Laxman: రాష్ట్రంలో పాలన పడకేసింది
ABN , First Publish Date - 2023-05-11T13:30:46+05:30 IST
రాష్ట్రంలో పాలన పడకేసిందని.. కేసీఆర్ పక్తూ రాజకీయాలకు పరిమితం అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో పాలన పడకేసిందని.. కేసీఆర్ పక్తూ రాజకీయాలకు పరిమితం అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ (BJP Leader Laxman) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేస్తున్నారన్నారు. వారిని అణిచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా.. కేసీఆర్ (CM KCR) ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కూడా సీఎం అణిచివేస్తున్నారన్నారు. రైతు నష్టాలపై సమీక్ష చేసే సమయం కూడా ముఖ్యమంత్రి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు.
అమ్మకు అన్నం పెట్టేవాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక్కడి రైతులను ఆదుకోని కేసీఆర్ అబ్కీబార్ కిసాన్ సర్కారు అంటూ దేశ రాజకీయాలకు వెళ్తా అంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను రాజకీయాలకు అతీతంగా ఖండించాలని... కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఉక్కు పాదంతో అణిచి వేయాలని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే పీపుల్స్ పల్స్ నమ్ముతామని.. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే నమ్మకం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు.