Women’s IPL: మహిళా ఐపీఎల్‌తో బీసీసీఐకి రూ. 4 వేల కోట్లు!

ABN , First Publish Date - 2023-01-23T18:24:30+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఖ్యాతికెక్కిన బీసీసీఐ (BCCI) మరింత సు‘సంపన్నం’ కానుంది. మహిళా ఐపీఎల్(WIPL

 Women’s IPL: మహిళా ఐపీఎల్‌తో బీసీసీఐకి రూ. 4 వేల కోట్లు!

ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఖ్యాతికెక్కిన బీసీసీఐ (BCCI) మరింత సు‘సంపన్నం’ కానుంది. మహిళా ఐపీఎల్(WIPL) జట్ల వేలం ద్వారా మరో రూ. 4 వేల కోట్లు ఆర్జించనుంది. బుధవారం వేలం జరగనుండగా, ఒక్కో జట్టుకు రూ.500 నుంచి రూ. 600 కోట్లు పలికే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా 10 పురుషుల ఐపీఎల్ జట్లు సహా రూ. 5 లక్షల విలువైన బిడ్ పత్రాలను 30కిపైగా కంపెనీలు కొనుగోలు చేశాయి. అయితే, ఇవన్నీ పోటీలో ఉండడం లేదు. ఎందుకంటే జట్లను కొనుగోలు చేసే కంపెనీల నికర విలువ రూ. 1000 కోట్లు ఉండాలి. కాబట్టి కొన్ని కంపెనీలు పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.

బిడ్ పత్రాలు కొనుగోలు చేసిన కంపెనీల్లో అదానీ గ్రూప్, టోరెంట్ గ్రూప్, హల్దీరామ్‌కు చెందిన ప్రభుజీ, కాప్రి గ్లోబల్, కోటక్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఫ్రాంచైజీలుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రెండు కొత్త పురుషుల ఐపీఎల్(IPL) జట్ల కోసం గతంలో బీసీసీఐ బిడ్లు ఆహ్వానించిప్పుడు వీటిలో కొన్ని కంపెనీలు ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈసారి పట్టుదలగా ఉన్నాయి. కాగా, ముంబై ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్(RR), ఢిల్లీ కేపిటల్స్(DC), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్ల యాజమాన్యాలు కూడా మహిళా జట్లపై ఆసక్తి చూపుతున్నాయి.

ఫ్రాంచైజీలకు ఏంటి లాభం?

ఐపీఎల్ మీడియా బ్రాడ్‌కాస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంచుతుంది. అలాగే స్పాన్సర్‌షిప్ షేర్ కూడా లభిస్తుంది. వీటితోపాటు ఫ్రాంచైజీకి సొంత స్పాన్సర్స్ ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది. టికెట్ల అమ్మకం ద్వారా ఫ్రాంచైజీలకు మరికొంత ఆదాయం సమకూరుతుంది.

జియో చేతికి మీడియా హక్కులు

మహిళా ఐపీఎల్ మీడియా హక్కులను రిలయన్స్ జియో దక్కించుకుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి గాను దాదాపు రూ.950 కోట్లకు హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఏడాదికి దాదాపు రూ. 190 కోట్లు. ఇందులో 80 శాతం అంటే రూ. 152 కోట్లను మహిళా జట్లకు చెల్లించడం ద్వారా జట్ల అభివృద్ధికి బీసీసీఐ కృషి చేస్తుంది. అలాగే, విజేత జట్టుకు రూ. 28.08 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ. 27.20 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 25.45 కోట్లను బీసీసీఐ చెల్లిస్తుంది. చివరన నిలిచిన రెండు జట్లకు రూ. 24.57 కోట్లు చొప్పున లభిస్తాయి.

మహిళా ఐపీఎల్ ఎప్పుడంటే?

మహిళా ఐపీఎల్ తొలి సీజన్ ఈ ఏడాది మార్చి 4 నుంచి ప్రారంభం అవుతుంది. మహిళా ఐపీఎల్‌లో మొత్తం 5 జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జట్ల పేర్లను వెల్లడిస్తారు. ఫిబ్రవరిలో ప్లేయర్ల వేలం ఉంటుంది. ఈ నెల 26 వరకు ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Updated Date - 2023-01-23T18:24:32+05:30 IST