Vijayashanthi: ఇలాంటివి జరిగాక మాత్రం అయ్యో చంపేశారంటున్నారు...

ABN , First Publish Date - 2023-04-17T22:52:03+05:30 IST

ఎన్‌కౌంటర్లపై విపక్షాల తీరును బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తప్పుబట్టారు.

Vijayashanthi: ఇలాంటివి జరిగాక మాత్రం అయ్యో చంపేశారంటున్నారు...
Vijayashanthi comments on UP encounters

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో(Prayagraj) గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ హత్యలపైన... అలాగే అంతకు ముందు అతీఖ్ తనయుడు అసద్, గులాంల ఎన్‌కౌంటర్లపై విపక్షాల తీరుపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

విజయశాంతి సోషల్ మీడియా పోస్ట్ యథాతథంగా

ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు హత్యకు గురికావడం, అతీక్ కుమారుడు ఎన్‌కౌంటర్ అయిన ఘటనల్లో సీఎం యోగి ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పుబడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఎన్‌కౌంటర్ వంటి ఘటనల్ని నేను సమర్ధించను కానీ, రాజ్యాంగబద్ధమైన పదవులు నిర్వహించిన అతీక్... ఘోరమైన నేరాలకు పాల్పడి, వందకు పైగా కేసులు ఎదుర్కుంటున్న ఒక గ్యాంగ్‌స్టర్. తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని సైతం క్రిమినల్స్‌గా తయారు చేసి, క్రూరమైన హత్యల్లో సూత్రధారిగా ఉన్న సంగతి యూపీలో అందరికీ తెలుసు. ఇటువంటి వ్యక్తికి యూపీలో ఒకనాడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ చోటిచ్చి, ఎన్నికల్లో ప్రోత్సహించి, కొన్ని దశాబ్దాల పాటు అతని నేరాలకి ఊతమిచ్చింది. ప్రభుత్వమే అండగా నిలిచిన పరిస్థితుల్లో అతీక్ లాంటి వ్యక్తులకు అంత త్వరగా శిక్ష పడుతుందా? పాలక యంత్రాంగంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమై... అతీక్ లాంటి సంఘవిద్రోహుల బాధితులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే స్థితి చోటు చేసుకుంటోంది. అతీక్ విషయంలో జరిగింది అదే... ఈ ఒక్కటే కాదు, గతంలో తెలంగాణలో జరిగిన దిశ హత్య, అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలోనూ ఇలాంటి పరిస్థితులు కనబడతాయి. తీవ్ర నేరాల్లో సైతం దోషులకి త్వరగా శిక్షలు పడని పరిస్థితుల్లో... వీరికి చట్టప్రక్రియలకు భిన్నమైన మార్గంలో సత్వర శిక్ష అమలు కావడాన్ని ప్రజల్లోని కొన్ని వర్గాలు ఆమోదిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, సంఘటనలు జరిగాక మాత్రం అయ్యో చంపేశారంటూ... ఆవేదన వినిపిస్తుంటుంది. ఎక్కడైనప్పటికీ తప్పుచేసినవారికి సత్వరమే శిక్షపడేలా వ్యవస్థల్లో మార్పు చేసుకుంటే అతీక్ లాంటి వ్యక్తులు తయారుకారు... ఎన్‌కౌంటర్ లాంటి పరిస్థితులు చోటు చేసుకోవు.... అని విజయశాంతి తన సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో(Prayagraj) గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ హత్యలపై పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ తరుణంలో పోలీసుల దృష్టి అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్‌(Shaista Parveen)పై పడింది. అతీఖ్, అష్రఫ్‌ల అంత్యక్రియలకు కూడా ఆమె హాజరుకాకపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు జల్లెడ పడుతున్నారు. అంత్యక్రియలకు షైస్తా పర్వీన్‌ తప్పకుండా హాజరవుతారని ప్రచారం జరిగినా అలా హాజరుకాలేదు. పరారీలో ఉన్న ఆమె తలపై 50 వేల రూపాయల రివార్డ్ కూడా ఉంది. భర్తను హత్య చేశారని తెలియగానే షైస్తా పర్వీన్‌ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. షైస్తా పర్వీన్‌ లొంగిపోతారనే ప్రచారం ఉత్తిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు ఫిబ్రవరి 24న న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య సమయంలో బాంబులు విసిరిన గుడ్డూ ముస్లిం కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తాజాగా అతడి కదలికలు కర్ణాటకలో బయటపడినట్లు సమాచారం. ఉమేశ్‌ పాల్‌పై అతీఖ్ తనయుడు అసద్, అతడి స్నేహితుడు గులాం కాల్పులు జరుపుతుండగా గుడ్డూ ముస్లిం నాటు బాంబులు విసిరాడు. నాటు బాంబులు అత్యంత వేగంగా తయారు చేయడంతో పాటు విసరడంలోనూ గుడ్డూ ముస్లిం నిపుణుడని, అతీఖ్ మాఫియా గ్యాంగ్‌లో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో గుడ్డూ ముస్లిం ఆచూకీ బయటపడితే అతీఖ్‌ నేర సామ్రాజ్యానికి, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు, ఐఎస్ఐకి ఉన్న సంబంధాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.

