Vijayashanthi: బండి సంజయ్ వ్యాఖ్యలపై అర్వింద్ ప్రకటనపై స్పందించిన రాములమ్మ
ABN , First Publish Date - 2023-03-13T22:43:56+05:30 IST
బండి సంజయ్(Bandi Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని ఎంపీ అర్వింద్ అనడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) స్పందించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని ఎంపీ అర్వింద్ అనడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విజయశాంతి పోస్ట్ యథాతథంగా
ధర్మపురి అర్వింద్(Arvind Dharmapuri) ప్రకటనపై నన్ను మీడియా వారు అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా...
"బీజేపీ నేత ఎవరైనా... పార్టీ కార్యకర్త, నేత లేదా అధ్యక్షుల కామెంట్స్ పై స్పందించినా... మాట్లాడినా... అది పార్టీ సమావేశాల్లో జరిగితే, ఎప్పుడూ కూడా అది అంతర్గత ప్రజాస్వామ్య విధానంగా పార్టీ పరిగణిస్తాది. ఆ కామెంట్స్‌ని సందర్భ, సమయ, సమస్య పరిస్థితుల ప్రామాణికతతో విశ్లేషించడం... అవసరమైన నిర్ణయం చెప్పడం కూడా సహజంగా పార్టీ విధానం. పై కామెంట్ మీద నన్ను మీరు అడిగిన ప్రశ్నకైనా... నేను పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే నా అభిప్రాయం చెప్పగలను."
మా పార్టీ ఎంపీ అర్వింద్ మాట్లాడిన సందర్భం మొత్తం నేను చూడలేదు కానీ, అందులోని ఏదో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న బీఆర్ఎస్ అనుకూల మీడియాకు మాత్రం ఒక్కటే ఈ సందర్భంగా చెప్పగలను.
సంజయ్ తన మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తే... కేసీఆర్, వారి కుటుంబం, చాలామంది బీఆరెస్ నాయకులు వారి గత, ఇప్పటి మాటలను అనేకసార్లు వెనక్కి తీసుకుని, వందల సార్లు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని కూడా ఆ మీడియా గుర్తించాలని" విజయశాంతి అన్నారు.
అంతకు ముందు నిన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ స్పందించారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైన వ్యాఖ్యలని, బీజేపీకి, ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదన్నారు. బండి సంజయ్ మాట్లాడిన దానికి ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాలని అర్వింద్ సూచించారు. తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయని, అవి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అర్వింద్ సూచించారు. కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌కు ఆయుధం ఇచ్చినట్లయిందన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని బండి సంజయ్ ఇటీవల వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.