Telangana Rains : తెలంగాణను వదలనంటున్న వానలు.. మళ్లీ భారీ వర్షాలు.. సోమవారం కూడా సెలవు..!?
ABN , First Publish Date - 2023-07-29T22:31:48+05:30 IST
తెలంగాణను భారీ వర్షాలు (Telangana Rains) ఇప్పట్లో వదలనంటున్నాయి.!. వారంపాటు హైదరాబాద్ (Hyderabad) , వరంగల్‌తో (Warangal) పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచికొట్టిన భారీ వర్షాలు.. రెండ్రోజులుగా కాస్త గ్యాప్ ఇచ్చాయి. వర్షం అయితే పడట్లేదుగానీ వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...
తెలంగాణను భారీ వర్షాలు (Telangana Rains) ఇప్పట్లో వదలనంటున్నాయి.!. వారంపాటు హైదరాబాద్ (Hyderabad) , వరంగల్‌తో (Warangal) పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచికొట్టిన భారీ వర్షాలు.. రెండ్రోజులుగా కాస్త గ్యాప్ ఇచ్చాయి. వర్షం అయితే పడట్లేదుగానీ వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాల థాటికి రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మరణించారు. వరదల్లో పలుచోట్ల గల్లంతయ్యారు కూడా. అయితే ఆస్తి నష్టం, పంట నష్టం ఎంత వాటిల్లింది అనేది అంచనా వేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పుడిప్పుడే మోరంచపల్లె వరద బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇంటికెళ్తున్నారు. ఇళ్లలో ఎక్కడికక్కడ బురద, వస్తువులు, నిత్యావసరాలు పాడవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. ఎక్కడ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వరదలు తగ్గా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు, వరదల నుంచి ఊపిరిపీల్చుకుంటున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో బాంబ్ లాంటి వార్త చెప్పింది.!
మళ్లీ వానలొస్తున్నాయ్..!
ఆగస్టు-01, 02 తేదీల్లో మళ్లీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీచేసింది. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం వర్షం కురిసే ఛాన్స్ లేదని అధికారులు చెబుతుండటంతో నగర ప్రజలు కాసింత ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా మీద కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కొనసాగిన అల్పపీడనం.. అది బలహీనపడి ఒక్కరోజులోనే మరొకటి ఏర్పడటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతతో మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
సెలవుకు ఛాన్స్..!
వర్షాలు తగ్గినా వరద నుంచి పట్టణాలు, గ్రామాలు ఇంకా తేరుకోలేదు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 5వేల పాఠశాలల్లోకి (Schools) వరద వచ్చింది. మరో 3వేల స్కూళ్లలో ఎక్కడికక్కడ బురద పేరుకుపోయింది. ఇంకో 6 వేల పాఠశాలల్లో విద్యుత్ బోర్డుల్లోకి నీరు చేరడం కరెంట్ సరఫరా ఆగిపోయింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలోని పలుగ్రామాలు రాకపోకలు లేకపోవడం, ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి, హాస్టల్‌కు వెళ్లడానికి కష్టమవుతుందని.. సోమవారం కూడా సెలవు (Monday Holiday) ప్రకటించాలని స్టూడెంట్స్, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఆగస్టు-01, 02 తారీఖుల్లో వర్షాలున్నాయని వార్తలు వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగినట్లయ్యింది. అటు వర్షాలు.. ఇటు మలేరియా, ఇతర వ్యాధులూ వచ్చే అవకాశం ఉండటంతో సోమవారం (July-31st) కూడా పనిచేయడం కష్టమేనని సెలవు ఇవ్వాల్సిందేనని అధికారులు, టీచర్లు కూడా కోరుతున్న పరిస్థితి. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. సోమవారం సెలవుపై ఆదివారం ఉదయం లేదా మధ్యాహ్నం ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అంతా నష్టమే..!
ఇదిలా ఉంటే.. భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 55 అడుగులకు చేరుకోగా.. శనివారం రాత్రికి 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో 5 మండలాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada) తెలిపారు. ఇప్పటి వరకు 12వేల మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని.. వారికి ఆహారం, మంచినీరు అందిస్తున్నట్టు పువ్వాడ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, వరదలతో 1,064 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్ల మరమ్మతులకు సుమారు వెయ్యి కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తానికి చూస్తే.. ఈ వారం రోజులు కురిసిన వర్షాల థాటికి రాష్ట్ర ప్రజలు పూర్తిగా కోలుకోకముందే మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన మొదలైంది.