ఆసిఫాబాద్ ఇకపై మున్సిపాలిటీ
ABN , First Publish Date - 2023-04-10T22:56:13+05:30 IST
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్) ఇకపై ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా వ్యవహారంలోకి రానుంది. ఆరు సంవత్సరాల తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సోమవారం ఆమోదముద్ర వేయడంతో మేజర్‌పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ పురపాలక సంఘంగా కొత్తరూపు సంతరించుకోనుంది.

- ఫైల్‌కు ఆమోదముద్ర వేసిన గవర్నర్
- 2019 మున్సిపల్ చట్టానికి అనుగుణంగా ఏర్పాటు
- ఇరవై వార్డులు, 23 వేల జనాభా
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్)
ఇకపై ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా వ్యవహారంలోకి రానుంది. ఆరు సంవత్సరాల తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సోమవారం ఆమోదముద్ర వేయడంతో మేజర్‌పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ పురపాలక సంఘంగా కొత్తరూపు సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చగా, ఆసిఫాబాద్ ప్రతిపాదనలకు ఐదవ షెడ్యూలు అడ్డంకిగా మారింది. ఆసిఫాబాద్ పట్టణంలో భాగంగా ఉన్న రాజంపేట 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపినా కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర లభించలేదు. దాంతో జిల్లా అధికార యంత్రాంగం మరోసారి మార్పులు చేర్పులు చేస్తూ ఏజెన్సీ ప్రాంతమైన రాజంపేటను ఈ ప్రతిపాదనల నుంచి మినహాయించారు. తాజాగా పంపిన ప్రతిపాదనల ప్రకారం ఆసిఫాబాద్, జనకాపూర్, గొడవెల్లి గ్రామాలను కలుపుతూ 23వేల 333జనాభాతో 20 వార్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను సవరించారు. జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం యథాతధంగా ఆమోదిస్తూ తీర్మానించి గవర్నర్ ఆమోదం కోసం బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన అన్ని బిల్లులతోపాటు మున్సిపల్ ఏర్పాటు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో నేటి నుంచి అసిఫాబాద్ మేజర్ పంచాయతీ ఇక మున్సిపాలిటీగా మనుగడలోకి రానుంది.