Flood Effect: డేంజర్ బెల్స్ మోగిస్తున్న హుస్సేన్‌సాగర్.. తెలంగాణ ప్రాజెక్టులకు సైతం పోటెత్తుతున్న వరద
ABN , First Publish Date - 2023-07-22T10:17:59+05:30 IST
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. భారీ వరదతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇన్‌ఫ్లో అధికంగా వస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. భారీ వరదతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇన్‌ఫ్లో అధికంగా వస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద పోటు అధికంగా ఉంది. హుస్సేన్‌సాగర్ (Hussainsagar) డేంజెర్ బెల్స్ మోగిస్తోంది. తీవ్రస్థాయిలో హుస్సేన్‌సాగర్‌కు వరద తీవ్రస్థాయిలో పోటెత్తుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్పల్లి నాళాల నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి 40 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. హుస్సెనసాగర్లో నీటి మట్టం ఫుల్ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.62 మీటర్లుగా ఉంది. అలాగే హుస్సెన్‌సాగర్ ఫుల్ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుగా ఉంది. తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి 5800 క్యూసెక్కుల నీటిని మూసిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ (GHMC) అప్రమత్తం చేసింది. అలాగూ ఉస్మాన్‌సాగర్‌కు (Osman Sagar) కూడా వదర తాకిది అధికంగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ఇన్ ఫ్లో 800 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1785.65 అడుగులకు చేరింది.
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలో ఐఎండీ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 24న మరో అల్ప పీడనం ఏర్పడనుందని.. రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి మెదక్‌లలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది.
నిజామాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,49,995 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 1079 అడుగులు, 49.968 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 34,588 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1393.75 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.895 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ఇన్ ఫ్లో 6,10,250 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 7,10,250 క్యూసెక్కులుగా ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్ట్ 75 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. త్రివేణి సంగమం కాళేశ్వరం పుష్కర ఘాట్ 11.200 మీటర్ల మేర గోదావరి ప్రవాహం కొనసాగుతోంది.
మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 1లక్ష 78 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో లక్షా 70 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 17.7581 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 65 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 78 వేల క్యూ సెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 687.5అడుగులకు చేరింది.
నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 5, 849.00 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7,759.00 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642.10 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.70 టీఎంసీలుగా ఉంది.
మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తు వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు దాదాపు 20 గేట్లు ఎత్తివేసి లక్షా 78 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2లక్షల 33 వేల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 17.9526 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
సింగూరు ప్రాజెక్ట్, గోదావరి పరిస్థితి ఇదీ...
మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9470 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 385 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 20.564 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదవరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39.5 అడుగులకు చేరింది. దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా కొనసాగుతోంది.