అతీక్‌, అష్రాఫ్‌ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి (Yogi) ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్‌ కమిటీని, సిట్‌ను నియమించారు. డీజీపీ నుంచి ఆయన ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ అంతటా అప్రమత్తత ప్రకటించారు. యూపీలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఇంటర్‌నెట్ సర్వీసులు నిలిపివేశారు. పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. సీఎం కార్యక్రమాల్లో ఏ మార్పూ లేదని, యథావిథిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అతీక్‌, అష్రాఫ్‌ హత్యల నేపథ్యంలో యోగికి భద్రత పెంచారని తెలిసింది. యోగి ఆదిత్యనాథ్ అతి త్వరలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను కాల్చి చంపిన లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్యలను భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాగ్ రాజ్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు.

అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను ఈ నెల 15న ప్రయాగ్‌రాజ్‌లోని కెల్విన్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా.. లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య మెడలో మీడియా ఐడీ కార్డులు ధరించి, అక్కడకు చేరుకున్నారు. దుండగుల్లో ఒకడు అతీక్‌ కణతపై రివాల్వర్‌ను పెట్టి, ట్రిగ్గర్‌ నొక్కేశాడు. అతీక్‌ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే దుండగులు అష్రాఫ్‌ వైపు వచ్చి.. అతణ్నీ కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా.. కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులను కొనసాగించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ ముగ్గురూ తమకు అతీక్‌తో ఉన్న పాతకక్షల వల్లే ఆ ఘాతుకానికి పాల్పడ్డట్లు అంగీకరించినట్లు తెలిసింది. అంతే కాదు ఈ హత్య ద్వారా మాఫియాలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడం కూడా లక్ష్యమని విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇతర సమయాల్లో అతీక్‌ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం కష్టమని, పోలీసులు వారిద్దరినీ జైలుకు తరలిస్తే మళ్లీ చాన్స్‌ దొరకదని చెప్పిట్లు సమాచారం. అందుకే మీడియా ముసుగులో అతీక్‌కు అతి సమీపానికి వచ్చాక.. ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు హంతకులూ టర్కీలో తయారైన అత్యాధునిక పిస్టళ్లను వాడారు. మరో గ్యాంగ్‌స్టర్ సుందర్ భాటి (Sunder Bhati) నుంచి వీరు ఈ ఆయుధాలను సమకూర్చుకున్నట్లు సమాచారం. ఒక్కో పిస్టల్ ఖరీదు ఆరు లక్షలకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముగ్గురు హంతకులు కూడా పేద కుటుంబాల వారేనని, వారికి ఆ ఆయుధాలను కొనే ఆర్ధిక స్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అసలు విషయాలు బయటకు రానున్నాయి.

Updated Date - 2023-04-17T23:25:48+05:30 IST