Reliance Jio: రిలయన్స్ జియో గుడ్‌న్యూస్!.. త్వరలోనే వైర్లు లేకుండానే...
ABN , First Publish Date - 2023-04-25T17:51:30+05:30 IST
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) త్వరలోనే మరో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) త్వరలోనే మరో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. గతేడాది రిలయన్స్ 45వ సర్వసాధారణ వార్షిక భేటీలో (ఏజీఎం) ప్రకటించిన జియో ఎయిర్‌ఫైబర్‌ను (Jio AirFiber) త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. నెలల వ్యవధిలోనే దీనిని ఆవిష్కరించే అవకాశాలున్నాయని ‘ది ఎకనామిక్ టైమ్స్’ తాజా రిపోర్ట్ పేర్కొంది. ‘‘కనెక్టెడ్ హోమ్స్ స్ట్రాటజీ’’ వ్యూహానికి ఎయిర్‌ఫైబర్ దోహదపడుతుందని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ (Kiran Thomas) పేర్కొన్నట్టు రిపోర్ట్ ప్రస్తావించింది. జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులోకి వస్తే మార్కెట్‌లో ఇప్పటికే వైఫై (Wi-Fi) సర్వీసులు అందిస్తున్న ప్రధాన కంపెనీలైన ఎయిర్‌టెల్ (Airtel), బీఎస్‌ఎన్ఎల్ (BSNL), యాక్ట్(Act) లకు పోటీనివ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
జియోఫైబర్ ఎలా పనిచేస్తుందంటే...
ఇంటి వద్ద ఎక్కువ వైర్లతో (Wires) పనిలేకుండానే జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా నిరంతరాయ 5జీ ఇంటర్నెట్ సౌకర్యం పొందొచ్చు. యూజర్లు సింపుల్‌గా డివైజ్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ పరికరం మోడర్న్ మెశ్ హైబ్రీడ్‌లా(hybrid of modern mesh) కనిపిస్తుంది. రూటర్ (routers) వైట్ కలర్‌లో ఉంటుంది. ఈ డివైజ్ ఇంటి వద్ద 5జీ హాట్‌స్పాట్‌గా పనిచేస్తుంది. పోర్టబుల్ రూటర్స్ కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ సాయంతో యూజర్లు ఇంటి వద్ద చాలా ఈజీగా, వేగంగా గిగా స్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వొచ్చని జియో గతేడాది వెల్లడించింది. రిలయన్స్ ఏజీఎంలో జియో ఎయిర్‌ఫైబర్‌ను కూడా ప్రదర్శించిన విషయం తెలిసిందే.
యాప్‌తో నియంత్రించవచ్చు..
జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈజీగా యాప్‌తో కూడా నియంత్రించవచ్చు. అంతేకాకుండా పేరెంటల్ కంట్రోల్‌ను (parental control) యాడ్ చేయవచ్చు. అంటే తమ పిల్లలు ఏవైనా వెబ్‌సైట్లు లేదా డివైజ్‌లు ఉపయోగించకూడదనుకుంటే వాటిని తల్లిదండ్రులు బ్లాక్ చేసే వీలుంటుంది. ఎయిర్ ఫైబర్ వైర్‌లెస్ పరికరం కావడంతో రూటర్ ఏర్పాటు చేసేందుకు టెక్నిషియన్ కూడా అవసరం లేదు. కాగా జియో యాడ్ ప్రకారం.. 5జీ స్పీడ్ 1.5 జీబీపీఎస్ వరకు ఉంది. ఇదే స్పీడ్‌ను సెల్యులర్ 5జీ నెట్‌వర్క్‌పైన కూడా అందిస్తోంది. వైర్‌లెస్ టెక్నాలజీ కావడంతో ట్రూ-5జీ టెక్నాలజీతో కంపెనీ దీనిని రూపొందించింది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ ‘ఎన్ఎస్ఏ టెక్నాలజీని (నాన్-స్టాండాలోన్) ఉపయోగిస్తోంది.
రేటు ఎంత?
జియో ఎయిర్‌ఫైబర్2ను కంపెనీ అక్టోబర్ 2022లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (IMC) ప్రదర్శించింది. ఇదే వేదికపై 5జీ నెట్‌వర్క్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కీలక ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఇక జియో పోర్టబుల్ రూటర్స్‌ను (JioFi M2s) రూ.2,800, మెశ్ ఎక్స్‌టెండర్‌ను రూ.2,499, జియో ఎక్స్‌టెండర్6 మెశ్ వై-ఫై సిస్టమ్ రూ.9,999గా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులను జియో తక్కువ రేటుకే అందిస్తోంది కాబట్టి కొత్తగా అందుబాటులోకి రానున్న వైర్‌లెస్ రూటర్ ధర రూ.10,000గా ఉండొచ్చనే అంచనాలున్నాయి. అసలు రేటు ఎంతనేది మాత్రం మార్కెట్‌లోకి వచ్చేవరకు వేచిచూడాల్సిందే.
ఇవి కూడా చదవండి...