఫ్ట్‌

వన్డేలలో తన అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించిన విరాట్‌ కోహ్లీకి సచిన్‌ టెండూల్కర్‌ ఊహించని కానుక ఇచ్చాడు. ఆదివారం టీమిండియా వామప్‌ సందర్భంగా మైదానంలోకి వచ్చిన సచిన్‌..2012లో మిర్పూర్‌లో పాకిస్థాన్‌పై ఆసియా కప్‌ ఆడిన తన చివరి వన్డే మ్యాచ్‌లో ధరించిన 10వ నెం.జెర్సీని విరాట్‌కు అందజేశాడు. ‘నేను గర్వించేలా చేశావు’ అని జెర్సీ మీద రాయడంతోపాటు సంతకం కూడా చేశాడు.

నాకు ఆహ్వానం లేదు: కపిల్‌

అహ్మదాబాద్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్‌కు తనకు ఆహ్వానం అందలేదని 1983టీమిండియా కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ వెల్లడించాడు. ఆహ్వానం వస్తే..అహ్మదాబాద్‌ వెళదామనుకున్నానని తెలిపాడు. ‘వారు నన్ను పిలవలేదు. అందుకే ఫైనల్‌ మ్యాచ్‌కు వెళ్లలేదు. నిర్వాహకులు తీరికలేకుండా ఉండడంవల్ల నన్ను మరిచిపోయి ఉంటారేమో’ అని కపిల్‌ అన్నాడు. మరో మాజీ కెప్టెన్‌ గంగూలీకి మాత్రం బీసీసీఐ మాజీ చీఫ్‌గా ఫైనల్‌కు ఆహ్వానం అందినట్టు తెలిసింది.

Updated Date - 2023-11-20T01:19:24+05:30 IST

News Hub