కూలిన టీఐఎఫ్‌ఆర్ బెలూన్
ABN , First Publish Date - 2023-02-19T23:04:12+05:30 IST
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్(టీఐఎఫ్‌ఆర్)కు సంబంధించిన బెలూన్ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆదివారం కూలి పోయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తర్నికల్ శివారులో కూలిన యంత్రాలు
ఊర్కొండ, రాచాలపల్లి శివారులో బెలూన్
హైదరాబాద్ తీసుకెళ్లిన శాస్త్రవేత్తలు
కల్వకుర్తి, ఫిబ్రవరి 19 : టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్(టీఐఎఫ్‌ఆర్)కు సంబంధించిన బెలూన్ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆదివారం కూలి పోయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉన్న టీఐఎఫ్‌ఆర్ బెలూన్ ఫెసిలిటీ నుంచి ఈనెల 17న బెలూన్‌ను ప్రయోగించారు. అది ఆరు రోజుల పాటు వాతావరణంలో ఉండాల్సి ఉంది. కానీ ఆదివారం ఉదయం ఊర్కొండ - రాచాలపల్లి శివారులో ఓ చెట్టుకు తగిలి కింద పడిపోయింది. యంత్రాలు కల్వకుర్తి మండలం తర్నికల్ శివారులోని బస్వారెడ్డి పొలంలో పడ్డాయి. వాటిని గుర్తించిన రైతు బస్వారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. టీఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తలు ప్రవీణ్‌రెడ్డి, హరినాయక్ బృందం అక్కడికి చేరుకొని పరికరాలను వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. టీఐఎఫ్‌ఆర్ బలూన్‌ను తాము పర్యవేక్షించామని, జనం లేని చోట పడిపోయేలా చేశామని శాస్త్రవేత్తలు చెప్పినట్లు కల్వకుర్తి ఎస్‌ఐ రమేష్ తెలిపారు.