నాడు వెనుకబడిన గ్రామం.. నేడు అభివృద్ధిలో పరుగులు

ABN , First Publish Date - 2023-02-24T23:41:20+05:30 IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ ఒకప్పుడు వెనుకబడిన గ్రామంగా పేరుంది. కానీ ఇప్పుడు ఆ ఊరు సకల అస్తిత్వానికి నిలయంగా మారింది.

నాడు వెనుకబడిన గ్రామం.. నేడు అభివృద్ధిలో పరుగులు

రాజకీయంగానూ దూసుకెళుతున్న మీర్జాపూర్‌

నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న హరీశ్‌రావు

హుస్నాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 24 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ ఒకప్పుడు వెనుకబడిన గ్రామంగా పేరుంది. కానీ ఇప్పుడు ఆ ఊరు సకల అస్తిత్వానికి నిలయంగా మారింది. మీర్జాపూర్‌ గ్రామం ఇప్పుడు అభివృద్ధిలో, రాజకీయంగా దూసుకెళ్తుంది. విద్య, వైద్యరంగంలో ముందుంది. ఇక్కడి నుంచి గతంలో గిరిజన తెగకు చెందిన భూక్య మంగ జనరల్‌ స్థానంలో ఎంపీటీసీగా గెలిచి హుస్నాబాద్‌ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. గ్రామం నుంచి బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడిగా ఎడబోయిన తిరుపతిరెడ్డి రెండు పర్యాయాలు బాధ్యతలు చేపట్టారు. తదననంతరం ఆయనకు మార్కెట్‌ చైర్మన్‌ పదవి వరించింది. ఉమ్మడి మీర్జాపూర్‌ గ్రామం.. ప్రస్తుత బల్లునాయక్‌ తండా నుంచి అక్కన్నపేట జడ్పీటీసీగా భూక్య మంగ విజయం సాధించారు. ఇదే గ్రామానికి చెందిన లకావత్‌ మానస జనరల్‌ స్థానంలో ఎంపీటీసీగా గెలిచి హుస్నాబాద్‌ ఎంపీపీ స్థానం దక్కించుకున్నది. ఉమ్మడి మీర్జాపూర్‌.. ప్రస్తుత వంగరామయ్యపల్లికి చెందిన వంగ వెంకట్రామారెడ్డి రెండు పర్యాయాలుగా బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడ గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాల కూడా ఏర్పాటైంది. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. హుస్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రి ఉన్నత శ్రేణి ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీర్జాపూర్‌కు మంజూరైంది. పక్కా భవనం కోసం మంత్రి హరీశ్‌రావు రూ.2కోట్లు మంజూరు చేశారు. శనివారం హరీశ్‌రావు పీహెచ్‌సీని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ కృషితో మాజీ మార్కెట్‌ చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి సతీమణి ఎడబోయిన రజినీకి మార్కెట్‌చైర్‌పర్సన్‌ పదవి వరించింది. ఆమె మంత్రి సమక్షంలో శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాడు వెనుకబాటుకు గురైన మీర్జా‘పూర్‌’ నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తుండడం విశేషం.

Updated Date - 2023-02-24T23:41:20+05:30 IST