BRS MLAs Poaching Case: హైదరాబాద్‌లో బీఎల్ సంతోష్ వాల్‌పోస్టర్ల కలకలం..
ABN , First Publish Date - 2023-03-15T22:12:56+05:30 IST
భాగ్యనగరంలో మరోసారి వాల్ పోస్టర్ల కలకలం రేగింది.
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి వాల్ పోస్టర్ల కలకలం రేగింది. బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(BL Santosh) ఫొటోతో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు ముద్రించి రోడ్లపై అతికించారు. “కనబడుట లేదు..” అంటూ బీఎల్ సంతోష్ ఫొటోలతో పోస్టర్లు అతికించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించారు. “ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు”.. అని పోస్టర్లలో ప్రచురించారు. పట్టిచ్చిన వారికి బహుమానం అని కూడా పోస్టర్లలో ముద్రించారు. బీఎల్ సంతోష్‌ను పట్టిస్తే.. మోదీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు బహుమానం అంటూ పోస్టర్లలో ప్రచురించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(BRS MLAs Poaching Case) సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే పోస్టర్లు వెలియడంపై బీజేపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్(BRS) నేతల పనేనని కమలనాథులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో తమను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక) ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.