Share News

గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:03 AM

సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు.

గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల

  • మీడియాతో మాట్లాడకుండా కారులో పయనం

గుంటూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పలకరించారు. జైలు వద్దకు పోసాని కుటుంబ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నాయకులు, ఆయన తరపు న్యాయవాదులు వచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితరులపై పోసాని గతంలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఫిర్యాదులు చేయడంతో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 15కి పైగా కేసులు నమోదయ్యాయి. 2025 ఫిబ్రవరి 26న కర్నూలు జిల్లా పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి తీసుకువచ్చారు. ఆ తరువాత వివిధ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లపై సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తూ వచ్చారు. అయితే ఆయా కేసుల్లో 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ఆయనకు జైలునుంచి విముక్తి లభించింది. గతనెల 26న అరెస్టయిన పోసాని దాదాపు నెల రోజులు రిమాండ్‌లో ఉన్నారు.


సీఐడీ నమోదు చేసిన కేసులో పోసానికి శుక్రవారం గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పూచీకత్తు సమర్పించడం ఆలస్యం కావడంతో విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. కోర్టు షరతుల నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడకుండా కారులో వెళ్లిపోయారు.

Updated Date - Mar 23 , 2025 | 04:04 AM